పొడిబారిన చేతులు.. మళ్లీ మృదువుగా..!

మనం రోజూ నీటితో చేసే వివిధ పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతాయి.. నిర్జీవంగా మారిపోతాయి.. మరి దీనికి పరిష్కారం..? ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలే అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం రండి..

Published : 07 Mar 2024 14:36 IST

మనం రోజూ నీటితో చేసే వివిధ పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతాయి.. నిర్జీవంగా మారిపోతాయి.. మరి దీనికి పరిష్కారం..? ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలే అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం రండి..

ఆలివ్‌ ఆయిల్, చక్కెరలతో తయారుచేసిన స్క్రబ్ పొడిబారిన చేతులను కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది. ఇందుకోసం అరకప్పు చక్కెరలో టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇందులో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా తీసుకొని దాన్ని చేతులపై రాసుకొని రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పొడిబారిన చేతులు తిరిగి కోమలంగా మారతాయి.

నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ ముక్కల్ని చక్కెర పొడిలో అద్దుతూ చేతులు, మణికట్టుపై ఇరవై నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. పాదాలు పొడిబారినా ఈ చిట్కా ఉపయోగించచ్చు. అయితే ముఖానికి మాత్రం దీన్ని ఉపయోగించద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే సున్నితంగా ఉండే ముఖ చర్మంపై నిమ్మకాయను నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు.

కలబంద గుజ్జు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చేతులకు రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చేతులు పొడిబారడం తగ్గుతుంది.

పొడిబారిన చేతుల్ని కోమలంగా మార్చే సుగుణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ కొద్దిగా తేనె తీసుకొని చేతులకు రాసుకోవాలి. ఇలా అరగంట పాటు ఉంచుకొని ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

పొడిబారిన చేతులకు తేమను తిరిగి అందించడంలో కోడిగుడ్డులోని పచ్చసొన బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా గుడ్డులోని పచ్చసొనను ఒక బౌల్‌లోకి తీసుకొని అది మిశ్రమంగా మారేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతులకు, మణికట్టుపై పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సబ్బు, చల్లటి నీటితో కడిగేసుకుంటే గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల చేతులు కోమలంగా మారతాయి.


పడుకునే ముందు ఇలా..

రోజంతా ఇంటి పనులతో, వృత్తిఉద్యోగాల రీత్యా తీరిక దొరకని వారు పొడిబారిన చేతులకు రాత్రుళ్లు కూడా ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కాస్త కొబ్బరి నూనె లేదా బాదం నూనెను చేతులకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి. ఫలితంగా నూనె చర్మంలోకి బాగా ఇంకి.. పొడిబారిన చర్మాన్ని తిరిగి రిపేర్‌ చేస్తుంది. తేమగా, కోమలంగా మార్చుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్