అమ్మ నమ్మకమే గెలిపించింది!

నలుగురు సంతానంలో ఇద్దరికి మానసిక వైకల్యం. అయినా ఆ తల్లి కుంగిపోలేదు. హస్తకళల తయారీ ప్రారంభించి మరికొందరి మహిళలకు ఉపాధిని, తన పిల్లల్లాంటివారికి శిక్షణనిస్తున్నారు.

Updated : 09 Feb 2023 00:46 IST

నలుగురు సంతానంలో ఇద్దరికి మానసిక వైకల్యం. అయినా ఆ తల్లి కుంగిపోలేదు. హస్తకళల తయారీ ప్రారంభించి మరికొందరి మహిళలకు ఉపాధిని, తన పిల్లల్లాంటివారికి శిక్షణనిస్తున్నారు. మానసిక వికలాంగురాలైన కుమార్తెనూ ఈ మార్గంలో నడిపించారీమె. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొనేలా తీర్చిదిద్దిన గోమతి స్ఫూర్తి కథనమిది.

నిరుపేద కుటుంబానికి కోడలిగా వచ్చిన గోమతిది తమిళనాడు, తూత్తుకుడి. తొలి సంతానం ఇందూ ఉమా ఎళిలరసికి మానసిక వైకల్యం ఉందని తెలిసి అందరూ నిట్టూర్చారు. గోమతి మాత్రం తన చిన్నారికి తగిన చికిత్సనిప్పించి మిగతావారిలా నైపుణ్యాలను అందించాలనుకొన్నారు. అందుకని భర్తతో కలిసి చెన్నైకి చేరుకున్నారు.

శిక్షణనిచ్చి..

మానసిక వైకల్యంతో ఇందూ అందరి పిల్లల్లా మాట్లాడలేకపోయేది, నడవలేకపోయేది. ‘చెన్నై వచ్చినప్పుడు తెలిసినవాళ్లు లేక చాలా ఇబ్బందిపడ్డా. పాపకు చికిత్స చేయించాలంటే డబ్బు అవసరం. అందుకే ఆర్థికంగా నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నా. గ్రీటింగ్‌ కార్డులు, జనపనార బ్యాగులు, సెంటెడ్‌ క్యాండిల్స్‌, పట్టుదారంతో జ్యూవెలరీ, సాంబ్రాణి తయారీ వంటివి చిన్నప్పటి నుంచి తెలుసు. 17 ఏళ్లప్పుడు నేను వేసిన ఒక చిత్రలేఖనాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు కానుకగా నాన్న తీసుకెళ్లారు. ఆయనకు నచ్చి, తూత్తుకుడి పూంపుహార్‌ కార్పొరేషన్‌ నుంచి ఆర్డర్లు వచ్చేలా సిఫారసు చేశారు. ఆ తర్వాత చాలామంది ప్రముఖులకు పెయింటింగ్స్‌ వేసిచ్చాను. ఈ అనుభవాలన్నింటితో 2017లో ‘ఎళిల్‌ కరన్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ ప్రారంభించా. ఉత్పత్తులను మొదట చుట్టుపక్కలవాళ్లకు విక్రయించేదాన్ని. అందరికీ నచ్చడంతో మళ్లీ అడిగేవారు. దీంతో మరికొందరు మహిళలకు శిక్షణనిచ్చా. అలా ఇందూకు కూడా నేర్పా. క్రమేపీ తను కూడా నైపుణ్యాలు పెంచుకుంది. బ్యాగులు కుట్టడం, గ్రీటింగ్‌కార్డుల తయారీలో శిక్షణ పొందింది. ఇది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటారు గోమతి.

అలాంటివారికి..

ఇందూకి వీటి తయారీతో మెదడు చురుకుగా మారి చికిత్సకు దోహదపడింది. సృజనాత్మకంగా ఉత్పత్తులను తయారు చేయడంలో నైపుణ్యాలు పెంచుకుంది. ఈ శిక్షణే ఆమెలో మార్పు తెచ్చిందని వైద్యులు చెప్పడంతో ఆమెలాంటివారికి కూడా గోమతి శిక్షణ ప్రారంభించారు. ‘మా అమ్మాయిలాంటివారికి మరికొందరికి డ్రాయింగ్‌, టైలరింగ్‌, హస్తకళలు వంటివి ఉచితంగా నేర్పడం మొదలుపెట్టా. ఇందూ తర్వాత పుట్టిన మరో ముగ్గురు పిల్లల్లో కరణ్‌ విగ్నేష్‌ది కూడా ఇదే సమస్య. తనకూ ఇప్పుడు శిక్షణనిస్తున్నా. మిగతా ఇద్దరిలో కార్తిక్‌, నాగలక్ష్మి ఉన్నతవిద్యాభ్యాసం చేశారు. అలాగే హెర్బల్‌ శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా తయారుచేస్తున్నాం. తులసి, కలబంద గుజ్జు, వేప, పసుపు వంటి సహజసిద్ధమైనవాటితో రూపొందిస్తున్నాం. ఈ యూనిట్‌లో మాత్రమే 20మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ పంపిణీ చేయనున్నాం. తమిళనాడు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మధురై, తిరుచ్చి, నాగర్‌కొయిల్‌ ప్రాంతాల్లోనూ వినియోగదారులున్నారు. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌’లో ఎనిమిదేళ్లగా మెంటార్‌గా పనిచేస్తున్నా. వికలాంగులతోపాటు వారి తల్లిదండ్రులకు స్వయం ఉపాధి పొందడంలో శిక్షణనిచ్చేదాన్ని’ అంటారు గోమతి. ఈ సంస్థ సహకారంతో ఇందూకు నేషనల్‌ అవార్డుకు దరఖాస్తు చేశారు. వైకల్యంతో తనలాంటివారికి ఉపాధి కల్పిస్తున్న క్యాటగిరీలో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకొంది ఇందు. జాతీయస్థాయిలో అందుకున్న ఈ అవార్డు తన కూతురిలాంటి వారందరికీ అని చెబుతున్న గోమతి కథ స్ఫూర్తిదాయకం కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్