పెళ్లికి ముందే స్టెంట్ వేశారు.. పిల్లలు పుడతారా?

నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇంతవరకు గర్భం దాల్చలేదు. పెళ్లికి ముందే నాకు స్టెంట్ వేశారు. ఈ విషయం మా అత్తగారి ఇంట్లో తెలిసి గొడవ చేస్తున్నారు. నాకు బీపీ కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది....

Published : 18 May 2024 18:05 IST

నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇంతవరకు గర్భం దాల్చలేదు. పెళ్లికి ముందే నాకు స్టెంట్ వేశారు. ఈ విషయం మా అత్తగారి ఇంట్లో తెలిసి గొడవ చేస్తున్నారు. నాకు బీపీ కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నేను గర్భం దాల్చడం కుదరదని, చాలా ప్రమాదకరమని డాక్టర్‌ చెప్పారు. నాకేమో పిల్లలు కావాలని చాలా కోరికగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు పెళ్లికి ముందే స్టెంట్ వేశారని అంటున్నారు. సాధారణంగా గుండెకు సరఫరా అయ్యే రక్తనాళంలో బ్లాక్‌ అయితే స్టెంట్ వేస్తుంటారు. ఒక వయసు దాటిన వారిలో లేదా డయాబెటిస్ ఉన్న వారిలో, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారిలో ఇలా బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివిధ కారణాల వల్ల రక్తం గడ్డ కట్టే టెండెన్సీ ఉన్నా ఇలా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే- మీ విషయంలో స్టెంట్‌ వేయడానికి గల కారణాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే- సాధారణంగా కొంతమందిలో గర్భధారణ సమయంలో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఒకవేళ ఇంతకు ముందే ఉన్నా లేకపోయినా కొంతమందిలో ఈ సమస్య ప్రెగ్నెన్సీ సమయంలో 4 నుంచి 5 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ విషయంలో ఈ సమస్య ఉందా లేదా అనేది చెక్‌ చేయించుకోవాలి. అందుకోసం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.
ఈ క్రమంలో- మీరు ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీ గుండె పని తీరు ఎలా ఉంది? గుండెకు సంబంధించిన వ్యాయామాలు చేయగలుగుతారా? మందుల ద్వారా బీపీని నియంత్రించే అవకాశం ఉందా.. వంటి విషయాలను కూడా పరిశీలిస్తారు. వాటిని బట్టి మీరు గర్భం దాల్చచ్చా? లేదా? అనేది తెలియజేస్తారు.
మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భం రాదని తెలిస్తే సరోగసీ పద్ధతిని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మీ అండాశయంలో ఉన్న ఎగ్స్‌ని తీసి మీ భర్త వీర్యంతో ఫలదీకరిస్తారు. దానివల్ల ఏర్పడిన పిండాన్ని మరొక మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. కాబట్టి, మీరు పరోక్షంగానైనా పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. ఒకవేళ సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనాలంటే వాటికి సంబంధించి కొన్ని చట్టపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ వివరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఏది ఏమైనా పిల్లలు లేరని నిరాశపడకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్