రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లివి!

రోగనిరోధక శక్తి.. మనల్ని వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల బారి నుంచి కాపాడే బలమైన వ్యవస్థ ఇది. ఇది పటిష్టంగా ఉంటే ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేవు.

Published : 05 Dec 2023 13:16 IST

రోగనిరోధక శక్తి.. మనల్ని వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల బారి నుంచి కాపాడే బలమైన వ్యవస్థ ఇది. ఇది పటిష్టంగా ఉంటే ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేవు. అయితే రోగనిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ముఖ్యంగా కొన్ని విటమిన్లుండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

విటమిన్‌ ‘సి’

మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లలో విటమిన్‌ ‘సి’ది కీలక పాత్ర. ఈ విటమిన్‌ లోపం ఉన్న వాళ్లు త్వరగా జబ్బు పడే అవకాశాలుంటాయి. అందుకే మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా లభించే కమలాఫలం, నిమ్మకాయ.. వంటి నిమ్మజాతి పండ్లను భాగం చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాగే పాలకూర, క్యాప్సికం.. వంటివి కూడా తీసుకోవాలి. అంతేకాదు.. విటమిన్‌ ‘సి’ శరీరానికి అందడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కూడా జాగ్రత్తపడచ్చట!

విటమిన్‌ ‘బి6’

రోగనిరోధక వ్యవస్థలో జరిగే జీవరసాయన ప్రతిచర్యలకు (బయో కెమికల్‌ రియాక్షన్స్‌కి) తోడ్పడుతూ ఆ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్‌ ‘బి6’ సహకరిస్తుంది. కాబట్టి బయటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్‌ ‘బి6’ అధికంగా లభించే అరటిపండ్లు, బంగాళాదుంపలు, చికెన్‌, చేపలు, శెనగలు.. వంటి ఆహార పదార్థాల్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.

విటమిన్ ‘ఇ’

విటమిన్‌ ‘ఇ’ మన శరీరంలో ఒక శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ ‘ఎ’

ఈ విటమిన్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్‌ ‘ఎ’ కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సొరకాయ.. వంటి విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్ని తీసుకోవడం ఉత్తమం.

విటమిన్‌ ‘డి’

విటమిన్‌ ‘డి’లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ గుణాలు రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, దాని రక్షణకు తోడ్పడతాయి. కాబట్టి ఈ విటమిన్‌ను పొందడానికి ఉదయాన్నే లేలేత ఎండలో ఓ అరగంట పాటు నిల్చోవాలి. అలాగే ఈ విటమిన్‌ అధికంగా లభించే చేపలు, పాలు, పప్పులు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ ‘డి’ వల్ల ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

గమనిక: మరీ అత్యవసరమైతే ఈ విటమిన్లను సప్లిమెంట్స్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.. అది కూడా డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్