అందుకే కెచప్ ఎక్కువగా వద్దు..!

సమోసా, నూడుల్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పఫ్స్‌, పిజ్జాలు.. వీటిలో ఏది తినాలన్నా కెచప్‌ ఉండి తీరాల్సిందే. చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలేసుకుని మరీ దీనిని లాగిస్తుంటారు. అయితే రుచి తప్ప మరే పోషక పదార్థాలు లేని కెచప్‌ను ఎక్కువగా తీసుకోవడం....

Published : 27 Nov 2022 14:12 IST

సమోసా, నూడుల్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పఫ్స్‌, పిజ్జాలు.. వీటిలో ఏది తినాలన్నా కెచప్‌ ఉండి తీరాల్సిందే. చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలేసుకుని మరీ దీనిని లాగిస్తుంటారు. అయితే రుచి తప్ప మరే పోషక పదార్థాలు లేని కెచప్‌ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు పోషక నిపుణులు.

మరీ ఎక్కువ తినద్దు!

కేవలం తాజా టమాటాలతోనే కెచప్‌ను తయారుచేస్తారని చాలామంది అనుకుంటారు. అయితే వీటితో పాటు రుచి కోసం మోతాదుకు మించి చక్కెర, ఉప్పు, ఫ్రక్టోజ్ కార్న్‌ సిరప్‌లు కూడా ఇందులో కలుపుతారు. ఇవి పిల్లల్లో ఊబకాయం, పెద్దల్లో రక్తపోటు సమస్యలకు కారణమవుతాయి. ఇక కెచప్‌లను అధికంగా తీసుకుంటే శరీరంలో షుగర్‌, సోడియం స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల బాడీలో ఖనిజాల అసమతుల్యత ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఊబకాయం, మధుమేహం

కెచప్‌లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషక పదార్థాలు లభించవు. కనీసం ఫైబర్‌, ప్రొటీన్‌ లాంటి పోషకాలు కూడా అందవు. కానీ రుచి కోసం ఇందులో కలిపే చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్‌, ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌లు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌లో ఉండే ట్రైగ్లిజరాయిడ్స్ ఊబకాయానికి దారి తీస్తాయి. అదేవిధంగా ఇన్సులిన్‌ స్థాయుల్లో మార్పులు వచ్చి మధుమేహం తలెత్తే ప్రమాదం ఉంది.

జీర్ణ సమస్యలు

కెచప్‌లలో మలిక్‌ యాసిడ్‌, సిట్రిక్‌ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి ఎసిడిటీతో పాటు గుండెల్లో మంటను కలిగిస్తాయి. దీనికి తోడు వీటిని నూనెలో వేయించిన పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌తో తీసుకోవడం వల్ల మరిన్ని అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అందుకే గ్యాస్ట్రిక్, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు కెచప్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కీళ్ల నొప్పులు

కెచప్‌ లాంటి ప్రాసెస్డ్ పదార్థాలను తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి.

కిడ్నీ సమస్యలు

దీనిని నూనెలో వేయించిన, ప్రాసెస్ చేసిన పదార్థాలతో తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల మూత్రం ద్వారా విసర్జితమయ్యే క్యాల్షియం లెవెల్స్ పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంది.

అలర్జీ సమస్యలు

టమాటా కెచప్‌లలో హిస్టమైన్‌ అధికంగా ఉంటుంది. ఇది తుమ్ములు, దగ్గు వంటి అలర్జీలకు కారణమవుతుంది. కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఇంట్లోనే తయారుచేసుకోండి!

కెచప్‌లు ఎక్కువగా తీసుకుంటే ఎన్ని సమస్యలున్నాయో తెలిసిందిగా. ఈ క్రమంలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఇతర కృత్రిమ పదార్థాలు కలపకుండా ఇంట్లోనే కెచప్‌ను తయారు చేసుకోండి. అలాగే రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకుని స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్