చలికాలంలో.. చేతులు మృదువుగా..!

కొంతమంది చేతులు మామూలుగానే పొడిబారినట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటివారు చలికాలంలో మరింత ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. శీతల గాలుల ప్రభావం కారణంగా చర్మం మరింత పొడిబారి, నిర్జీవంగా మారి పొట్టు రాలుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని.....

Published : 27 Nov 2022 14:11 IST

కొంతమంది చేతులు మామూలుగానే పొడిబారినట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటివారు చలికాలంలో మరింత ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. శీతల గాలుల ప్రభావం కారణంగా చర్మం మరింత పొడిబారి, నిర్జీవంగా మారి పొట్టు రాలుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్‌లను ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

సాధారణంగా అమ్మాయిల చేతులు చాలా లేతగా, మృదువుగా ఉంటాయి. అయితే చర్మంలోని తేమ స్థాయి తగ్గడం, రసాయనాల ప్రభావానికి ఎక్కువగా గురికావడం.. వంటి కారణాల వల్ల కొంతమందిలో చేతులపై చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. అయితే సహజసిద్ధమైన స్క్రబ్స్ ఉపయోగించి ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు.

అవకాడో+ తులసి..

అవకాడో చర్మానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలిసిందే. చేతులను అందంగా మార్చేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం మెత్తగా చేసుకున్న అవకాడో గుజ్జులో కొద్దిగా తులసి ఆకుల రసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు పట్టించాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే తగినంత తేమ అందడం వల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది.

చక్కెర..

చక్కెర మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. దీన్ని చేతులకూ ఉపయోగించవచ్చు. అయితే రుద్దేటప్పుడు కాస్త సున్నితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా చక్కెర తీసుకొని కొన్ని చుక్కల నీటిని కలిపి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చేతులపై మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం ద్వారా కోమలమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

కలబంద గుజ్జు..

కలబంద గుజ్జు చర్మంలో తేమశాతం తగ్గకుండా కాపాడుతుంది. దీన్ని చేతులకు ఉపయోగించేందుకు కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని అందులో కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చేతులపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపుతో పాటు తేమని కూడా అందిస్తాయి. ఫలితంగా మృదువైన, అందమైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్