విందుభోజనం అరగాలంటే..!

'వివాహ భోజనంబు వింతైన వంటకంబు..' అన్న చందంగా సంక్రాంతి పండుగ కోసం తయారు చేసిన పిండివంటలన్నీ కళ్ల ముందు నోరూరిస్తుంటే తినకుండా ఉండగలమా.. చెప్పండి?? అయితే తినేటప్పుడు బాగానే ఉంటుంది.. ఆ తర్వాత మొదలవుతుంది అసలు....

Published : 15 Jan 2023 14:10 IST

'వివాహ భోజనంబు వింతైన వంటకంబు..' అన్న చందంగా సంక్రాంతి పండుగ కోసం తయారు చేసిన పిండివంటలన్నీ కళ్ల ముందు నోరూరిస్తుంటే తినకుండా ఉండగలమా.. చెప్పండి?? అయితే తినేటప్పుడు బాగానే ఉంటుంది.. ఆ తర్వాత మొదలవుతుంది అసలు సమస్య.. అదేనండీ.. అజీర్తి. పండగలు, శుభకార్యాలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో పెద్ద ఎత్తున తయారు చేసిన రుచికరమైన వంటలు తినడం వల్ల కొంతమందికి అవి సరిగ్గా జీర్ణం కాక అజీర్తి సమస్య ఎదురవుతుంటుంది. దీనివల్ల కడుపులో తిప్పడం, అసౌకర్యంగా అనిపించడం, కొన్ని సందర్భాల్లో వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి.

హెర్బల్ టీతో..

చాలామంది భోజనం తర్వాత టీ తాగుతుంటారు. దీనివల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా తిన్న తర్వాత కాసేపు విరామం ఇచ్చి పుదీనా, చామొమైల్ ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీ, గ్రీన్ టీ.. వంటివి తాగడం చాలా మంచిది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

దాల్చిన చెక్కతో..

ఒక కప్పు నీటిలో అర చెంచా దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న టీ తాగడం వల్ల అజీర్తి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని వేడివేడిగా తాగితే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.

సోంపు 'సో' బెటర్!

కొన్ని సోంపు గింజల్ని వేయించాలి. వీటిని మిక్సీలో మెత్తగా చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడి నుంచి ఒక చెంచా పొడిని తీసుకుని గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపు గింజల్లోని నూనె అజీర్తిని తగ్గిస్తుంది. లేదంటే సోంపు నమలడం, కొద్దిగా సోంపును నీటిలో వేసుకుని టీలా తయారు చేసుకొని తాగినా ఫలితం లభిస్తుంది. ఇలా రోజుకు రెండుమూడు సార్లు చేయడం వల్ల అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు.

ఈ పండ్లతోనూ..

తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే కొంతమందిలో కడుపునొప్పి వస్తుంటుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆహారం సులభంగా జీర్ణం కావాలి. ఇందుకు ఫైబర్ బాగా తోడ్పడుతుంది. ఇది యాపిల్‌లో అధికంగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా లభించే యాపిల్‌ను రోజుకొకటి చొప్పున తినడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పటిష్టమై, కడుపునొప్పి కూడా తగ్గిపోతుంది.

భోజనానికి ముందు ఒక గ్లాసు కమలారసం తాగడం వల్ల కాస్త ఎక్కువ ఆహారం తీసుకున్నా సులభంగా జీర్ణమవుతుంది. దీనికి కారణం కమలాఫలంలో ఉండే సిట్రిక్, ఆస్కార్బిక్ ఆమ్లాలే. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా ప్రేరేపిస్తాయి.

అజీర్తిని తగ్గించడానికి ద్రాక్షరసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షపండ్ల తొక్కలో విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణమవడానికి తోడ్పడే రసాల స్థాయుల్ని రెట్టింపు చేస్తాయి. తద్వారా ఆహారం కాస్త ఎక్కువగా తీసుకున్నా సులభంగా జీర్ణమవుతుంది.

అల్లంతో..

అల్లం కూడా అజీర్తి సమస్యను తగ్గించడంలో బాగా సహకరిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే రసాల్ని ఇది ప్రేరేపిస్తుంది. తద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇందుకోసం చిన్న అల్లం ముక్కపై కాస్త ఉప్పు చల్లుకొని నమలడం లేదా అల్లం టీ తాగడం.. లాంటివి చేయచ్చు. అలాగే చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు, రెండు చెంచాల అల్లం రసం.. ఈ మూడింటినీ బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని నేరుగా తాగచ్చు.. లేదంటే నీటిలో కలుపుకొనైనా తాగచ్చు. ఇలాంటి సులభమైన పద్ధతుల వల్ల కూడా అజీర్తి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనియాలతో..

కొన్ని ధనియాలు వేయించి గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. లేదంటే యాలకులు, వేయించిన ధనియాలు, రెండు లవంగాలు, కాస్త అల్లం.. ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చెంచా చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

మరికొన్ని..

చెంచా వాములో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తిన్నా సత్వర ఉపశమనం లభిస్తుంది.

అరకప్పు నీటిలో చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలుపుకొని తాగితే మంచిది.

కొద్దిగా జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. ఇందులో నుంచి చెంచా పొడిని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే అజీర్తి సమస్య తగ్గిపోతుంది.

ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు అజీర్తి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తినే ఆహారం బాగా నములుతూ, నెమ్మదిగా తినాలి. అలాగే రాత్రిపూట అయితే పడుకోవడానికి కనీసం రెండుమూడు గంటల ముందే తినడం పూర్తి చేయాలి. ఇలా అయితే అజీర్తి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్