‘స్మార్ట్’ సాఫ్ట్‌వేర్‌తో వ్యాపార నిర్వహణ సులభం చేస్తూ..!

ఔషధ తయారీలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశం మనది. ఇక్కడ తయారయ్యే ఎన్నో ఔషధాలు యూఎస్‌, యూరప్‌.. వంటి అభివృద్ధి చెందిన దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మరి, ఫార్మా రంగంలో ఇంత బలం, బలగం ఉండి కూడా.. సరఫరా గొలుసు, వ్యాపార నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలు, టెక్నాలజీ.. వంటి విషయాల్లో మనం....

Updated : 11 Feb 2023 17:02 IST

ఔషధ తయారీలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశం మనది. ఇక్కడ తయారయ్యే ఎన్నో ఔషధాలు యూఎస్‌, యూరప్‌.. వంటి అభివృద్ధి చెందిన దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మరి, ఫార్మా రంగంలో ఇంత బలం, బలగం ఉండి కూడా.. సరఫరా గొలుసు, వ్యాపార నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలు, టెక్నాలజీ.. వంటి విషయాల్లో మనం ఎంతో వెనకబడి ఉన్నాం. స్వీయ పరిశోధనతో ఇలాంటి లోటుపాట్లెన్నో గుర్తించింది హైదరాబాద్‌కు చెందిన సాకేత పింగళి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది. ఈ ఆలోచనతోనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. ఫార్మా వ్యాపార నిర్వహణ అంతా ఒకే వేదికపై, సులభంగా నిర్వహించేలా ఓ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇలా తాము రూపొందించిన ఈ సాంకేతికత దేశవ్యాప్తంగా ఎన్నో ఫార్మాస్యూటికల్‌ సంస్థలకు బిజినెస్‌ ఫ్రెండ్లీగా మారిందంటోన్న సాకేత.. తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఐఎంటీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ) హైదరాబాద్‌ నుంచి ‘ఫైనాన్స్‌-సప్లై చెయిన్‌’ విభాగంలో ఎంబీఏ చేశాను. చదువు పూర్తయ్యాక నాలుగేళ్ల పాటు వివిధ కంపెనీలకు చెందిన సప్లై చెయిన్‌ విభాగాల్లో పనిచేశాను. దీనికి తోడు ఆరోగ్యం, ఔషధ తయారీ రంగాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో ఎక్కువగా ఉండేది. మరోవైపు నాకు తెలిసిన చాలామంది ఫార్మా రంగంలో ఉన్నారు. వాళ్లతో మాట్లాడడం, ఔషధ తయారీ గురించి తెలుసుకునే క్రమంలో.. ఈ రంగంలో ఉన్న పలు సమస్యలు, లోటుపాట్లు నా దృష్టికి వచ్చాయి.

టెక్నాలజీతో వాటికి పరిష్కారం!

ఔషధ తయారీలో ప్రపంచంలోనే మనం మూడో స్థానంలో ఉన్నాం. యూఎస్‌, యూరప్‌.. వంటి అభివృద్ధి చెందిన దేశాలకూ ఎన్నో మందులు ఇక్కడ్నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇలా ఫార్మా రంగంలో ఇంత బలమైన పునాది ఉన్న మనం.. సప్లై చెయిన్, రోజువారీ కార్యకలాపాలు, సాంకేతిక పరిజ్ఞానం.. వంటి ఎన్నో విషయాల్లో వెనకబడి ఉన్నామన్న విషయం నా పరిశోధనలో భాగంగా గుర్తించా. ఎలాగైనా దీనికి పరిష్కారం చూపాలన్న కోణంలో దీని గురించి నా ఇద్దరు స్నేహితులతో చర్చించా. ఈ క్రమంలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ఫార్మా వ్యాపార నిర్వహణ అంతా ఒకే వేదికపై, సులభంగా జరిగేలా చేయాలన్న ఆలోచన మాకు తట్టింది. అదే ‘స్మార్ట్‌ ఫార్మా 360’ అనే సంస్థకు తెరతీసింది. స్మార్ట్‌ ఫార్మా 360 అనేది క్లౌడ్‌ తరహా సాఫ్ట్‌వేర్‌. వర్టికల్‌ సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌)గా పిలిచే ఈ సాంకేతికతతో.. ఔషధ తయారీ దగ్గర్నుంచి, అది ఫార్మసీలకు చేరే దాకా.. జరిగే వ్యాపార కార్యకలాపాలన్నీ ఈ వేదికగా సులభంగా నిర్వర్తించచ్చు. ప్రస్తుతం నేను దీనికి సంబంధించిన ఆపరేషన్స్‌, సప్లై చెయిన్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌.. వంటి విభాగాల్ని చూసుకుంటున్నా.

ఒక్క సాఫ్ట్‌వేర్‌.. బహుళ ప్రయోజనాలు!

ఔషధ తయారీ సంస్థలో తయారైన మందు.. వినియోగదారుడికి చేరాలంటే.. మధ్యలో ఎంతోమంది చేతులు మారాలి. తయారీ సంస్థలతో మొదలై.. స్టాకిస్ట్‌, ఫార్మసీలకు సప్లై చేసే డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద నుంచి ఆఖరుగా మందుల దుకాణాలకు చేరుకునే క్రమంలో.. జాబితా నిర్వహణ, చెల్లింపులు, అకౌంటింగ్‌.. ఇలా ప్రతి దశలోనూ వ్యాపార నిర్వహణ కచ్చితంగా జరగాలి. ఇలా ఫార్మసీకి సంబంధించి జరిగే వ్యాపార లావాదేవీలు, నిర్వహణ అంతా మేము రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే కొనసాగుతాయి. మాది పూర్తిగా క్లౌడ్‌ అప్లికేషన్‌ కాబట్టి.. ఇంటర్నెట్‌తోనే ఇది పనిచేస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా సులభంగా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫార్మా బిజినెస్‌ చేసే వాళ్లందరికీ ఇది ‘వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌’. ఇక మేం వాడే క్లౌడ్‌ అప్లికేషన్‌ మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌. ఆయా సంస్థల సమాచార రక్షణ విషయంలో ఇది పూర్తి సురక్షితం.

భవిష్యత్తులో ఇలా!

మా ‘స్మార్ట్‌ ఫార్మా 360’లోనే.. రిటైల్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ (దీన్ని ఫార్మసీలు వాడతాయి), డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డిస్ట్రిబ్యూటర్స్‌, స్టాకిస్ట్‌ల కోసం), ఆర్డర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (మందుల ఆర్డర్‌ కోసం ఫార్మసీలను, డిస్ట్రిబ్యూటర్స్ను యాప్‌ సహాయంతో అనుసంధానించే సాఫ్ట్‌వేర్‌ ఇది), సీ అండ్‌ ఎఫ్ మాడ్యూల్‌ (మందులు డెలివరీ అయ్యాక డీలర్స్‌కు విక్రేత డబ్బు చెల్లించడానికి ఉపయోగపడే వేదిక ఇది).. వంటి మరో నాలుగు సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. ప్రస్తుతం మా సాఫ్ట్‌వేర్‌ని వందకు పైగా ఫార్మసీ సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వీటిలో ప్రముఖ కంపెనీలూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 11 రాష్ట్రాలకు మా సేవల్ని విస్తరించాం. భవిష్యత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు ఎమ్మెన్సీ ఫార్మా కంపెనీలకూ మా సాఫ్ట్‌వేర్‌ని అందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇక దుబాయ్‌, మధ్య ప్రాచ్య దేశాలు, యూరప్‌, ఆగ్నేయాసియా దేశాలకూ.. మా సేవల్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.

టాప్‌-8లో మేమూ!

2020లో వీహబ్‌తో ఇంక్యుబేట్‌ అయ్యాం. ఈక్రమంలో మా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లే క్రమంలో, నెట్‌వర్కింగ్‌ విషయంలో.. వీహబ్‌ మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. అలాగే వాట్సాప్‌ క్యాంపెయిన్స్‌, ఎగ్జిబిషన్లు, ఫార్మసీ అసోసియేషన్‌ సమావేశాల వేదికగా మా ఉత్పత్తిని మార్కెట్‌ చేస్తున్నాం. మా ఉత్పత్తికి కొన్ని ప్రముఖ సంస్థల నుంచి గుర్తింపు కూడా లభించింది. ఈ క్రమంలో ‘మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ స్టార్టప్స్’ కార్యక్రమానికి ఎంపికవడంతో పాటు ‘ఎలక్ట్రానిక్స్‌-ఐటీ మంత్రిత్వ శాఖ’ నిర్వహించే ‘సమృద్ధి యాక్సెలరేటర్‌’ అనే కార్యక్రమంలో భాగంగా ‘టాప్‌ 8 టెక్‌ స్టార్టప్స్‌’లోనూ మా సంస్థ ఎంపికైంది.

నా వ్యాపార సూత్రమదే!

వ్యాపారమంటే అంత సులభం కాదు.. బృందాన్ని సమకూర్చుకోవడం, టెక్నాలజీ విషయంలో, మన ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లడం.. ఇలా అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా నిధుల సమీకరణ ఓ పెద్ద ఛాలెంజ్‌. వీటన్నింటినీ అధిగమించాలంటే స్వీయ నమ్మకం ముఖ్యం. అలాగే ఎంత బిజీగా ఉన్నా ప్రాధాన్యాలు చూసుకోవాలి. పనిలో అలసట సహజం. ఇలాంటప్పుడు పని నుంచి కాస్త విరామం తీసుకుంటే.. శరీరం, మనసు.. రెండూ పునరుత్తేజితం అవుతాయి. అప్పుడు మరింత ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నేనూ ఇదే సూత్రం పాటిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్