Miss Universe: ఫ్యాషన్‌తో ఆ మార్పు తీసుకొస్తా!

‘అనుకోవడానికి, ఆచరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనసులో అనుకుంటేనే సరిపోదు.. దాన్ని చేతల్లో చూపినప్పుడే సమాజంలో మార్పును చూడచ్చు..’ అంటోంది కొత్త విశ్వసుందరి ఆర్‌.బోనీ గ్యాబ్రియెల్. 82 దేశాల అందాల భామల్ని వెనక్కి నెట్టి తాజాగా మిస్‌ యూనివర్స్‌.....

Updated : 16 Jan 2023 19:52 IST

(Photos: Instagram)

‘అనుకోవడానికి, ఆచరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనసులో అనుకుంటేనే సరిపోదు.. దాన్ని చేతల్లో చూపినప్పుడే సమాజంలో మార్పును చూడచ్చు..’ అంటోంది కొత్త విశ్వసుందరి ఆర్‌.బోనీ గ్యాబ్రియెల్. 82 దేశాల అందాల భామల్ని వెనక్కి నెట్టి తాజాగా మిస్‌ యూనివర్స్‌గా అవతరించిందీ అమెరికా భామ. కేవలం తన అందంతోనే కాదు.. తెలివైన తన సమాధానంతోనూ అందరి మనసులు గెలుచుకొని.. విశ్వ సుందరి కిరీటం ఎగరేసుకుపోయిందీ చక్కనమ్మ. వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె.. ఇదే ఫ్యాషన్‌తో ఈ సమాజంలో మార్పు తీసుకొస్తానంటూ అందాల పోటీల వేదికగా ప్రమాణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త విశ్వసుందరి గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం..!

తొలి ఫిలిప్పినో-అమెరికన్

ఆర్‌.బోనీ నోలా గ్యాబ్రియెల్.. అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టిపెరిగింది. అమెరికా తరపున ‘మిస్‌ యూనివర్స్‌-2022’ పోటీల్లో పాల్గొన్న ఆమె.. తాజా విశ్వ సుందరిగా అవతరించింది. దీంతో ఈ కిరీటం గెలిచిన ‘తొలి ఫిలిప్పినో-అమెరికన్‌’గానూ గుర్తింపు తెచ్చుకుంది గ్యాబ్రియెల్. నిజానికి ఆమె తండ్రిది ఫిలిప్పీన్స్‌.. తల్లిది అమెరికా. ‘మా నాన్న చదువుకునే సమయంలో తన కాలేజీ స్కాలర్‌షిప్‌లో భాగంగా ఫిలిప్పీన్స్‌ నుంచి అమెరికా వచ్చారు. ఇక్కడే స్థిరపడాలనుకున్నారు. టెక్సాస్‌లో మా అమ్మను కలుసుకున్నారు. వాళ్ల ప్రేమకు ప్రతిరూపంగా ముగ్గురు అన్నయ్యలు, నేను జన్మించాం. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఈ రెండు దేశాల ప్రభావం నాపై చాలానే ఉంది. అందుకే ఈ రెండు దేశాలంటే నాకు ఎనలేని ప్రేమ, అభిమానం..’ అంటూ ఓ సందర్భంలో తన దేశభక్తిని చాటుకుందీ అందాల తార.

ఎకో-ఫ్యాషనర్!

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే గ్యాబ్రియెల్‌కు చిన్నతనం నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే 2018లో ‘నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీ’ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ (ఫైబర్‌ స్పెషలైజేషన్‌)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువకు తోడు తనతో పాటు నలుగురూ ఎదగాలనుకునే నైజం ఆమెది. అందుకే చదువు పూర్తయ్యాక ‘ఆర్‌.బోనీ నోలా’ పేరుతో ఓ సహజసిద్ధమైన ఫ్యాషన్‌ లైన్‌ను ప్రారంభించింది. వృథాగా పడేసే దుస్తులు, కట్‌ పీసెస్‌ను సేకరించి.. వాటిని అప్‌సైకిల్‌ చేసి.. ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని రూపొందించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇలా తన సంస్థ ద్వారా నలుగురికీ ఉపాధి కల్పించడమే కాదు.. ‘మ్యాగ్‌పైస్ అండ్‌ పీకాక్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా మానవ అక్రమ రవాణా, గృహహింస బాధిత మహిళలకు కుట్టుపనిలో శిక్షణ ఇస్తోంది.

మార్పు మనతోనే..!

గ్యాబ్రియెల్ ఏ ఫ్యాషన్‌తోనైతే తన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుందో.. ‘మిస్‌ యూనివర్స్‌’ వేదికపై అదే ఆశయంతో తాను చెప్పిన సమాధానం జడ్జిల్నే కాదు.. యావత్‌ ప్రపంచాన్నీ ఆకట్టుకుంది. ‘విశ్వసుందరిగా ఈ సమాజంలో మెరుగైన మార్పు తీసుకొచ్చే దిశగా మీరు ఈ వేదికను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చి కిరీటాన్ని చేజిక్కించుకుందీ అమెరికన్‌ అందం.

‘ఫ్యాషన్‌ నా ప్రాణం. గత 13 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. మంచి చేయడానికి ఫ్యాషన్‌ ఓ మార్గమని నా నమ్మకం. వృథాగా పడేసే దుస్తుల్ని రీసైకిల్‌ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నా. మరోవైపు.. మానవ అక్రమ రవాణా, గృహహింస బాధిత మహిళలకు కుట్టుపనిలో శిక్షణ ఇస్తున్నా. మనం ఎదగడం ఎంత ముఖ్యమో.. మన పనులతో మన చుట్టూ ఉన్న వారు ఎదిగేలా చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఇతరుల జీవితాల్లో మార్పు దిశగా ఉపయోగిస్తే.. ఈ సమాజంలో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు..’ అంది గ్యాబ్రియెల్.

ఇప్పుడు కాక.. ఇంకెప్పుడు?!

మనలోని ప్రతిభకు, వయసుకు సంబంధమే లేదంటోంది గ్యాబ్రియెల్. కొన్ని రంగాల్లో వయసు మహిళల ప్రతిభకు ఆటంకంగా మారుతోందంటోంది. ఈ అంశంలో మార్పు రావాలని మిస్ యూనివర్స్ వేదికగా కోరుకుందామె. ‘మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో చేయాల్సిన ముఖ్యమైన మార్పు పోటీదారుల వయోపరిమితి పెంచడం. ఇప్పుడు నా వయసు 28. పోటీదారుల్లో నేనే పెద్ద. అందుకు నాకు చింత లేదు. ‘ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?!’ అన్న సూత్రాన్ని నేను బాగా నమ్ముతా. వయసు మన ప్రతిభను నిర్వచించదు. నిన్న కాదు.. రేపు కాదు.. ఈ క్షణం మాత్రమే మనది! అందుకే ఈ క్షణం మనల్ని మనం నిరూపించుకోవడానికి, మనం అనుకున్నది చేయడానికి వెనకాడకూడదు..’ అంటూ తన మాటలతోనూ నేటి యువతలో స్ఫూర్తి నింపిందీ అమెరికన్‌ అందం.

స్విమ్‌సూట్‌ కేప్‌.. ఆ కథే స్ఫూర్తి!

జీవితంలో ఒడిదొడుకులనేవి సహజం.. వాటిని తట్టుకొని ముందుకు సాగినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం అంటోంది గ్యాబ్రియెల్. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భాగంగా స్విమ్‌సూట్‌ రౌండ్‌ కోసం తాను ధరించిన స్విమ్‌సూట్‌ కేప్‌ను తానే స్వయంగా రూపొందించుకున్నానంటోందీ అందాల భామ. ‘ఫీనిక్స్ రైజింగ్’ అనే అమెరికన్‌ టీవీ సిరీస్‌ స్ఫూర్తితో ఈ స్విమ్‌సూట్‌ కేప్‌ను డిజైన్‌ చేశా. కష్టాల నుంచి బలంగా, తెలివిగా, మరింత శక్తిమంతంగా మారడమెలాగో ఈ కథలో మనం చూడచ్చు. ఈ మాటల్నే అందాల పోటీలలో ఆసాంతం గుర్తు పెట్టుకున్నా. అంతేకాదు.. ఈ కేప్‌ తయారీలో ప్లాస్టిక్‌ వస్తువుల్ని వాడాను. వృథా అంటూ పడేసే వస్తువులను కళాత్మకంగా ఎలా ఉపయోగించచ్చో నిరూపించాలనుకున్నా. ఇక జీవితంలో ఒడిదొడుకులనేవి సహజం. వాటిని తట్టుకోవడమా, వాటికి తలొగ్గడమా.. అనేది మన చేతుల్లోనే ఉంది. ఏ విషయంలోనైనా నేను మొదటి మార్గాన్నే ఎంచుకుంటా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.


ఆ గౌనుతో ఆకట్టుకుంది! 

విశ్వవేదికపై తాజాగా అందాల కిరీటం గెలిచిన గ్యాబ్రియెల్ మాత్రమే కాదు.. 2021లో విజేతగా నిలిచిన హర్నాజ్‌ సంధు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందాల పోటీ వేదికపై ర్యాంప్‌వాక్‌ చేస్తూ ఒకింత భావోద్వేగానికి లోనైన ఆమె.. ఆపై కిరీటాన్ని విజేతకు అలంకరించి మురిసిపోయింది. ఇక ఈ ఈవెంట్లో ఆమె ధరించిన గౌను అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ భారతీయ డిజైనర్‌ సాయేషా షిండే రూపొందించిన ఈ నలుపు రంగు గౌనుకు వెనుక వైపు.. గతంలో భారత్‌ నుంచి మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలిచిన సుస్మితా సేన్‌, లారా దత్తాల ఫొటోల్ని ముద్రించారు. ఇలా ఈ గౌనుతో ఓవైపు భారతీయతను చాటుతూనే.. మరోవైపు ఆ ఇద్దరికీ తనదైన రీతిలో సెల్యూట్‌ చెప్పిందీ మాజీ విశ్వసుందరి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్