Published : 15/10/2022 17:37 IST

షాండ్లియర్‌ని శుభ్రం చేస్తున్నారా?

దీపావళి వచ్చేస్తోంది.. సమయం దొరికినప్పుడల్లా ఇంట్లోని ఒక్కో వస్తువును శుభ్రం చేసుకోవడంపై దృష్టి పెడుతుంటారు చాలామంది. నెలల తరబడి దుమ్ము దులపని వస్తువుల పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. వాటిలో షాండ్లియర్ కూడా ఒకటి. ఇంటికి అందాన్ని, ఆధునిక హంగుల్ని జోడించే ఈ వస్తువును తరచుగా శుభ్రం చేయరు చాలామంది.. అలాగని దీపావళికి క్లీన్‌ చేయకుండా వదిలిపెట్టలేం. అయితే దీన్ని శుభ్రం చేసే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుంటే.. అది సులభంగా క్లీన్‌ అవడంతో పాటు.. డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

గాజు, రాగి, ఇత్తడి, అల్యూమినియం, అక్రిలిక్‌.. వంటి వివిధ రకాల మెటీరియల్స్‌తో, విభిన్న డిజైన్లతో కూడిన షాండ్లియర్స్‌ని మనం మార్కెట్లో చూస్తుంటాం. అయితే వీటన్నింటిలోనూ గాజు షాండ్లియర్లను ఎంచుకోవడానికే చాలామంది ఇష్టపడుతుంటారు. కారణం.. అవి ఇంటికి రాయల్‌ లుక్‌ని అందించడమే! ఏదేమైనా ఈ తరహా షాండ్లియర్లను శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అవి కొత్తగా మెరిసిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

షాండ్లియర్‌ను శుభ్రం చేసే ముందు స్విచ్ ఆఫ్ చేసి దాన్ని పూర్తిగా చల్లబడనివ్వాలి. అప్పుడే దాన్ని మూలమూలలా శుభ్రం చేయడం వీలవుతుంది.

షాండ్లియర్‌ని ఒక్కసారి ఫిక్స్‌ చేశాక.. మాటిమాటికీ కిందికి దించడం కుదరదు.. కాబట్టి నిచ్చెన వేసుకొనే దీన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం మార్కెట్లో స్టెప్‌ ల్యాడర్‌ దొరుకుతోంది. కాస్త పొడవుగా ఉండేది ఎంచుకుంటే.. దానిపై కూర్చొని నెమ్మదిగా శుభ్రం చేసేసుకోవచ్చు.

శుభ్రం చేసేటప్పుడు షాండ్లియర్‌ కింద నేలపై పరుపు, లేదా మెత్తటి బ్లాంకెట్‌.. వంటివి పరవాలి. దీనివల్ల వాటి నుంచి ఏవైనా క్రిస్టల్స్‌, ఇతర గాజు వస్తువులు ఊడినా పగలకుండా జాగ్రత్తపడచ్చు.

షాండ్లియర్‌కి బల్బులు లేదంటే క్యాండిల్‌ హోల్డర్స్‌.. వంటివి ఉంటే వాటిని ముందుగా తొలగించి.. విడిగా శుభ్రం చేయాలి.

షాండ్లియర్‌ని శుభ్రం చేయడానికి బయట ప్రత్యేకమైన షాండ్లియర్‌ క్లీనర్స్‌ దొరుకుతాయి. లేదంటే ఇంట్లోనే ఈ క్లీనర్‌ని తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం నాలుగు వంతుల డిస్టిల్డ్‌ వాటర్‌కి ఒక వంతు ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా షాండ్లియర్‌పై స్ప్రే చేయకుండా.. ముందుగా మైక్రోఫైబర్‌ క్లాత్‌పై స్ప్రే చేసి.. దాంతో షాండ్లియర్‌పై తుడవాలి. ఆఖర్లో ఒక మెత్తటి కాటన్‌ వస్త్రంతో మరోసారి తుడిచేస్తే సరిపోతుంది.

షాండ్లియర్‌ని తుడిచేటప్పుడు చేతి వేలి ముద్రలు వాటి గాజు ఉపరితలం, క్రిస్టల్స్‌పై పడి మురికిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే చేతికి గ్లౌజులు ధరించడం మంచిది. అలాగే మాస్క్‌ ధరించడం వల్ల దుమ్ము, ఇతర క్రిములు శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడచ్చు.

షాండ్లియర్‌ని చాలా సున్నితంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని గుండ్రంగా తిప్పుతూ తుడవడం కంటే.. మీరే మీ నిచ్చెనను జరుపుతూ తుడవడం మంచిది. లేదంటే అది ప్రమాదవశాత్తూ కింద పడిపోవచ్చు.

దాదాపు అన్ని రకాల షాండ్లియర్స్‌కి బంగారు/వెండి పూత పూసిన ఫిట్టింగ్స్‌ ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి అమ్మోనియా ఆధారిత క్లీనర్స్‌ని వాడితే వాటి మెరుపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ తరహా రసాయనాలు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

నెలల తరబడి శుభ్రం చేయకుండా ఉంటే ఏ వస్తువైనా ఎక్కువగా దుమ్ము పడుతుంది. కాబట్టి కనీసం నెలకోసారైనా శుభ్రం చేసుకోవడం మంచిది. షాండ్లియర్‌ విషయంలోనూ అంతే! కాబట్టి సమయం దొరికినప్పుడల్లా మెత్తటి ఫెదర్‌ డస్టర్‌తో పైన పేరుకున్న సన్నటి దుమ్మును తొలగిస్తే.. ఇలా పూర్తి స్థాయిలో క్లీన్‌ చేయడం సులువవుతుంది.

షాండ్లియర్‌ శుభ్రం చేయడం పూర్తయ్యాక.. ముందుగా తొలగించిన బల్బులు, క్యాండిల్‌ హోల్డర్స్‌.. వంటివన్నీ తిరిగి అమర్చాలి. ఆపై పూర్తిగా ఆరాకే స్విచ్‌ ఆన్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని