మున్సిపాలిటీల సమాచారం.. ఒక్క క్లిక్కుతో అందిస్తూ..!

కుటుంబ నిర్వహణ నిమిత్తం మన ఆదాయ వ్యయాల్ని బట్టి ఒక బడ్జెట్‌ను రూపొందించుకోవడం సహజమే. అదే విధంగా స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీల వంటి పాలనా వ్యవస్థలు వివిధ మౌలిక సదుపాయాల కల్పన/అభివృద్ధి కోసం...

Published : 26 May 2023 11:57 IST

కుటుంబ నిర్వహణ నిమిత్తం మన ఆదాయ వ్యయాల్ని బట్టి ఒక బడ్జెట్‌ను రూపొందించుకోవడం సహజమే. అదే విధంగా స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీల వంటి పాలనా వ్యవస్థలు వివిధ మౌలిక సదుపాయాల కల్పన/అభివృద్ధి కోసం ఏటా ఒక ప్రణాళికను రూపొందించుకుంటాయి. నిర్దేశిత లక్ష్యాలు, పురోగతికి సంబంధించి ప్రత్యేక నివేదికలు కూడా రూపొందిస్తుంటాయి. అయితే ఈ నివేదికల్ని సంబంధిత వెబ్‌సైట్లలో పొందుపరిచినా.. ఆయా డాక్యుమెంట్లు కొన్ని సందర్భాలలో అవసరమైన వారికి అందుబాటులో ఉండకపోవచ్చు.. స్వీయానుభవంతో ఈ సమస్యను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన సుబ్బలక్ష్మి కృష్ణమూర్తి. ఈ క్రమంలోనే పట్టణ పాలనకు సంబంధించిన సమాచారాన్ని సరళంగా, విశ్లేషణాత్మకంగా అందించాలన్న లక్ష్యంతో ఓ ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించారామె. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీల సమాచారమంతా ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. పౌర సమస్యలపై తనకున్న ఆసక్తే ఈ విభిన్న వ్యాపారాంశాన్ని ఎంచుకునేలా చేసిందంటోన్న సుబ్బలక్ష్మి.. క్రెడిట్‌ రేటింగ్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి వ్యాపారవేత్తగా మారే క్రమంలో తనకెదురైన అనుభవాల్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టిపెరిగిందంతా చెన్నైలోనే! పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డా. నాన్న వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో నాన్ననే స్ఫూర్తిగా తీసుకుంటూ పెరిగా. ఛార్టర్డ్ అకౌంటెన్సీ,  కాస్ట్ అకౌంటెన్సీ పూర్తిచేశాక.. జర్నలిజంలో పీజీ డిప్లొమా చదివాను.

దేశం కోసం.. నా వంతుగా!

చదువు పూర్తయ్యాక ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ‘క్రిసిల్‌’లో ఉద్యోగమొచ్చింది. అందులోని ‘పబ్లిక్‌ ఫైనాన్స్‌-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రేటింగ్స్‌’ విభాగానికి హెడ్‌గా వ్యవహరించా. ఈ క్రమంలోనే క్రెడిట్‌ రేటింగ్‌ నిపుణురాలిగా పేరు గడించాను. ప్రస్తుతం ‘ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’లో సభ్యురాలిగా కొనసాగుతున్నా. ‘ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకమైన నైపుణ్యాలుంటాయి. వాటిని దేశ సేవ కోసం వినియోగించుకోవాల’ని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. దీనికి తోడు నాకు ముందు నుంచీ పౌర సమస్యలపై ఆసక్తి ఎక్కువ! ఈ మక్కువతోనే సమయం దొరికినప్పుడల్లా ఈ విషయాల గురించి నాన్నతో ఎక్కువగా చర్చించేదాన్ని. ఇక నాన్న పోయాక సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలన్న పట్టుదల పెరిగింది. ఈ ఆలోచనతోనే దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారాన్ని ఓ వేదిక పైకి తీసుకురావాలనుకున్నా. ప్రత్యేకించి మున్సిపల్ బాండ్ మార్కెట్స్ రంగంలో సేవలందించాలని ఆశించా. మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారమే ఎందుకంటే.. ఆ సమయంలో ఆయా మున్సిపాలిటీలకు చెందిన వెబ్‌సైట్లలో సంబంధిత పత్రాలు, బడ్జెట్‌ ప్రతుల్ని అనుసంధానించినా.. అవి ఓపెన్ కాకపోవడం, అందుబాటులో లేకపోవడం.. వంటి సమస్యల్ని స్వీయానుభవంతో గుర్తించా. దీనికి పరిష్కారంగా.. 2010లో ‘పబ్లిక్‌ ఫైనాన్స్‌ ఇండియా’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి.. తొలి దశలో ఈ మున్సిపల్‌ డాక్యుమెంట్స్‌ని యథావిధిగా ఓ లైబ్రరీలో అందుబాటులో ఉంచాం.

సరళంగా, విశ్లేషణాత్మకంగా..!

ఆ తర్వాత కొన్నేళ్లకు ఈ మున్సిపల్‌ డాక్యుమెంట్లను ఎక్సెల్‌ స్ప్రెడ్‌షీట్లుగా మార్పు చేసి అందించాం. అయితే వీటి వినియోగం తక్కువని గ్రహించిన మేము.. ఈ సమాచారాన్ని మరింత సరళీకరిస్తూ, విశ్లేషిస్తూ డేటాబేస్ రూపంలో ఆన్‌లైన్ వేదిక పైకి తీసుకొచ్చాం.  సాధారణంగా ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీలకు సంబంధించిన సమాచారం, రిపోర్టులు స్థానిక భాషలోనే అందుబాటులో ఉంటాయి. వీటన్నింటినీ ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసే క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇక సందేహాల నివృత్తి, సమాచారాన్ని సులభంగా పోల్చుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం. సీడ్ ఫండింగ్ సమకూర్చుకుని 2021లో ‘మునిఫై డేటా టెక్’ను ప్రారంభించాం. మున్సిపాలిటీలకు సంబంధించిన వివిధ రిపోర్టులు, బడ్జెట్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు,   వివిధ ప్రాజెక్టులు, బాండ్ ఆఫర్ డాక్యుమెంట్లు, కాగ్ ఆడిట్ నివేదికలు.. మొదలైన వాటి నుంచి సమాచారాన్ని సేకరించి ఈ ఆన్‌లైన్ వేదికగా సరళంగా, విశ్లేషణాత్మకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.

అంతర్జాలంతో పాటు సమాచార హక్కు చట్టం స్ఫూర్తితో మున్సిపల్ కార్పొరేషన్స్‌కు లేఖలు రాయడం, నెట్‌వర్కింగ్.. వంటి మార్గాల ద్వారా వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సమాచారాన్ని ఆర్థిక రంగ సంస్థలు, కన్సల్టింట్‌ సంస్థలు, రీసెర్చ్‌ స్కాలర్స్, మున్సిపల్ కార్పొరేషన్లతో వివిధ లావాదేవీలు నిర్వహించే సప్లయర్లు.. వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉపయోగించుకోవచ్చు.

దీనికోసం ఆయా అంశాల్లో నిపుణులైన సిబ్బంది మా సంస్థ తరఫున వివిధ ప్రాంతాల నుంచి పని చేస్తున్నారు. వీరిలో ౮౦ శాతం మంది మహిళలే. విశ్లేషణ నైపుణ్యాలు మహిళలకే అధికంగా ఉంటాయని నేను భావిస్తా. అందుకే సిబ్బంది నియామకంలో వీరికే ప్రాధాన్యమిస్తున్నా.

భవిష్యత్తులో ఇలా!

ప్రస్తుతం ‘మునిఫై డేటా టెక్’ వేదికగా వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన వివిధ సమాచార పత్రాలు (సుమారు 4700లకు పైగా) అందుబాటులో ఉన్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని అత్యంత విశ్వసనీయంగా అందించడమే లక్ష్యంగా భవిష్యత్తులో ఈ వేదికను తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఇక వీహబ్ సహకారంతో మా బిజినెస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోగలిగాం. మా సేవలకు గుర్తింపుగా ‘యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) స్టార్టప్‌ పిచ్‌ పోటీ’లోనూ గెలుపొందాం.
సబ్‌స్క్రిప్షన్స్, రీసెర్చ్ సపోర్ట్ సేవల ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తున్నా. దేశవ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి సుమారు ౧౦ సంవత్సరాల డేటా మా వద్ద అందుబాటులో ఉంది. మున్సిపల్ బాండ్ మార్కెట్లు వృద్ధి చెందితే వివిధ నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన తక్కువ ఖర్చుతో, మరింత వేగవంతమవుతుంది. ఈ నేపథ్యంలో వివిధ మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా క్రెడిట్ మార్కెట్లకు అవసరమయ్యే ఆర్ధిక సమాచారాన్ని అత్యంత విశ్వసనీయమైన రీతిలో అందించాలన్నదే నా ఆశయం.

ఆ భయాన్ని జయిస్తేనే..!

భార్యాభర్తలిద్దరూ వ్యాపారవేత్తలైతే.. అందులోని లాభనష్టాల ప్రభావం ఇంటి బాధ్యతలు, తమ అనుబంధం పైనా పడుతుందంటారు. అయితే ఆ సమస్య రాకుండా మేం జాగ్రత్తపడుతున్నాం. ప్రస్తుతం నేను వ్యాపారంలో నిలదొక్కుకోగలిగానంటే మావారి ప్రోత్సాహం ఎంతో! ఇంటి పనులైనా, కెరీరైనా.. ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకుంటే ఒత్తిడి లేకుండా ముందుకు సాగచ్చు. ఇక వ్యాపారమంటే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని భయముంటుంది. సఫలమవుతామో, విఫలమవుతామోనన్న సందేహాల్ని పక్కన పెట్టి.. మనసు లోతులో ఉన్న ఆ భయాన్ని జయిస్తే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్