చెవిపోగు రంధ్రాలు సాగాయా? అయితే ఇలా చేయండి!

అకేషనల్‌గానైనా, క్యాజువల్‌గానైనా చెవులకు భారీ ఇయర్‌రింగ్స్‌ ధరించడం ఈతరం అమ్మాయిలకు అలవాటు! ఇలా వీళ్ల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొనే డిజైనర్లు కూడా చాంద్‌బాలీ, జుంకాలు, షాండ్లియర్‌, హూప్స్‌.. వంటి విభిన్న డిజైన్లతో కూడిన భారీ చెవిదిద్దుల్ని రూపొందిస్తున్నారు.

Published : 28 Nov 2023 12:30 IST

అకేషనల్‌గానైనా, క్యాజువల్‌గానైనా చెవులకు భారీ ఇయర్‌రింగ్స్‌ ధరించడం ఈతరం అమ్మాయిలకు అలవాటు! ఇలా వీళ్ల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొనే డిజైనర్లు కూడా చాంద్‌బాలీ, జుంకాలు, షాండ్లియర్‌, హూప్స్‌.. వంటి విభిన్న డిజైన్లతో కూడిన భారీ చెవిదిద్దుల్ని రూపొందిస్తున్నారు. అయితే వీటిని ఎంత లైట్‌వెయిట్‌గా డిజైన్‌ చేసినా.. వాటిలో పొదిగిన రాళ్లు/కుందన్లతో అవి కాస్త బరువుగానే ఉంటాయి. ఇక వీటిని తరచూ ధరించడం వల్ల కొన్నాళ్లకు చెవిపోగు రంధ్రాలు క్రమంగా సాగుతుంటాయి. దీనివల్ల రంధ్రం పెద్దగా అవడమే కాదు.. నొప్పి కూడా వస్తుంటుంది. అయితే రంధ్రం మరింత పెద్దదవకుండా ఉండాలన్నా, నొప్పి నుంచి ఉపశమనం పొందాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

మాటీలు పెట్టేద్దాం!

చెవులను అలంకరించుకోవడానికి చెవిపోగులు/చెవిదిద్దులే కాదు.. విభిన్న రకాల ఆభరణాల్ని ధరిస్తుంటాం. మాటీలు కూడా వీటిలో ఒకటి. అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ధరించే ఈ ఆభరణంతో చెవిపోగులు సాగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. చెవిదిద్దులకు జతచేసిన వీటిని జుట్టుకు అటాచ్‌ చేయడం లేదంటే చెవి ముందు నుంచి వెనక్కి ధరించడం, చెవులపై నుంచి వెనకవైపు ఉన్న చెవి పోగుకు జతచేయడం.. ఇలా విభిన్న రకాలుగా వీటిని పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇయర్‌ రింగ్స్‌ బరువు పూర్తిగా చెవిపోగు రంధ్రాలపై పడకుండా ఉంటుంది. తద్వారా అవి సాగకుండా జాగ్రత్తపడచ్చు. వీటిలోనూ మనం ధరించే ఇయర్‌ రింగ్స్‌కి మ్యాచింగ్‌గా ఉండేవి, చెయిన్స్‌ తరహావి, లేయర్లలా రూపొందించినవి, జుంకాలు వేలాడదీసినట్లుగా డిజైన్‌ చేసినవి.. ఇలా బోలెడన్ని డిజైన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో మీకు నచ్చిన, నప్పిన వాటిని ఎంచుకొని మెరిసిపోవచ్చు.

లోబ్‌ ప్యాచెస్‌తో..!

భారీ ఇయర్‌ రింగ్స్‌ ధరించినా చెవిపోగు రంధ్రాలు సాగకుండా ఉండాలంటే లోబ్‌ ప్యాచెస్‌ మరో ప్రత్యామ్నాయం! వీటిని చెవి వెనకవైపు చెవిపోగు రంధ్రం ఉన్న చోట అతికించుకోవాలి. వీటిపై చెవిపోగు రంధ్రానికి సమాంతరంగా రంధ్రం చేసి.. అందులో నుంచి చెవిదిద్దుల్ని అమర్చుకోవాలి. దీనివల్ల కూడా ఇయర్‌రింగ్స్‌ బరువు పూర్తిగా చెవిపోగు రంధ్రాలపై పడకుండా ఉంటుంది. అలాగే ఈ ప్యాచెస్‌ వివిధ రకాల చర్మ రంగుల్లో దొరుకుతాయి.. కాబట్టి ప్యాచెస్‌ అతికించినా అతికించినట్లు కనిపించదు.

నొప్పి తెలియకుండా!

చెవిపోగు రంధ్రాలు సాగడం వల్ల తిరిగి వాటిపై నుంచే భారీ ఇయర్‌రింగ్స్‌ పెట్టుకుంటే నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా ధరించాలనుకునేవారు నంబింగ్‌ క్రీమ్స్‌ వాడచ్చంటున్నారు నిపుణులు. ఇవి చర్మాన్ని మొద్దుబారేలా చేసి.. నొప్పి తెలియనివ్వవు. అందుకే ఈ క్రీమ్స్‌ ఎక్కువగా హీరోయిన్లు వాడతారంటున్నారు. అటు సినిమా షూటింగ్స్‌లో, ఇటు అకేషనల్‌గా వాళ్లు పదే పదే భారీ ఇయర్‌ రింగ్స్‌ ధరించడం మనం చూస్తుంటాం. ఇలాంటప్పుడు నొప్పి తెలియకుండా ఉండడానికి వాళ్లు వీటినే ఆశ్రయిస్తారట! అయితే చెవిపోగు రంధ్రాల వల్ల వచ్చే నొప్పికి ఈ క్రీమ్స్‌ తాత్కాలిక పరిష్కారమే! కాబట్టి భారీ ఇయర్‌రింగ్స్‌ని తరచూ ధరించడం కంటే అకేషనల్‌గా.. అది కూడా తక్కువ బరువున్నవి ఎంచుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అలాగే నొప్పి త్వరగా తగ్గిపోవాలన్నా, గాయం మానిపోవాలన్నా.. కొబ్బరినూనె, పెట్రోలియం జెల్లీ.. వంటి సహజ చిట్కాల్ని పాటించచ్చు.

లిఫ్టర్స్‌తో మేలు!

భారీ చెవిదిద్దులు ధరించడం వల్లే కాదు.. వాటికి అనుసంధానమై ఉన్న పోస్ట్‌ (చెవి రంధ్రంలో అమర్చుకునే పొడవాటి అటాచ్‌మెంట్‌) పొడవు ఎక్కువగా ఉన్నా అవి ముందుకు పడిపోయినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల వాటి బరువు చెవి రంధ్రాలపై పడి అవి సాగుతుంటాయి. అలా జరగకుండా ఉండడానికే ‘ఇయర్‌ రింగ్‌ లిఫ్టర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చాయి. వీటిని చెవి వెనకవైపు ధరించాల్సి ఉంటుంది. ఇవి చెవిదిద్దుల్ని చక్కగా ఫిక్సయ్యేలా చేస్తాయి. తద్వారా వాటి బరువు పూర్తిగా రంధ్రాలపై పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే వీటికి బదులుగా బటన్స్‌ని అమర్చుకొని ఆపై సీల పెట్టుకున్నా ఫలితం ఉంటుంది.

ఇలా ఎంచుకుంటే..!

ప్రత్యేక సందర్భాల్లోనే కాదు.. క్యాజువల్‌గానూ భారీ ఇయర్‌రింగ్స్‌ ఎంచుకోవడానికి ఈతరం అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనివల్ల కూడా చెవిపోగు రంధ్రాలు సాగుతుంటాయి. ఇలా జరగకూడదంటే.. చెవిదిద్దుల్ని ఎంచుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారీ ఇయర్‌రింగ్స్‌ అంటే జుంకాలే కాదు.. స్టడ్స్‌ మాదిరిగా ఉండే భారీ చెవిదిద్దులు ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో దొరుకుతున్నాయి. పైగా ఇవి తక్కువ బరువుంటాయి కాబట్టి రోజూ వీటిని ధరించినా సమస్య ఉండదు. ఇక జుంకాల మాదిరిగా ఉండే ఇయర్‌రింగ్స్‌ని అకేషనల్‌గా ధరిస్తే.. చెవిపోగు రంధ్రాలు సాగకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్