మేకప్‌ కిట్.. శుభ్రంగా..!

చాలామంది మేకప్‌ వేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. మేకప్‌ కిట్‌ని నీట్‌గా సర్దుకోవడంపై పెట్టరు. సమయం లేదనో, రోజూ ఏం సర్దుతామన్న బద్ధకంతోనో.. వాటిని డ్రస్సింగ్ టేబుల్ ర్యాక్‌లో అలాగే పడేస్తుంటారు.

Published : 20 Feb 2024 13:25 IST

చాలామంది మేకప్‌ వేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. మేకప్‌ కిట్‌ని నీట్‌గా సర్దుకోవడంపై పెట్టరు. సమయం లేదనో, రోజూ ఏం సర్దుతామన్న బద్ధకంతోనో.. వాటిని డ్రస్సింగ్ టేబుల్ ర్యాక్‌లో అలాగే పడేస్తుంటారు. దీంతో కిట్‌ చిందరవందరగా కనిపించడంతో పాటు ఆయా మేకప్‌ వస్తువులు సమయానికి దొరకవు.. పైగా కిట్‌ శుభ్రంగా లేకపోతే దాని ప్రభావం చర్మ ఆరోగ్యంపై పడుతుంది. ఇలా జరగకూడదంటే.. మేకప్‌ కిట్‌/మేకప్‌ సామగ్రిని భద్రపరచుకునే ర్యాక్‌ను పొందికగా సర్దుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

⚛ చాలామంది మేకప్‌ సామగ్రిని డ్రస్సింగ్‌ టేబుల్‌ ర్యాక్‌లో లేదంటే ఓ ప్లాస్టిక్‌ పౌచ్‌లో అలా పడేస్తుంటారు. దీనివల్ల ర్యాక్‌ చిందరవందరగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అదే ర్యాక్‌లో ఓ అక్రిలిక్‌ మేకప్‌ డ్రాయర్‌ ఆర్గనైజర్‌ను ఏర్పాటు చేసుకోండి. అందులో బ్రష్‌లు, పౌడర్లు, క్రీమ్‌లు, ఐబ్రో పెన్సిల్స్‌-లిప్‌స్టిక్‌.. వంటివి వేటికవే విడివిడిగా అమర్చుకుంటే ర్యాక్‌ నీట్‌గా కనిపిస్తుంది.

⚛ చాలావరకు మేకప్‌ వస్తువుల గడువు తేదీ ఏడాది పాటు ఉంటుంది. మరికొన్ని మూడు నాలుగు నెలల్లో ఎక్స్‌పైరీ అయిపోతాయి. ఇలా గడువు తేదీ ముగిసిన వస్తువుల్ని బయట పడేయకుండా.. కొత్తగా తెచ్చిన వస్తువుల్నీ ఇదే కిట్‌లో కలిపేస్తుంటారు చాలామంది. దీనివల్ల కిట్‌లో సామగ్రి పెరిగిపోయి చిందరవందరగా కనిపిస్తుంది. కాబట్టి కొత్తవి కొనగానే మిగిలిపోయిన మేకప్‌ వస్తువుల్ని కిట్‌లో నుంచి తొలగించడం మంచిది.

⚛ కొంతమంది హడావిడిలో మేకప్‌ వస్తువుల్ని వాడుకున్నాక వాటిపై మూత పెట్టకుండానే ర్యాక్‌లో పడేస్తుంటారు. దీనివల్ల వాటి అవశేషాలు ఇతర సామగ్రికి అంటుకొని ర్యాక్‌ అంతా చిందరవందరగా కనిపిస్తుంది. పైగా ఆయా వస్తువులు ఇలా బయటికి ఎక్స్‌పోజ్‌ అవడం వల్ల వాతావరణంలోని తేమ వాటిపైకి చేరి బ్యాక్టీరియా, ఇతర క్రిములూ వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి మేకప్‌ వస్తువుపై ఎప్పుడూ మూత పెట్టే ఉంచడం మంచిది.

⚛ మేకప్‌ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల కూడా కిట్‌ చిందరవందరగా, అపరిశుభ్రంగా మారిపోతుంది. వాటికి అంటుకున్న అవశేషాలే ఇందుకు కారణం. పైగా దీనివల్ల చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వారానికోసారి లేదంటే పదిహేను రోజులకోసారి ఆయా బ్రష్‌లను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.

⚛ కంటి మూలలు, ముక్కు దగ్గర.. ఇలాంటి ప్రదేశాల్లో మేకప్‌ పరచుకునేలా చేయడానికి ఇయర్‌ బడ్స్‌ వాడడం సహజమే. కొంతమంది ఉపయోగించిన బడ్స్‌ కూడా కిట్‌లోనే పడేస్తుంటారు. నిజానికి ఒకసారి ఉపయోగించింది మళ్లీ వాడకపోవడం మంచిది. తద్వారా కిట్‌ కూడా చిందరవందరగా మారకుండా ఉంటుంది.

⚛ అన్ని మేకప్‌ వస్తువుల్ని రోజూ ఉపయోగించచ్చు.. ఉపయోగించకపోవచ్చు.. కానీ రోజూ మేకప్‌ వేసుకునే వారు మాయిశ్చరైజర్‌, కన్సీలర్‌, లిప్‌స్టిక్‌, ఐలైనర్‌.. ఇలాంటి ప్రాథమిక వస్తువుల్ని మాత్రం వాడుతుంటారు. కాబట్టి ఇలాంటి వస్తువుల్ని కిట్‌లో ముందు వరుసలో అమర్చుకోవాలి.. వెనకవైపు ఎక్కువగా వాడనివి సర్దుకుంటే ర్యాక్‌ నీట్‌గా ఉంటుంది.

⚛ మేకప్‌ అంటే స్కిన్‌ కేరే కాదు.. హెయిర్‌ కేర్‌కు సంబంధించిన ఉత్పత్తులు, టూల్స్‌ కూడా ఉంటాయి. వాటిని చర్మ సంబంధిత ఉత్పత్తులతో పాటుగా కాకుండా.. విడిగా అమర్చుకోవడం మంచిది. ఒకే కిట్‌లో పెట్టుకోవాలనుకుంటే.. రెండింటి మధ్య పార్టిషన్‌ ఉండేలా డ్రాయర్‌ ఆర్గనైజర్‌ను ఏర్పాటుచేసుకుంటే చూడ్డానికి నీట్‌గా ఉంటుంది.. వాడుకోవడానికి వీలుగానూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్