ఒక జంట.. రెండు ఏనుగు పిల్లలు.. ఒక ఆస్కార్!

‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్’.. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన దంపతుల కథ.. 42 నిమిషాల సినిమా! కనిపించేది ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగు పిల్లలే.. కానీ చిత్రీకరించింది మాత్రం 450 గంటల ఫుటేజీ! ప్రపంచ దృష్టినీ, దాంతోపాటు...

Published : 13 Mar 2023 20:44 IST

(Photo: Twitter)

‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్’.. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన దంపతుల కథ.. 42 నిమిషాల సినిమా! కనిపించేది ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగు పిల్లలే.. కానీ చిత్రీకరించింది మాత్రం 450 గంటల ఫుటేజీ! ప్రపంచ దృష్టినీ, దాంతోపాటు తాజాగా ఆస్కార్ అవార్డునీ సొంతం చేసుకున్న ఈ చిత్రం విజయం వెనుక ఇద్దరు మహిళలు ఉన్నారు.

కార్తికి గోన్‌సాల్వెస్

‘మహిళలు, గిరిజన తెగలు, ప్రకృతి, మూగజీవాల గొంతుక అవ్వాలనుకున్నా. అందుకు నేను ఎంచుకున్న మార్గం ఫొటోగ్రఫీ! ప్రజల్లో మార్పు తేవడానికి నాకు కనిపించిన అత్యంత ప్రభావవంతమైన ఆయుధమిది’ అంటారు ఈ చిత్ర దర్శకురాలు కార్తికి. ఈవిడ దృష్టి రెండు అంశాల పైనే! పర్యావరణం, వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాల ద్వారా జీవావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. అడవుల్లో జీవనం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం. అందరూ సంపాదనలో పడితే.. తను ప్రకృతి చుట్టూ తిరగడానికి కుటుంబమే కారణమంటారు కార్తికి.

‘నాన్న ఫొటోగ్రాఫర్‌, అమ్మకేమో మూగజీవులంటే ఇష్టం. బామ్మ పర్యావరణ ప్రేమికురాలు. మమ్మల్నే కాదు.. చుట్టు పక్కల పిల్లల్నీ అడవులు, జంతు ప్రదర్శన శాలలు, పర్వతాల చుట్టూ తిప్పేది. ముగ్గురి అభిరుచులన్నీ నాకబ్బాయి’ అని నవ్వేస్తారామె. కార్తికిది ఊటీ. దగ్గర్లోని నీలగిరి జీవావరణ రిజర్వ్‌లోనే పెరగడంతో వన్యజీవులపై అవగాహన, ప్రేమ ఏర్పడ్డాయి. ‘మొదట ఫొటోగ్రాఫర్‌ అవ్వడమే లక్ష్యం. అందుకే విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో పీజీ చేశా. తర్వాత మనసు మాట విని ప్రకృతి, దాని చుట్టూ జీవనంపై దృష్టిపెట్టా’ అంటారు.

సినిమా ఆలోచనెలా?

అయిదేళ్ల క్రితం.. ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించారామె. వాళ్లిద్దరి అనుబంధం కార్తికిని ఆశ్చర్యపరిచింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పారు. ఆ సంఘటన కార్తికి కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ తీసేలా ప్రేరేపించింది.

‘నా సినిమాలోని బొమన్‌, బెల్లీ ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే. వాళ్ల అనుబంధమే కథగా తీశా. దాన్ని హడావుడి కథగా ముగించడం ఇష్టం లేదు. భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దానికోసం నేను ముందు 18 నెలలు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని చిత్రీకరించాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే బొమన్‌, బెల్లీ పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్‌ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది. మొత్తం అటవీ ప్రాంతం కదా.. కొన్ని అపాయాలూ తప్పలేదు. అయినా అవన్నీ అందమైన అనుభవాలే’ అనే 36 ఏళ్ల కార్తికి మొదటి సినిమాకే ఆస్కార్ అవార్డు పొందారు. తన కథ మానవ జీవనంలో ప్రకృతి ఆవశ్యకతపై కొందరిలోనైనా అవగాహన కలిగిస్తే చాలంటారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


గునీత్ మోంగా

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ సినిమాకు నిర్మాతా ఓ మహిళే. తనే గునీత్ మోంగా. అమ్మకు సొంత ఇల్లు కొనివ్వాలన్న లక్ష్యం! దీనికోసం డీజే, ఇన్సూరెన్స్‌, సేల్స్‌ ఏజెంట్‌, డ్రైవర్‌.. ఇలా చేయని పని లేదు. అంతటి పేదింటి అమ్మాయి.. గునీత్ నిర్మాతగా మారారు. తన సినిమాలతో అంతర్జాతీయంగా ప్రముఖులను మెప్పించారు. ఇప్పుడు ఆస్కార్‌నూ గెలుచుకున్నారు.

ఏం తెలుసని..?

‘బయటి అమ్మాయి’, ‘ఏం తెలుసని సినిమాలు నిర్మిస్తుంది?’ గునీత్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు ఇలాంటివెన్నో ఎదుర్కొన్నారు. దిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. తనకోసం నిలబడిన అమ్మ సొంతిల్లు కల నిజం చేయాలని 16 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టారు గునీత్‌. చీజ్‌ అమ్మడం దగ్గర్నుంచి మార్కెటింగ్‌ ఏజెంట్‌ వరకూ ఎన్నో పనులు చేశారు. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసి స్నేహితురాలి తల్లి దగ్గరే ఇంటర్న్‌గా చేరారు. తన ఇంటి పక్కన వ్యక్తి చిన్నపిల్లల కోసం వీడియోలు చేయాలనుకున్నారు. బడ్జెట్‌ రూ.50 లక్షలు. విషయం తెలిసి ‘ఆ మొత్తమేదో సినిమాల్లో పెట్టొచ్చుగా’ అన్న సలహా ఇచ్చారామె. ‘నాకు అనుభవం లేదు. నువ్వు ప్రయత్నిస్తావా’ అన్న ఆయన మాటతో ఆ మొత్తం తీసుకొని ముంబయి వచ్చేశారు. ఎన్నో కథలు విని క్రికెట్‌ నేపథ్యంలో సాగే ‘సే సలామ్‌ ఇండియా’కి సహనిర్మాత అయ్యారు. కానీ సినిమాను ఎవరూ తీసుకోలేదు. పెట్టుబడి మొత్తం పోయింది. డబ్బులిచ్చిన వ్యక్తి నిందించకపోయినా డబ్బులు పోగొట్టానన్న అపరాధ భావన! చిన్నప్పుడు స్నేహితులంతా కలిసి డబ్బులు పోగేసుకొని సినిమాకెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. అలా విద్యార్థులకు నామమాత్రపు మొత్తంతో సినిమా చూపించి పెట్టుబడి రాబట్టగలిగారు. అదిచ్చిన ఆత్మవిశ్వాసం ఆమెను వెనక్కి తిరిగి చూడనివ్వలేదు.

మరుసటి ఏడాది.. 2008లో ‘సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌’ ప్రారంభించి, సినిమాలు నిర్మించారు. అన్నీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇల్లు కొందామనుకుంటే అమ్మ క్యాన్సర్‌ బారిన పడి మరణించింది. కొన్ని నెలలకే నాన్న కూడా వెళ్లిపోయాడు. అప్పటికి ఆమె వయసు 24. అప్పుడే ఆడవాళ్ల సమస్యలపై దృష్టిపెట్టారామె. 2012లో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ లాభాలు తెచ్చిపెట్టడమే కాదు కేన్స్‌లోనూ ప్రదర్శితమైంది. తర్వాత అయ్యా, షాహిద్‌, ద లంచ్‌బాక్స్‌.. ఫ్రాన్స్‌, జర్మనీల్లోనూ ప్రశంసలు అందుకున్నాయి. బీఏఎఫ్‌టీఏతోపాటు ఆస్కార్‌ నామినేషన్స్‌నీ దక్కించుకున్నాయి. గర్ల్‌ ఇన్‌ ఎల్లో బూట్స్‌, పెడ్లర్స్‌, మాసన్‌, పగ్లియత్‌ .. నిన్నటి ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ వరకు ఆమె సినిమాలన్నీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నవే.

50 మంది అత్యుత్తమ మహిళల్లో ఒకరిగా..!

‘చిన్నదాన్ని. సినిమా నేపథ్యం లేదు. సీరియస్‌గా ఎలా తీసుకుంటారు? కానీ ప్రయత్నిస్తూ వెళ్లడమే నా పని అని బలంగా నమ్మా. కాబట్టే ఒత్తిడి అనిపించలేదు’ అనే గునీత్‌ ప్రపంచంలోనే 12 మంది అత్యుత్తమ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఓ అమెరికన్‌ మ్యాగజీన్‌ సినీ పరిశ్రమలో 50 మంది అత్యుత్తమ మహిళల్లో ఈమె ఒకరని పేర్కొంది. ఇలాంటి పురస్కారాలు, గుర్తింపులెన్నో! నిజానికి 2018లో ఆమె సహనిర్మాతగా ఉన్న ‘పీరియడ్‌.. ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’కి ఆస్కార్‌ దక్కింది. కానీ ‘అది టీమ్‌ విజయం.. నాది కాదు’ అని సున్నితంగా తిరస్కరిస్తారామె. అయితే మొత్తమ్మీద ఈ ఏడాది ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’తో ఆస్కార్ కల నెరవేర్చుకున్నారామె.

మరి, మన భారతీయ మహిళల ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటిన ఈ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పేద్దామా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్