Preetanjali: ఆమె చేసే కేక్స్.. సెలబ్రిటీలకూ ఎంతో ఇష్టం!

కేక్స్‌ తయారీ ఒకెత్తయితే.. దానిపై చేసే అందమైన అలంకరణ మరో ఎత్తు! అయితే ఇలా అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌! సాధారణంగా కేక్‌ డెకరేషన్‌ కోసం పండ్లు/పండ్ల ముక్కల్ని వాడుతుంటారు. కానీ పువ్వుల్నీ ఉపయోగిస్తూ తన కేక్‌ ఆర్ట్‌ నైపుణ్యాల్ని....

Updated : 20 Jun 2023 14:06 IST

(Photos: Instagram)

కేక్స్‌ తయారీ ఒకెత్తయితే.. దానిపై చేసే అందమైన అలంకరణ మరో ఎత్తు! అయితే ఇలా అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌! సాధారణంగా కేక్‌ డెకరేషన్‌ కోసం పండ్లు/పండ్ల ముక్కల్ని వాడుతుంటారు. కానీ పువ్వుల్నీ ఉపయోగిస్తూ తన కేక్‌ ఆర్ట్‌ నైపుణ్యాల్ని చాటుకుంటోంది బెంగాలీ అమ్మాయి ప్రీతంజలీ పసరి. ఇవి చూడ్డానికి అచ్చం నిజమైన పూల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ అవి బటర్‌తో తయారుచేసిన ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ అనే విషయం వాటిని రుచి చూసే దాకా పసిగట్టలేం. ఇలా తన అరుదైన కళతో కేక్స్‌కు సరికొత్త వన్నెలద్దుతోన్న ప్రీతంజలి కేక్స్‌ అంటే సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ ఎంతో ఇష్టం! ఇక పారదర్శక కేక్స్ తయారుచేయడం ఆమె మరో ప్రత్యేకత! ఇలా కేక్‌ ఆర్ట్‌నే కెరీర్‌గా ఎంచుకొని రాణిస్తోన్న ఈ యువ బేకర్ సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..!

రసగుల్లా, సందేశ్‌, గులాబ్‌ జామూన్‌, జిలేబీ, రస్‌మలై.. ఇలాంటి నోరూరించే స్వీట్లకు కేరాఫ్‌ అడ్రస్‌ కోల్‌కతా నగరం. అక్కడే పుట్టి పెరిగిన ప్రీతంజలి కూడా చిన్నతనం నుంచి స్వీట్లు, కేక్స్‌, చాక్లెట్స్‌ అంటే చెవికోసుకునేది. అయితే తాను పెద్దయ్యాక బేకింగ్‌నే తన కెరీర్‌గా ఎంచుకుంటానని, కేక్‌ ఆర్టిస్ట్‌గా మారతానని ఎప్పుడూ అనుకోలేదంటోందామె.

ఆ రుచే.. రూటు మార్చింది!

మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేసిన ప్రీతంజలి.. పలు బాలీవుడ్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. ఓ ప్రముఖ ఫ్యాషన్ పత్రికకు అసిస్టెంట్‌ ఫొటోగ్రాఫర్‌గానూ సేవలందించింది. ఇలా విభిన్న అంశాల్ని తన కెరీర్‌ ఆప్షన్లుగా ఎంచుకున్న ఆమెకు.. ఇవేవీ సంతృప్తినివ్వలేకపోయాయి. ‘నేనెక్కడున్నా చాక్లెట్స్ సువాసన, కేక్స్‌/స్వీట్స్‌ రుచిని అస్సలు మిస్సవకపోయేదాన్ని. ఈ మక్కువే నన్ను లండన్‌లోని Le Cordon Bleu కుకింగ్‌ స్కూల్లో చేరేందుకు ప్రేరేపించింది. ఆపై కొన్నేళ్ల పాటు పేస్ట్రీ చెఫ్‌గా పనిచేశా. ఇలా కూడగట్టుకున్న నైపుణ్యాలకు నాలోని క్రియేటివిటీని జోడించి.. 2018లో బటర్‌ఫింగర్స్‌ పేరుతో ఓ బేకరీని ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చిందీ కేక్‌ బేకర్. పారదర్శక కేక్స్ తయారుచేయడం ఆమె ప్రత్యేకత. అంటే.. లేయర్లుగా తయారుచేసిన కేక్స్‌కి పలుచగా ఫ్రాస్టింగ్‌ అప్లై చేసి.. లోపలి లేయర్లు కనిపించేలా టచప్‌ ఇవ్వడమే దీని ముఖ్యోద్దేశం. ఇలా ఆమె తయారుచేసిన ఏ కేక్‌ చూసినా.. లేయర్లు కనిపించేంత పారదర్శకంగా ఉంటుంది.

ఆ పూలను తినేయచ్చు!

ఇలా పారదర్శక కేక్స్‌ తయారుచేయడమే కాదు.. వాటిని అందంగా అలంకరించడంలోనూ ప్రీతంజలి దిట్టే. కేక్‌ ఆర్టిస్ట్‌గా తనలోని నైపుణ్యాలకు, సృజనాత్మకతను జోడిస్తూ కేక్‌కు సరికొత్త హంగులద్దుతుంటుందీ యువ చెఫ్‌. ఈ క్రమంలో పండ్లు/పండ్ల ముక్కల్ని నేరుగా వాడినప్పటికీ.. రంగురంగుల పూలతో కేక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది ప్రీతంజలి. అయితే అవి నిజమైన పూలు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే వాటికి బదులు ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ వాడుతూ కేక్‌కు వన్నె తెస్తోందామె. వాటిని రుచి చూసే దాకా తెలియదు.. అవి నిజమైన పూలు కాదు.. ఎడిబుల్‌ ఫ్లవర్స్‌ అని! అంతేకాదు.. కేక్‌ తయారీ, అలంకరణలో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే ఉపయోగిస్తున్నానంటోందామె.

‘కేక్‌ తయారీలో రాగులు, సజ్జలు, జొన్నలు, ఓట్‌మీల్‌.. తదితర గ్లూటెన్‌ రహిత పదార్థాల్నే ఉపయోగిస్తున్నా.. చక్కెరకు బదులు బెల్లం, తేనె.. వాడుతున్నా. ఇక వీటి అలంకరణ కోసం ఉపయోగించే చెర్రీ వంటి పండ్లను నా టెర్రస్ గార్డెన్‌లోనే స్వయంగా పండిస్తున్నా..’ అంటోన్న ప్రీతంజలి.. సెరామిక్‌, మార్బుల్‌తో తయారుచేసిన ప్లాటర్స్‌నే కేక్‌ ప్యాకేజింగ్‌కీ ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది.

సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా..!

ఇలా ప్రీతంజలి తయారుచేసే ఆకర్షణీయమైన, రుచికరమైన కేక్స్‌ అంటే సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ మక్కువే! అందుకే సినిమా సెట్స్‌లో ఎవరి పుట్టినరోజైనా, పండగైనా.. ప్రీతంజలి తయారుచేసే కేక్స్‌తోనే సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోవైపు ప్రముఖుల పుట్టినరోజు, పెళ్లి రోజు.. వంటి ప్రత్యేకమైన వేడుకలకూ కస్టమైజ్‌డ్‌ కేక్స్‌ రూపొందిస్తుంటుందీ కేక్‌ ఆర్టిస్ట్.

‘భవిష్యత్తులో వెడ్డింగ్‌ కేక్స్‌ తయారుచేయాలన్న కోరిక ఉంది. అయితే అవి సాధారణంగా కాకుండా.. పెళ్లి కూతురి దుస్తులకు మ్యాచయ్యేలా వాటిని రూపొందించాలనుకుంటున్నా. నా ఆర్ట్‌ వర్క్‌తో ఆ కేక్‌పై ఎడిబుల్‌ పూలు, ఇతర అలంకరణతో సరికొత్తగా హంగులద్దాలనుకుంటున్నా. అలాగే చాక్లెట్‌ క్వినోవా బ్రౌనీస్‌, రాజ్‌గిరా-రాగి.. వంటి పదార్థాలతో చాక్లెట్‌ లోఫ్‌.. వంటివీ తయారుచేయాలన్న ఆలోచనా ఉంది..’ అంటోందీ కేక్‌ ఆర్టిస్ట్.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్