చిన్నారులకు ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌కి చూపించాలి?

నా మనవడి వయసు 8 నెలలు. బాబుకి జ్వరం వచ్చినప్పుడల్లా వాళ్లమ్మ సిరప్‌ తాగించి సరిపెడుతుంటుంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దామంటే ‘అక్కర్లేదు’ అని సమాధానమిస్తుంటుంది. ఏ అర్ధరాత్రో జ్వరం ఎక్కువవుతుందేమోనని నా భయం. జ్వరం ఏ స్థాయి వరకు ఉంటే ఇంటి వైద్యంతో సరిపెట్టవచ్చు? ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌ని సంప్రదించాలి?

Published : 10 May 2024 12:16 IST

నా మనవడి వయసు 8 నెలలు. బాబుకి జ్వరం వచ్చినప్పుడల్లా వాళ్లమ్మ సిరప్‌ తాగించి సరిపెడుతుంటుంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దామంటే ‘అక్కర్లేదు’ అని సమాధానమిస్తుంటుంది. ఏ అర్ధరాత్రో జ్వరం ఎక్కువవుతుందేమోనని నా భయం. జ్వరం ఏ స్థాయి వరకు ఉంటే ఇంటి వైద్యంతో సరిపెట్టవచ్చు? ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌ని సంప్రదించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. రెండేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో 100 డిగ్రీల వరకు సాధారణ ఉష్ణోగ్రతగానే పరిగణిస్తుంటారు. ఒకవేళ 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టుగా భావించాలి. అయితే జ్వరం అనేది వ్యాధి కాదు. శరీరం నుంచి చెమట, నొప్పి ఎలా వస్తుందో.. జ్వరం కూడా అలా వస్తుంటుంది. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ప్రతిస్పందిస్తుంది. ఈ క్రమంలో శరీరం నుంచి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. దాన్నే జ్వరం అంటుంటాం.

జ్వరం రావడానికి రెండు కారణాలుంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్‌.. రెండోది డీహైడ్రేషన్‌. మీ మనవడి వయసు 8 నెలలు అంటున్నారు. ఈ వయసులో అప్పుడే ఘన పదార్థాలు ఇవ్వడం మొదలుపెడుతుంటారు. పాలు ఇవ్వడం తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఒకవేళ ఇన్ఫెక్షన్‌ వల్ల జ్వరం వస్తే బేబీ డీలా పడుతుంది. ఆహారం సరిగా తీసుకోదు. వీటికి తోడు జలుబు, వాంతులు, విరేచనాలు.. వంటి ఇన్ఫెక్షన్‌ సంబంధిత లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు శరీర ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. ఒకవేళ కేవలం డీహైడ్రేషన్‌ వల్ల జ్వరం వస్తే ఒకటి, రెండు డోసుల జ్వరం మందు వేయాలి. 24 గంటల పాటు ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అప్పటికీ జ్వరం తగ్గని పక్షంలో తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్