నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!

నిద్ర శరీరాన్ని రీఛార్జ్‌ చేస్తుంది. అందుకే రాత్రంతా సుఖంగా, హాయిగా నిద్ర పడితేనే మరుసటి రోజు ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతాం. కానీ కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. కొన్ని అత్యవసర పనుల వల్ల నిద్రను త్యాగం చేయాల్సి రావచ్చు....

Published : 29 Mar 2024 13:12 IST

నిద్ర శరీరాన్ని రీఛార్జ్‌ చేస్తుంది. అందుకే రాత్రంతా సుఖంగా, హాయిగా నిద్ర పడితేనే మరుసటి రోజు ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతాం. కానీ కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. కొన్ని అత్యవసర పనుల వల్ల నిద్రను త్యాగం చేయాల్సి రావచ్చు. ఇలా రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు నీరసించిపోతుంటాం. కానీ ఇలా జరగకుండా కొన్ని చిట్కాలు ఉపకరిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

తేమ కోల్పోకుండా..!
నిద్రలేమి అలసటను దూరం చేసుకోవాలంటే శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా జాగ్రత్తపడడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజంతా నీళ్లు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెబుతున్నారు. నీళ్లతో పాటు పండ్ల రసాలు, హెర్బట్‌ టీలు, పండ్ల ముక్కలు/కాయగూర ముక్కలు/మూలికలు వేసి తయారుచేసిన ఇన్‌ఫ్యూజ్‌డ్‌ వాటర్‌.. వంటివి తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌ అవుతుంది.. అలాగే వాటిలోని పోషకాలూ శరీరానికి అందుతాయి. ఫలితంగా తక్షణ శక్తి వస్తుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి!
రోజులో మనం తీసుకొనే తొలి ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌. ఇది రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్నీ అందిస్తుంది. ముందు రోజు రాత్రి నిద్ర లేకపోయినా.. ఆ అలసటను దూరం చేసుకునేలా పోషకాలున్న అల్పహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రొటీన్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఓట్‌మీల్‌, పండ్లు, నట్స్‌, కోడిగుడ్లు, సలాడ్స్‌.. వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుందంటున్నారు. తద్వారా మధ్యాహ్న భోజనం వరకు అలసట దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే తీసుకునే ఆహారంలో చక్కెరలు, కెఫీన్‌ వంటివి లేకుండా చూసుకోవాలి.

విరామం తీసుకోండి!
రాత్రంతా నిద్ర లేకుండా మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లడం, ఇతర పనుల్ని పూర్తిచేయడమంటే చిరాకే! అలాగని వాటిని పక్కన పెట్టలేం. కాబట్టి ముందు రోజు నిద్రలేమి ఆయా పనులపై పడకూడదంటే.. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పచ్చటి మొక్కల మధ్య కాసేపు నడవడం, నచ్చిన పాట వినడం, నచ్చిన వారితో మాట్లాడడం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం.. ఇలాంటి పనుల వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. ఇది పనిపై తిరిగి పూర్తి దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది.

ఒత్తిడికి దూరంగా..!
ముందు రోజు రాత్రి నిద్రలేమి మరుసటి రోజు ఒత్తిడికి కారణమవుతుంటుంది. దీనివల్ల అలసట, నీరసమే కాదు.. అలర్ట్‌నెస్‌ని కూడా కోల్పోతుంటాం. ఇలా జరగకూడదంటే ఒత్తిడిని దూరం చేసుకొనే మార్గాల్ని అన్వేషించాలి. ఇందుకు ఉదయాన్నే ఓ అరగంట సేపు యోగా, ధ్యానం.. వంటివి సాధన చేయాలి. వీటివల్ల శరీరానికి వ్యాయామం అందడమే కాదు.. నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం పడుతుంది. తద్వారా నాడులు రిలాక్సై.. ఒత్తిడి దూరమవుతుంది. ఇలాంటి మానసిక సమస్యలు లేకపోతే రోజంతా ఉత్సాహంగా గడిపేయచ్చు.

‘కునుకు’.. మంచిదే!
రాత్రంతా నిద్ర పోలేదని కొంతమంది మరుసటి రోజు మధ్యాహ్నం గంటల తరబడి నిద్ర పోతుంటారు. కానీ ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల చురుకుదనం తగ్గి.. రోజంతా మరింత మగతగా ఉంటుందంటున్నారు. కాబట్టి మధ్యాహ్నం 10-20 నిమిషాల పాటు కునుకు తీయడం మంచిదంటున్నారు. అలాగే మధ్యాహ్నం ఎక్కువ సేపు పడుకోవడం వల్ల దాని ప్రభావం ఆ రోజు రాత్రి నిద్ర పైనా పడుతుంది. దాంతో ఆ రోజూ నిద్ర కరువయ్యే ప్రమాదం ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్