నలభైల్లో పిల్లల్ని కనచ్చా?

నా వయసు 39. పిల్లల్ని కనాలని ఉంది. కానీ, చాలామంది ఈ వయసులో పిల్లలేంటని నిరుత్సాహపరుస్తున్నారు. కొంతమంది నలభైల్లో కూడా పిల్లల్ని కనచ్చు.. ప్రయత్నించి చూడండని సలహా ఇస్తున్నారు. ఈ వయసులో పిల్లలు పుట్టినా వైకల్యం వస్తుందని మరికొందరు భయపెడుతున్నారు. వీటిల్లో నిజమెంత?

Published : 13 Apr 2024 12:44 IST

నా వయసు 39. పిల్లల్ని కనాలని ఉంది. కానీ, చాలామంది ఈ వయసులో పిల్లలేంటని నిరుత్సాహపరుస్తున్నారు. కొంతమంది నలభైల్లో కూడా పిల్లల్ని కనచ్చు.. ప్రయత్నించి చూడండని సలహా ఇస్తున్నారు. ఈ వయసులో పిల్లలు పుట్టినా వైకల్యం వస్తుందని మరికొందరు భయపెడుతున్నారు. వీటిల్లో నిజమెంత? - ఓ సోదరి

జ. 40 ఏళ్ల వరకు పిల్లల కోసం ప్రయత్నించవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ముందుగా మీరు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా మహిళల్లో అండాల సంఖ్య వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇరవైల్లో ఉన్నప్పుడు లక్షల్లో, ముప్పైల్లో ఉన్నప్పుడు వేలల్లో, నలభైల్లోకి వచ్చే సరికి ఆ సంఖ్య వందలకు పడిపోతుంటుంది. పిల్లల్ని కనడానికి అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా ఎంతో ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత కూడా తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఒకవేళ నాణ్యత లేని అండం ఫలదీకరణ చెందినప్పుడు పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వస్తుంటాయి. డౌన్‌ సిండ్రోమ్‌, ఎడ్వర్డ్స్‌ సిండ్రోమ్‌.. వంటివీ ఇందులో భాగమే.

మీరు పిల్లల కోసం ప్రయత్నించచ్చు. కానీ పైఅంశాలను దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలి. వారు సూచించిన టెస్ట్‌లు చేయించుకుంటూనే, మందులు వాడాలి. ఒకవేళ గర్భం వచ్చినా కొన్ని జన్యుపరమైన టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటి ద్వారా పిండం ఎదుగుదల ఎలా ఉంది? జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ అంశాలన్నింటికీ మానసికంగా సిద్ధమైనప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి సాధారణ చెకప్స్‌కు వెళితే మాత్రం సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా గర్భం నిలబడాలంటే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండాలి. ప్రెగ్నెన్సీని తట్టుకునే శక్తి యుక్త వయసులో ఉన్నట్లుగా నలభైల్లో ఉండదు. కాబట్టి మీ ఫిట్‌నెస్‌ను కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు బీపీ, షుగర్‌ టెస్ట్‌లు కూడా చేయించుకోవాలి. ఇలా అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఎల్లప్పుడూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉంటే గర్భధారణలో, పిండం ఎదిగే క్రమంలో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్