వెజైనల్ డిశ్చార్జ్.. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవాలంటే..!

ఏ ఆరోగ్య సమస్యైనా తీవ్రమయ్యే దాకా దాన్ని పట్టించుకోం. ఈ లక్షణాలన్నీ సాధారణంగా ఎదురయ్యేవే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటాం. వెజైనల్‌ డిశ్చార్జి విషయంలోనూ చాలామంది మహిళలు ఇదే భావనతో ఉంటారు. కారణం.. సాధారణ డిశ్చార్జికి, అసాధారణ డిశ్చార్జికి తేడా తెలియకపోవడమే అంటున్నారు నిపుణులు.

Published : 18 Feb 2024 19:41 IST

ఏ ఆరోగ్య సమస్యైనా తీవ్రమయ్యే దాకా దాన్ని పట్టించుకోం. ఈ లక్షణాలన్నీ సాధారణంగా ఎదురయ్యేవే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటాం. వెజైనల్‌ డిశ్చార్జి విషయంలోనూ చాలామంది మహిళలు ఇదే భావనతో ఉంటారు. కారణం.. సాధారణ డిశ్చార్జికి, అసాధారణ డిశ్చార్జికి తేడా తెలియకపోవడమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అసాధారణ లక్షణాల్ని కూడా సాధారణంగానే భావిస్తే.. అది భవిష్యత్తులో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైనే తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. మరి, వెజైనల్‌ డిశ్చార్జ్‌ సాధారణమా?, అసాధారణమా?, ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉందా? తెలుసుకోవాలంటే.. ఇవి గుర్తుంచుకోండి!

సాధారణంగా మహిళల్లో అండం విడుదలయ్యే సమయంలో/నెలసరికి రెండు వారాల ముందు.. వెజైనల్‌ డిశ్చార్జ్‌ అవడం సహజమే. ఈక్రమంలో పారదర్శకంగా, పల్చగా ఉండే స్రావం విడుదలవడం గమనించచ్చు. పైగా ఎలాంటి దుర్వాసన లేకుండా, దానివల్ల దురద సమస్య తలెత్తకుండా ఉన్నంతవరకు దాన్ని సాధారణ డిశ్చార్జ్‌గానే పరిగణించచ్చంటున్నారు నిపుణులు. అలాకాకుండా కొన్ని లక్షణాలు గమనిస్తే మాత్రం అది ఇన్ఫెక్షన్‌కు సూచన కావచ్చంటున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే...

⚛ డిశ్చార్జ్‌ అయ్యే సమయంలో వ్యక్తిగత భాగాల వద్ద దురద రావడం..

⚛ పసుపు పచ్చ, గోధుమ, బూడిద, ఆకుపచ్చ.. వంటి రంగుల్లో, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్..

⚛ ఉన్నట్లుండి ఎక్కువ మొత్తంలో డిశ్చార్జ్‌ అయినా అసాధారణమే అని గుర్తించాలి..

⚛ కలయిక సమయంలో నొప్పి రావడం..

⚛ పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం..

⚛ వ్యక్తిగత భాగాలు మరింత సున్నితంగా మారడం.. తాకీతాకగానే నొప్పిగా అనిపించడం..

⚛ వ్యక్తిగత భాగాల్లో వాపు, బొబ్బలు, గమనించడం..

⚛ నెలసరిలో కాకుండా మధ్యమధ్యలో రక్తస్రావం/స్పాటింగ్‌ కావడం..

⚛ జ్వరం, నీరసం, ఉన్నట్లుండి బరువు తగ్గడం..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇన్ఫెక్షన్ల ముప్పు..

సాధారణ వెజైనల్‌ డిశ్చార్జ్‌కి శరీరంలోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయుల్లో మార్పులే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అయితే వ్యక్తిగత భాగాల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినడమే అసాధారణ వెజైనల్‌ డిశ్చార్జ్‌కి దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో కండోమ్స్‌, సెక్స్‌ టాయ్స్‌, ట్యాంపన్స్‌.. వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలెక్కువంటున్నారు. ఫలితంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అవేంటంటే..!

బ్యాక్టీరియల్‌ వెజైనోసిస్

లైంగిక చర్య ద్వారా ఈ తరహా ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. ఈక్రమంలో దుర్వాసనతో కూడిన బూడిద రంగు చిక్కటి ద్రవ పదార్థం వ్యక్తిగత భాగాల నుంచి బయటికి వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ఉన్నా ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చంటున్నారు నిపుణులు.

ట్రైకోమొనియాసిస్

లైంగిక చర్య ద్వారా సోకే ఈ ఇన్ఫెక్షన్‌.. భాగస్వామి వాడిన టవల్స్, బాత్‌రూమ్‌, ఇతరత్రా వస్తువులు వాడినా వచ్చే ప్రమాదం ఉందట! ఈ ఇన్ఫెక్షన్‌ ఉన్న సగం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని.. ఒకవేళ కనిపించినా.. దుర్వాసనతో కూడిన ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులో వెజైనల్‌ డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే మూత్ర విసర్జన చేసే సమయంలో, కలయిక సమయంలో దురద రావడం.. ఈ తరహా ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా చెబుతున్నారు నిపుణులు.

ఈస్ట్‌ ఇన్ఫెక్షన్

కొంతమందిలో జున్ను లాంటి తెలుపు రంగు పదార్థం వెలువడుతుంటుంది. దీన్ని ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పరిగణించచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల వ్యక్తిగత భాగాల్లో దురద, మంటతో పాటు కలయిక తర్వాత ఆయా భాగాల్లో వాపు కూడా గమనించచ్చు. ఇక ఒత్తిడి, మధుమేహం, గర్భనిరోధక మాత్రలు వాడడం, గర్భిణిగా ఉన్నప్పుడు, పది రోజులకు పైగా యాంటీబయాటిక్స్‌ ఉపయోగించడం.. వంటి సమయాల్లో ఇన్ఫెక్షన్‌ ఎక్కువవుతుందంటున్నారు.

పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్

కలయిక తర్వాత-నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్‌ కనిపిస్తే.. ఈ తరహా ఇన్ఫెక్షన్‌కు సూచన అంటున్నారు నిపుణులు. ఇది క్రమంగా ఇతర ప్రత్యుత్పత్తి అవయవాలకు విస్తరిస్తే గనేరియా వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని.. అలాంటప్పుడు చికిత్స కూడా కష్టతరమవుతుందని చెబుతున్నారు.
వీటితో పాటు ఈ తరహా వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు సర్వైకల్‌ క్యాన్సర్‌, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌, జెనిటల్ హెర్పిస్.. వంటి ఇతర సమస్యలకూ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అందుకే వెజైనల్‌ డిశ్చార్జ్‌కు సంబంధించిన అసాధారణ లక్షణాల్ని గుర్తించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సమస్య వచ్చాక చికిత్స తీసుకునే కంటే.. రాకుండా ముందు జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వెజైనల్‌ డిశ్చార్జ్.. తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవాలంటే వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం అంటున్నారు.

⚛ వ్యక్తిగత భాగాల్లో సువాసనతో కూడిన సబ్బులు, లోషన్లు, వైప్స్‌, జెల్స్‌.. వంటివి ఉపయోగించకూడదు. వీటిలోని రసాయనాలు అక్కడి పరిశుభ్రతను దెబ్బతీస్తాయి. బ్యాక్టీరియా బ్యాలన్స్‌ అదుపు తప్పేలా చేస్తాయి.

⚛ వెజైనాను శుభ్రం చేసుకునే క్రమంలో ముందు నుంచి వెనక్కి క్లీన్‌ చేసుకుంటే ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు.

⚛ నెలసరి సమయంలో బ్లీడింగ్‌ని బట్టి శ్యానిటరీ ప్యాడ్స్‌-ట్యాంపన్స్ వంటివి మార్చుకోవడం మర్చిపోవద్దు. అలాగే మెన్‌స్ట్రువల్‌ కప్ ఉపయోగించే వారు నిర్ణీత వ్యవధుల్లో దాన్ని శుభ్రం చేసుకొని తిరిగి అమర్చుకోవాలి.

⚛ వ్యక్తిగత భాగాలకూ గాలి తగిలేలా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో ధరించే లోదుస్తులు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి.

⚛ చెమట పట్టిన దుస్తులు ఎక్కువసేపు అలాగే ఉంచుకున్నా ప్రమాదమే! కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడడం ముఖ్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్