కదలకుండా ప్లాంక్‌ పొజిషన్‌లో నాలుగున్నర గంటలు.. అదరగొట్టేసింది!

రోజుకో అరగంట వ్యాయామం చేయడానికే ఆపసోపాలు పడుతుంటారు చాలామంది. ఇంకాసేపు చేయాల్సి వస్తే మా వల్ల కాదనేస్తుంటారు. ఇక ప్లాంక్‌ వంటి కఠినమైన వ్యాయామాలైతే నిమిషాల్లో ముగిస్తుంటారు. కానీ ఇదే ప్లాంక్‌ పొజిషన్‌లో నాలుగున్నర గంటలకు పైగా నిశ్చలంగా ఉండి తాజాగా ‘గిన్నిస్‌ ప్రపంచ రికార్డు’ సాధించింది డోనా జీన్‌.

Published : 03 Apr 2024 13:22 IST

(Photo: guinnessworldrecords)

రోజుకో అరగంట వ్యాయామం చేయడానికే ఆపసోపాలు పడుతుంటారు చాలామంది. ఇంకాసేపు చేయాల్సి వస్తే మా వల్ల కాదనేస్తుంటారు. ఇక ప్లాంక్‌ వంటి కఠినమైన వ్యాయామాలైతే నిమిషాల్లో ముగిస్తుంటారు. కానీ ఇదే ప్లాంక్‌ పొజిషన్‌లో నాలుగున్నర గంటలకు పైగా నిశ్చలంగా ఉండి తాజాగా ‘గిన్నిస్‌ ప్రపంచ రికార్డు’ సాధించింది డోనా జీన్‌. అలాగని ఆమె యుక్త వయస్కురాలనుకుంటే పొరపాటే! ప్రస్తుతం 58 ఏళ్లున్న ఆమె.. ఈ కఠినమైన ఫీట్‌ చేసి.. ప్రపంచ రికార్డు నమోదు చేయడం విశేషం. మరి, డోనా ఇలా గంటల తరబడి ప్లాంక్‌ పొజిషన్‌లో ఎలా ఉండగలిగింది? ఇందుకోసం ఆమె ఎలా సాధన చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

పది నిమిషాలు అదనంగా..!

సాధారణంగా ప్లాంక్‌ పొజిషన్‌లో పది నిమిషాలకు మించి ఉండలేం.. ఈ క్రమంలో శరీర బరువంతా పొట్ట, చేతులు, కాళ్లపై పడుతుంది. కానీ ఇదే భంగిమను నాలుగున్నర గంటల 11 సెకన్ల పాటు కదలకుండా చేసింది డోనా. గిన్నిస్‌ రికార్డు నియమ నిబంధనల ప్రకారం.. కాలి వేళ్లు, మోచేతులపై శరీర భారమంతా మోపి, భూమికి క్షితిజ సమాంతరంగా శరీరాన్ని ఉంచి.. విజయవంతంగా ఫీట్‌ పూర్తి చేసిందామె. తద్వారా అత్యధిక సమయం ‘అబ్డామినల్‌ ప్లాంక్‌ పొజిషన్‌’లో ఉన్న మహిళగా ‘గిన్నిస్‌ బుక్‌’లో చోటు సంపాదించింది. 2019లో కెనడా మహిళ డానా గ్లోవాకా కంటే పది నిమిషాలు అదనంగా ఈ భంగిమలో ఉండి.. ఆమె రికార్డును బద్దలు కొట్టింది డోనా.

ఏ పనైనా ‘ప్లాంక్‌’లోనే!

డోనాది కెనడాలోని అల్బర్టా. మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. స్థానిక హైస్కూల్లో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరైంది. అయితే 12 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ మణికట్టు ఎముక విరిగిందామెకు. దీంతో ఆ సమయంలో పరిగెత్తడం, ఇంట్లో చిన్న చిన్న బరువులెత్తడం కూడా కష్టంగా మారింది. ఈ సమస్య నుంచి బయటపడి తిరిగి ఫిట్‌గా మారేందుకు నిపుణుల సలహా మేరకు వ్యాయామాన్ని తన రోజువారీ దినచర్యలో భాగం చేసుకున్న డోనా.. అప్పట్నుంచి ఒక్క రోజు కూడా ఎక్సర్‌సైజ్‌ మానలేదు. ఈ క్రమంలోనే ప్లాంక్‌ సాధన చేయడం నేర్చుకుంది. ఈ భంగిమ ఆమెకు ఎంతలా నచ్చిందంటే.. ప్లాంక్‌ పొజిషన్‌లోనే ఉండి పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, చదువుకోవడం.. వంటివి చేసేది. ఈ మక్కువే తనను రోజూ గంటల తరబడి ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండేందుకు ప్రేరేపించిందంటోంది డోనా.

ఆఖరి అరగంటే కీలకం!

‘గత 12 ఏళ్లుగా ప్లాంక్స్‌ సాధన చేస్తున్నా. ఈ భంగిమలో ఉండి కొన్ని పనుల్ని సునాయాసంగా పూర్తిచేయగలను. ఇలా ఈ వ్యాయామంపై పెరిగిన మక్కువే గిన్నిస్‌ రికార్డు సాధించాలన్న కసిని నాలో పెంచింది. ఈ క్రమంలోనే రోజూ మూడు గంటలు నిరంతరాయంగా ప్లాంక్‌ సాధన చేయడం ప్రారంభించా. ఇక గిన్నిస్‌ రికార్డులో భాగంగా మొదటి రెండు గంటలు సునాయాసంగా గడిచిపోయాయి. ఆ తర్వాత రెండు గంటలు కాస్త కష్టమనిపించాయి. మోచేతుల్లో నొప్పి, కాలి వేళ్లలో తిమ్మిరి రావడంతో ఒక్కసారిగా నా ఫామ్‌ని కోల్పోయానేమో అనిపించింది. కానీ ఆఖరి అరగంటలో శ్వాసపై దృష్టి పెట్టా. నిశ్శబ్దంగా, ఓపికతో ధ్యానం చేశా. ఇదే ఈ సమయంలో ఎదురైన శారీరక నొప్పుల్ని దూరం చేసి.. ఈ అరుదైన ఫీట్‌ పూర్తిచేసే శక్తిని అందించింది.. నేను గిన్నిస్‌ రికార్డు సాధించడం ఇప్పటికీ ఓ కలలాగే ఉంది..’ అంటున్నారు 58 ఏళ్ల డోనా. ఆమెకు 12 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వయసుతో పాటు తన ఆత్మవిశ్వాసాన్ని, ఫిట్‌నెస్‌ను పెంచుకుంటోన్న ఈ ప్లాంక్‌ లవర్‌.. నిరంతర సాధనతోనే ఏదైనా సాధ్యమంటూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్