రొమ్ము క్యాన్సర్‌ను జయించి.. వ్యాపారంలో రాణిస్తూ..!

ప్రకృతి మనకు ప్రసాదించే ప్రతి పదార్థం సకల పోషకాల మిళితం. అయితే వివిధ పద్ధతుల్లో వాటిని ప్రాసెస్‌ చేసే క్రమంలో ఆ పోషకాలు కనుమరుగవుతున్నాయి.. వీటిని తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్లే! స్వీయానుభవంతో ఈ విషయం తెలుసుకుంది మహబూబ్‌నగర్‌ జక్లపల్లికి చెందిన 60 ఏళ్ల కొట్ల.....

Published : 25 Dec 2022 15:56 IST

ప్రకృతి మనకు ప్రసాదించే ప్రతి పదార్థం సకల పోషకాల మిళితం. అయితే వివిధ పద్ధతుల్లో వాటిని ప్రాసెస్‌ చేసే క్రమంలో ఆ పోషకాలు కనుమరుగవుతున్నాయి.. వీటిని తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్లే! స్వీయానుభవంతో ఈ విషయం తెలుసుకుంది మహబూబ్‌నగర్‌ జక్లపల్లికి చెందిన 60 ఏళ్ల కొట్ల జయమ్మ. ఆరోగ్యకరమైన జీవనశైలితో ప్రమాదకర రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ఆమె.. ఇదే ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఎద్దు గానుగ నూనె తయారుచేయడం ప్రారంభించింది. తనతో పాటు నలుగురూ అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, మరెంతోమందికి ఉచితంగా శిక్షణ ఇస్తోన్న జయమ్మ.. తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది మహబూబ్‌నగర్‌ జిల్లా జక్లపల్లి. నేను ఏడో తరగతి వరకు చదువుకున్నా. గతంలో వ్యవసాయం, పాల వ్యాపారం చేసేవాళ్లం. మొదట్నుంచీ నాకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువ. ఈ క్రమంలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా వెళ్లేదాన్ని. అలా చిరుధాన్యాలు, ఎద్దు గానుగ నూనె.. వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న నేను.. అప్పట్నుంచి వీటిని నా జీవనశైలిలో చేర్చుకున్నా.

‘ఆరోగ్యదాయని’కి బీజం అలా!

నాకు గతంలో రొమ్ములో గడ్డ ఉందని తేలింది. పరీక్షలు చేయించుకుంటే రొమ్ము క్యాన్సర్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆపై ఆపరేషన్‌ చేసి గడ్డ తొలగించారు. తిరిగి కోలుకునే క్రమంలో చిరుధాన్యాలు, ఎద్దు గానుగ నూనె.. వంటివి ఎంతగానో ఉపకరించాయి. గత మూడేళ్లుగా ఇదే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తున్నా. ఈ క్రమంలోనే ఎద్దు గానుగ నూనె తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. మొదట మా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఒక ఎద్దు గానుగను ప్రారంభించాం. మంచి స్పందన రావడంతో గానుగల సంఖ్యను పెంచుతూ పోయాం. ఇప్పుడు పది గానుగలతో పదకొండు రకాల నూనెల్ని తయారుచేస్తున్నాం. ఎద్దు గానుగ నూనె ఆరోగ్యప్రదాయిని కాబట్టి.. మా వ్యాపారానికి ‘ఆరోగ్యదాయని’ అని పేరు పెట్టుకున్నాం.

ఏ నూనె.. ఎందుకోసం..?

మొదట్లో ఆరు నూనెలతో ప్రారంభించి.. ఇప్పుడు పదకొండు రకాల నూనెలు తయారుచేస్తున్నాం. పల్లీ, నువ్వులు, కుసుమ, గడ్డి నువ్వులు, అవిసెలు, ఆవాలు, బాదం, కొబ్బరి.. ఇవి మనం వంటల్లో ఉపయోగించేవి. కానుగ, వేప.. వంటివి సేంద్రియ వ్యవసాయం కోసం తయారుచేస్తున్నాం. అలాగే మా వద్ద తయారయ్యే ఇప్ప నూనెను దీపం కోసం వినియోగించచ్చు. వీటికి సంబంధించిన ముడి సరుకులు ఎక్కువగా ఉత్పత్తయ్యే ఆయా రాష్ట్రాల రైతుల దగ్గర్నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇక వీటి తయారీ విషయానికొస్తే.. ఒక గానుగలో 13 కిలోల ముడిసరుకును వేసి.. నీళ్లు చల్లుతూ ఎద్దు సహాయంతో గానుగను తిప్పుతాం. ఇలా ఉత్పత్తైన నూనెను వడకట్టి మూడు రోజుల పాటు ఎండలో ఉంచుతాం. ఈ క్రమంలో మిగతా అవశేషాలన్నీ అడుగుకు దిగిపోయి.. స్వచ్ఛమైన నూనె పైకి తేలుతుంది. ఇలా తయారైన నూనెను మా వద్దకొచ్చే వినియోగదారులతో పాటు హోల్‌సేల్‌ మార్కెట్లో విక్రయిస్తున్నాం. అది కూడా ప్లాస్టికేతర ప్యాకింగ్‌.. అంటే స్టీలు డబ్బాలు, గాజు సీసాలు.. వంటి వాటికి ప్రాధాన్యమిస్తున్నాం. ఇక ఈ నూనె తయారీలో పరిశుభ్రత, ఇతర నాణ్యతా ప్రమాణాల విషయాల్లో ఏమాత్రం రాజీ పడట్లేదు. నెలకు ఒక్క గానుగతో 500 లీటర్ల చొప్పున.. పది గానుగలతో గరిష్టంగా 5000 లీటర్ల దాకా నూనె ఉత్పత్తవుతుంది. ఈ నూనెను వర్షాకాలంలో మూడు నెలలు, శీతాకాలంలో ఆరు నెలలు, వేసవిలో తొమ్మిది నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు. నూనె తీశాక మిగిలిన పిప్పిని పశువుల దాణా కోసం స్థానికంగా విక్రయిస్తున్నాం.

ఉపాధి.. ఉచిత శిక్షణ!

ఈ వ్యాపారంతో కొంతమందికి ఉపాధి కల్పించడమే కాదు.. ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో సాగే ఈ శిక్షణలో భాగంగా నూనె తయారీ, గానుగ ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు తీసుకోవడం, గానుగలపై సబ్సిడీ, ముడిసరుకులు-మార్కెటింగ్‌.. వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఒక్కో నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించీ వివరిస్తాం. ఇలా ఇప్పటివరకు సుమారు 500 మంది మా దగ్గర శిక్షణ పొంది.. సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. ఇక వ్యాపారంలో ఆర్జించిన లాభాలతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల, దేవాలయంలో పలు అభివృద్ధి పనులు చేశాం.


అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకున్నా!

నాకు గతంలో పాల వ్యాపారం చేసిన అనుభవం ఉంది.. అయినా వ్యాపారానికి సంబంధించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం వీ-హబ్‌ నాకు కల్పించింది. బ్యాంకు రుణాలు ఎలా తీసుకోవాలి?, పన్నులెలా కట్టాలి? వ్యాపారం ఎలా చేయాలి? ఒకవేళ నష్టాలొస్తే ఎలా ఎదుర్కోవాలి?.. వంటి విషయాలెన్నో ఈ సంస్థ ద్వారా నేర్చుకున్నా. ఇప్పటికీ వాళ్ల నుంచి కావాల్సిన మద్దతు, ప్రోత్సాహం అందుతున్నాయి. ఎన్డీటీవీ నుంచి ‘శ్రేష్ఠ్‌ ఐకాన్‌ ఆఫ్‌ భారత్‌’ అనే అవార్డు కూడా అందుకున్నాం.


అదే నా లక్ష్యం!

ప్రస్తుతం మా నూనెల్ని హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసి.. కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోంది. వినియోగదారుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యకరమైన నూనెలు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో గానుగల సంఖ్యను కూడా పెంచే యోచనలో ఉన్నాం. అందరికీ అందుబాటులో ఉండేలా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఎద్దు గానుగ నూనె తయారు చేయడమే మా లక్ష్యం!


అధైర్యపడద్దు!

సాధారణంగా వ్యాపారం అంటేనే రిస్క్‌ ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకొని చాలామంది ‘ఈ వయసులో వ్యాపారం నీకు సాధ్యమవుతుందా?’ అని సందేహించారు. కానీ నేను వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాను. వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది కావాలి. ఎన్ని సవాళ్లు ఎదురైనా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్