మేమిలా ఉన్నామంటే.. ఆ మహనీయుని చలవే!

ఒక మయూరి... మరొక మౌనపోరాటం...  స్త్రీశక్తిని ప్రపంచానికి చాటిన చిత్రరాజాలివి. ‘పాడుతా తీయగా’ అంటూ ప్రపంచానికి పరిచయమైన ఎంతోమంది చిన్నారులు ఇప్పుడు ప్రొఫెషనల్‌ సింగర్స్‌... సంగీతం, సాహిత్యం, సినిమాపై ప్రేమతో... ఉషాకిరణ్‌మూవీస్, ఈటీవీ వేదికగా ఎంతోమందిని పరిచయం చేసిన ఘనత  రామోజీరావు గారిది.

Published : 09 Jun 2024 15:48 IST

ఒక మయూరి... మరొక మౌనపోరాటం...  స్త్రీశక్తిని ప్రపంచానికి చాటిన చిత్రరాజాలివి. ‘పాడుతా తీయగా’ అంటూ ప్రపంచానికి పరిచయమైన ఎంతోమంది చిన్నారులు ఇప్పుడు ప్రొఫెషనల్‌ సింగర్స్‌... సంగీతం, సాహిత్యం, సినిమాపై ప్రేమతో... ఉషాకిరణ్‌మూవీస్, ఈటీవీ వేదికగా ఎంతోమందిని పరిచయం చేసిన ఘనత  రామోజీరావు గారిది. కడసారి వీడ్కోలుగా ఆ అనుబంధాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా... 

అన్నం పెట్టారు!

- సునీత, గాయని

ప్రతి మనిషీ ఎప్పుడోఒకప్పుడు కన్ను మూయాల్సిందే. కానీ ఆరోజు తన కోసం ఎంతమంది కన్నీరు కార్చారు, తుది వీడ్కోలు పలకడానికి ఎంతమంది నీ వెంట నడిచారు అన్నదాన్ని బట్టే ఆ వ్యక్తి విలువ తెలుస్తుంది. ఈరోజు నాలాంటి ఎంతోమంది ఆయనకు వీడ్కోలు పలకడానికి రావడమే ఇందుకు సాక్ష్యం! 1995లో తొలిసారి రామోజీరావు గారిని చూశా. అప్పటివరకూ ‘ఈనాడు’ పేరు వినడమే కానీ... వార్తల గురించిన పరిచయమే లేదు మాకు. నాకే కాదు... నాలాంటి ఎంతోమందికి అన్నం పెట్టారాయన. ఇంకెంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఒక సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఆయన చేసిన పనులు... స్థాపించిన సంస్థానం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూనే ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి ఇలా ఆయన్ను చివరిసారిగా కలవడానికి రావడమే బాధగా ఉంది.


మయూరిగానే తెలుసు!

- సుధాచంద్రన్, నటి ]

యూరి నా మొదటి సినిమా. ఆ సినిమా విడుదలై నలభయ్యేళ్లయినా అంతా నన్ను మయూరిగానే గుర్తుపెట్టుకున్నారు. సుధాచంద్రన్‌ అని నా అసలు పేరు తెలిసిన వాళ్లు తక్కువ. అదంతా ఆయన వల్లే సాధ్యమయింది. బయోపిక్‌ అనే ఆలోచనకి ప్రాణం పోసిందే ఆయన. ఆ సినిమా మొత్తం పూర్తయ్యాకనే నేను ఆయన్ని కలిశాను. రెమ్యునరేషన్‌గా బ్లాంక్‌ చెక్‌ చేతిలో పెట్టి ఆశీర్వదించారు. ఆయనిచ్చిన మొత్తం ఈ రోజు కోటి రూపాయలతో సమానం కావొచ్చు. ఆ రోజు ఆయనిచ్చిన డబ్బు నాకెంత గుడ్‌లక్‌ని తెచ్చిందంటే ఇంతవరకూ నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగడమే కానీ తగ్గడం తెలియదు. ఆయన నా మెంటార్, గైడ్, ఫిలాసఫర్‌. నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన లేకపోతే నేను లేను. హైదరాబాద్‌ వస్తే కచ్చితంగా ఆయన్ని కలిసే వెళ్లేదాన్ని. ఎంత బిజీలో ఉన్నా... నాకోసం సమయం వెచ్చించేవారు. ‘మ్యాన్‌ ఇన్‌ వైట్‌’, పవిత్రతకు చిహ్నంగా కనిపించేవారు. ఆయన లేని లోటు తీరనిది.


పనిలోనే విశ్రాంతి... అనేవారు!

- యమున, నటి

రామోజీరావు గారి మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యా. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం రామోజీరావుగారే. ఆయన దగ్గర క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నా. కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడూ బావుంటారమ్మా అని ఆయన చెప్పేవారు. ఈ వయసులో కూడా ఇంతగా ఎందుకు పనిచేస్తున్నారు అని అడిగితే...పనిలోనే నాకు విశ్రాంతి అనేవారు. ఆయన మానవత్వం ఉన్న మనిషి. చిన్న స్థాయిలో ఉన్నవారైనా సరే... కష్టపడి పనిచేసే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం, గౌరవం. అలాంటి వాళ్లను కుటుంబంలా చూసుకుంటారు. అలా ఉన్నారు కాబట్టే...సుదీర్ఘకాలంగా ఈటీవీలో నేను పనిచేయగలుగుతున్నా. ఎప్పుడూ ఆయన చెప్పే మాట ఒక్కటే. ఏం జరిగినా సరే... పనిమాత్రం ఆగకూడదు అని. ఇప్పుడు కూడా బయటివాళ్లు షూటింగ్‌ రద్దు చేశారు. కానీ, మా ఇన్‌హౌస్‌లో షూటింగ్‌ ఉంది. బాధలో కూడా పని ఆగకూడదు అనే ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజూ నేను షూటింగ్‌కు వెళ్తున్నా. పవిత్రమైన ఆయన ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవుణ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.


ఆయనపై నమ్మకంతోనే...!

- సుమ కనకాల, వ్యాఖ్యాత

ల్లిదండ్రులెవరైనా... తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు. కానీ, రామోజీరావు గారు మాత్రం దాంతో పాటు మరెంతో మంది పిల్లల జీవితాలూ బాగుండాలని నిత్యం తపించేవారు. యాభై ఏళ్ల క్రితమే వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిచ్చే  ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించారాయన. శాటిలైట్‌ ఛానెళ్లు రావడానికి  ముందు నుంచే నాకు రామోజీ గ్రూప్‌తో అనుబంధం ఉంది. చదువుకునే రోజుల్లోనే వసుంధరలో ఫ్యాషన్‌-ఫ్యాషన్‌కి మోడల్‌గా పనిచేశా. తరవాత ఈటీవీ రాకతో ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేశా. ఇన్నేళ్లుగా ఆ అనుబంధం కొనసాగుతుందంటే పెద్దాయనపై ఉన్న నమ్మకం, అభిమానంతోనే! స్టార్‌ మహిళ కార్యక్రమానికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ అవార్డ్స్‌ని ఆయన చేతుల మీదుగానే అందుకున్నా. అప్పుడు ‘రావమ్మా తెలుగు సరస్వతి’ అంటూ ఎంత ఆప్యాయంగా ఆహ్వానించారో! నేను మాట్లాడే తెలుగు బాగుంటుందనీ చాలా సార్లే చెప్పారు. ఆ విషయాన్ని ఈటీవీ 20వ వార్షికోత్సవంలో మా అమ్మాయితోనూ పంచుకున్నారు. తెలుగు జాతి ఇష్టపడే అక్షర ప్రేమికుడు రామోజీ. అలాంటి గొప్ప వ్యక్తి నేను తెలుగు బాగా మాట్లాడుతున్నానని చెబితే సంతోషంగానే కాదు గర్వంగానూ ఉండదూ!  ఆయన విజన్‌ ఉన్న నాయకుడే కాదు... నాకు ఓ విజన్‌ క్రియేట్‌ చేసిన మహానుభావుడు కూడా.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్