పేస్ట్రీక్వీన్‌ పోటీల్లో తొలి భారతీయురాలు

మనసులో కోరిక బలంగా ఉంటే చాలు...అడ్డంకులెన్నైనా అలవోకగా దాటేయొచ్చంటారు గోవాకి చెందిన బేకర్‌ యురేకా అరౌజో. తాజాగా ఇటలీలోని డోల్స్‌ అరేనాలో జరిగిన వరల్డ్‌ పేస్ట్రీ క్వీన్‌ ఛాంపియన్‌షిప్‌-2023లో మూడవ స్థానాన్ని అందుకున్నారు. ఈ పోటీలకు హాజరైన తొలి భారత మహిళగా రికార్డుని సృష్టించారు.

Published : 21 Mar 2023 00:12 IST

మనసులో కోరిక బలంగా ఉంటే చాలు...అడ్డంకులెన్నైనా అలవోకగా దాటేయొచ్చంటారు గోవాకి చెందిన బేకర్‌ యురేకా అరౌజో. తాజాగా ఇటలీలోని డోల్స్‌ అరేనాలో జరిగిన వరల్డ్‌ పేస్ట్రీ క్వీన్‌ ఛాంపియన్‌షిప్‌-2023లో మూడవ స్థానాన్ని అందుకున్నారు. ఈ పోటీలకు హాజరైన తొలి భారత మహిళగా రికార్డుని సృష్టించారు.

రల్డ్‌ పేస్ట్రీ క్వీన్‌ ఛాంపియన్‌షిప్‌లో గెలుపు యురేకా కల. ఇందుకోసమే ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. మూడో స్థానంతో అందుకోవడమే కాదు...తాను చేసిన ఎస్ప్రెసో కాఫీఫ్లేవర్‌ జెలాటోకి ఉత్తమ డెజర్ట్‌ బహుమతీ లభించింది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పేస్ట్రీ చెఫ్‌లతో పోటీ పడే అవకాశం నాకు దక్కింది. ఈ విజయం స్ఫూర్తినందించడమే కాదు... భారతీయ చెఫ్‌ల ప్రతిభను ప్రపంచం అర్థం చేసుకోవడానికీ తోడ్పడుతుంద’నే యురేకాది గోవాలోని రిబందర్‌. ‘మా ఊరు ఎన్నో మధుర జ్ఞాపకాలని అందించింది. బేకింగ్‌పై ఇష్టాన్నీ పెంచింది. ముఖ్యంగా క్రిస్మస్‌ సందర్భంగా కరోల్స్‌ పాడుతూ... స్నేహితులూ, బంధువులతో కలిసి డోనట్స్‌, బెబింకా, మర్జీపాన్‌ చేసినప్పటి స్మృతులు, గోవా సంప్రదాయ వంటకమైన సెమోలినా కేక్‌ని హోం బేకర్‌ అయిన అమ్మతో కలిసి తయారు చేయడం నాకెంతో ఇష్టం. ఇవన్నీ హైస్కూలు రోజుల్లోనే నన్ను బేకింగ్‌ ఆర్ట్‌పై మనసు పారేసుకునేలా చేశాయి. దాంతో అప్పటి నుంచే సామాజిక మాధ్యమాల్లో మాస్టర్‌ చెఫ్‌లను అనుసరించడం ప్రారంభించా. వారి బేకింగ్‌ కళ నుంచి స్ఫూర్తి పొందుతూ... అందులోనే కెరియర్‌ని వెతుక్కున్నా. అలా చదువుకునే రోజుల్లోనే రోల్‌ప్లే, కిచెన్‌మెస్‌ బేకరీతో నా ప్రయాణం ప్రారంభించా’ అంటారు యురేకా.

ఆ థీమ్‌తో ప్రయోగాలు...

గోవాలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసి జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో జూనియర్‌ సాస్‌ చెఫ్‌గా చేరారు యురేకా. పేస్ట్రీల తయారీలో మరిన్ని నైపుణ్యాలు తెలుసుకోవాలనే ఆలోచనతో గుడ్‌గావ్‌లోని ‘అకాడెమీ ఆఫ్‌ పేస్ట్రీ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌’లో చేరారు. ఇదే తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని చెబుతారామె. అది మొదలు గోవా మారియెట్‌ రిసార్ట్స్‌ స్పా, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌తో సహా...దేశంలోని అనేక ఐదు నక్షత్రాల హోటళ్లలో పనిచేశారు. ప్రస్తుతం ముంబయిలోని సివాకో సంస్థకు క్రియేటివ్‌ డైరెక్టర్‌. 2011లో మొదటి సారి ఆల్‌ గోవా కేక్‌ డెకరేటింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచారు. 2017లో ఇండియా పేస్ట్రీ క్వీన్‌ అవార్డుని అందుకున్నారు. 2018 వరల్డ్‌ పేస్ట్రీ క్వీన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నా...దాన్ని అందుకోలేకపోయారు. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు తనని విజేతగా నిలిపాయని అంటారు యురేకా. ఈ సారి పోటీల్లో థీమ్‌ ‘జీనియస్‌ ఆఫ్‌ లియోనార్డో డావిన్సీ’. దీనికి అనుగుణంగా రకరకాల డెజర్ట్‌లను సిద్ధం చేశారామె. కేరమెల్‌ ఉత్పత్తులకు అద్భుతమైన రుచిని తెచ్చిపెట్టడంలో యురేకాది అందవేసిన చేయి. నట్టీ టార్ట్స్‌, డార్క్‌ చాక్లెట్‌తో ఫ్లాకీ క్రైసంట్స్‌, మాండరిన్‌ రిచ్‌ గెనాచ్‌, కరకరలాడే పెకాన్‌లతో క్రీమీ చాక్లెట్లు వంటి ఉత్పత్తులెన్నో ఈమె సృష్టే.

ఇబ్బందులను దాటి...

అన్నీ అనుకున్నట్లు సాగితే జీవితం ఎందుకవుతుంది...  నష్టాల్నీ, కష్టాల్నీ ఓర్చుకుంటూ ముందడుగు వేశారు యురేకా. కరోనా సమయంలో తను ప్రారంభించాలనుకున్న బేకరి అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రేస్టీ చెఫ్‌లుగా ఎదగాలనుకున్న వారికోసం ఇటలీలో అకాడెమీ ప్రారంభించాలన్నది తన కల. కానీ  ఆర్థిక, రాజకీయ కారణాలతో వీసా జారీకాలేదు. అయినా సరే, ఎప్పుడూ నిరుత్సాహపడలేదామె. తర్వాతే సివాకో, షుగర్‌ డార్లింగ్స్‌ సంస్థల్ని ప్రారంభించారు. క్రమంగా వ్యాపారాన్ని విస్తరించటం మొదలుపెట్టారు. అనుకున్నది చేయాలంటే పట్టుదలే కాదు...ఓర్పు కూడా ముఖ్యమే అనీ, అదే తన విజయాలకు సూత్రమనీ చెబుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్