ఆరుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు స్పీకర్‌!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఇటీవలే పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు అమల్లోకి వచ్చేది మాత్రం 2029 తర్వాతేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Published : 23 Sep 2023 18:57 IST

(Photos: Facebook)

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఇటీవలే పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు అమల్లోకి వచ్చేది మాత్రం 2029 తర్వాతేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ రిజర్వేషన్‌ బిల్లుతో సంబంధం లేకుండా 2019లోనే ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ (బిజద) పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లను కేటాయించింది. తాజాగా అదే పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రమీల మల్లిక్‌ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తద్వారా ఆ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటి మహిళా స్పీకర్‌గా ఘనత సాధించారు ప్రమీల.

ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించిన బిక్రమ్‌ కేశారీ అరుఖ మే నెలలో మంత్రివర్గంలో చేరారు. దాంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడింది. దీనికి బిజద పార్టీ సీనియర్‌ నాయకురాలైన ప్రమీల మల్లిక్‌ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆమె ఎన్నికను ఇన్‌ఛార్జ్‌ స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ ధృవీకరించారు. దాంతో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే మొదటి మహిళా స్పీకర్‌గా ఆమె ఘనత సాధించారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా...

ప్రమీల మల్లిక్‌ ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోనే సీనియర్‌ ఎమ్మెల్యే. ఆమె ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 1990లో మొదటిసారి బింఝార్‌పుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అప్పుడు ఆమె జనతాదళ్‌ పార్టీ నుంచి పోటీ చేయడం గమనార్హం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బిజద పార్టీలో చేరిన ఆమె.. అదే నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మంత్రిగానూ...

ప్రమీల మల్లిక్‌ నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంలో మంత్రిగా పలు కీలక పదవులు చేపట్టారు. ఆమె మొదటిసారి 2004 సంవత్సరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో ఆమె దాదాపు 8 ఏళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా మూడు సంవత్సరాలు పనిచేశారు. 2019లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతోన్న ప్రమీల.. తాజాగా స్పీకర్‌గా నామినేషన్‌ వేయడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.

స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ప్రమీల మాట్లాడుతూ.. ‘స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు. ఆయన మహిళా సాధికారత విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి.. అసెంబ్లీ గౌరవం, ఔన్నత్యం పెంచుతాను’ అని వాగ్దానం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్