అమెరికా ఆర్థిక రంగంలో.. మన మహిళల హవా!

సాధారణంగా మహిళలు ఆర్థిక విషయాలకు ఆమడ దూరంలో ఉంటారని చెబుతుంటారు. ఇంటిని చక్కదిద్దే వారికి డబ్బు నిర్వహణ తెలియదనుకుంటారు. కానీ ఇవన్నీ అపోహలేనని తమ విజయాలతో కొట్టిపారేస్తున్నారు కొందరు మహిళలు. ఏకంగా ఆర్థిక రంగాన్నే తమ కెరీర్‌గా ఎంచుకొని....

Published : 07 Apr 2023 13:02 IST

(Photos: LinkedIn)

సాధారణంగా మహిళలు ఆర్థిక విషయాలకు ఆమడ దూరంలో ఉంటారని చెబుతుంటారు. ఇంటిని చక్కదిద్దే వారికి డబ్బు నిర్వహణ తెలియదనుకుంటారు. కానీ ఇవన్నీ అపోహలేనని తమ విజయాలతో కొట్టిపారేస్తున్నారు కొందరు మహిళలు. ఏకంగా ఆర్థిక రంగాన్నే తమ కెరీర్‌గా ఎంచుకొని దూసుకుపోతున్నారు. అది కూడా అమెరికా వంటి అగ్రరాజ్యంలో! అమెరికా ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా మారిన అలాంటి వందమంది మహిళామణుల్ని ఎంపిక చేసి ‘అత్యంత ప్రభావశీలురైన మహిళల’ జాబితాను తాజాగా విడుదల చేసింది బ్యారన్స్ పత్రిక. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు అనుబంధ సంస్థ అయిన ఈ పత్రిక ప్రకటించిన లిస్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. మరి, వాళ్లెవరు? అమెరికా ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రేంటి? తెలుసుకుందాం రండి..

విభిన్న రంగాల్లో విశేష కృషి చేస్తోన్న మహిళల ప్రతిభను గుర్తించి.. ఆయా సంస్థలు/పత్రికలు ఏటా పలు జాబితాలు విడుదల చేస్తుంటాయి. వాటిలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనుబంధ సంస్థ అయిన బ్యారన్స్ కూడా ఒకటి. అమెరికా ఆర్థిక రంగం, కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న మహిళల జాబితాను ఏటా విడుదల చేస్తుంటుందీ మీడియా సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘అమెరికా ఆర్థిక రంగంలో వందమంది అత్యంత ప్రభావశీలురైన మహిళల’ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన దేశానికి చెందిన ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు.


అను అయ్యంగార్, గ్లోబల్‌ హెడ్ (విలీనాలు, కొనుగోళ్లు)- జేపీ మోర్గాన్

భారత్‌లో పుట్టిపెరిగిన అను.. మన్‌హట్టన్‌లో స్థిరపడ్డారు. గణిత సమీకరణాలు, ఆర్థిక విషయాలంటే ఆమెకు చిన్నవయసు నుంచే మక్కువ. ఈ ఇష్టంతోనే ఎకనామిక్స్‌-కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో యూజీ పూర్తిచేసిన ఆమె.. మసాచుసెట్స్‌లోని స్మిత్‌ కళాశాలలో లిబరల్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆపై ఎంబీఏ పూర్తి చేశారు. ‘అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్’ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. 1999లో ‘వాల్‌స్ట్రీట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌’లో ఓ పోస్టు కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అయితే ఆ సమయంలో జాతి-లింగ వివక్షకు గురయ్యారు అను. అయినా వెనకడుగు వేయకుండా తన ప్రతిభతోనే ఈ విమర్శలకు సమాధానం చెప్పాలనుకున్నారు. ఆ పట్టుదలే ఆమెను ‘జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌ కో’ సంస్థలో చేరేలా చేసింది. 2020 నుంచి ఈ సంస్థకు చెందిన ‘విలీనాలు, కొనుగోళ్ల (ఎంఏ)’ విభాగానికి కో-హెడ్‌గా ఉన్న ఆమె.. ఈ ఏడాది జనవరిలో గ్లోబల్‌ హెడ్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ‘ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌’ మహిళా నెట్‌వర్క్‌ వింగ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉన్న అను.. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఆర్థిక అంశాల్లో మహిళలకు మార్గనిర్దేశనం చేయడం, వారిని వృత్తిపరంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. భారతీయ శాస్త్రీయ నృత్యంతో తన ఒత్తిళ్లను అధిగమిస్తానంటోన్న అను.. మంచి వక్త కూడా! ఈ క్రమంలో మహిళలు-ఆర్థిక రంగాల్లో వారి పాత్ర వంటి అంశాలపై ప్రసంగిస్తుంటారు. తన ప్రతిభకు గుర్తింపుగా ‘ఇంపాక్ట్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’ అందుకున్న ఆమె.. గతంలో వాల్‌స్ట్రీట్‌, ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాల్లోనూ చోటు దక్కించుకున్నారు.


రూపాల్‌ జె. భన్సాలీ, ఏరియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీఐవో

ప్రతి ఒక్కరి పుట్టుకకు ఓ అర్థం, పరమార్థం ఉన్నట్లే.. డబ్బు నిర్వహణ కోసమే తాను పుట్టానని చెబుతారు రూపాల్‌. భారత సంతతికి చెందిన ఆమె.. ముంబయి యూనివర్సిటీలో ‘కామర్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ అండ్ బ్యాంకింగ్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేశారు. ఆపై రోచెస్టర్‌ యూనివర్సిటీలో ఫైనాన్స్‌ విభాగంలో ఎంబీఏ చేసిన రూపాల్‌.. ‘రోటరీ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌’ గ్రహీత కూడా! చదువు పూర్తయ్యాక పలు ఆర్థిక రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె.. 2011 నుంచి ‘ఏరియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ’లో ఛీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌-పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మల్టీ బిలియన్‌ డాలర్‌ పోర్ట్‌ఫోలియోలు రూపొందించారామె. ‘100 విమెన్‌ ఇన్‌ ఫైనాన్స్’ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతోన్న రూపాల్‌.. ఆర్థిక రంగంలో మహిళల్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమంటారు.


సోనల్‌ దేశాయ్, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సీఐఓ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్

భారత సంతతికి చెందిన మరో ఆర్థికవేత్త డాక్టర్‌ సోనల్‌ దేశాయ్‌.. ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌’కు ఛీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిసున్నారు. 2018లో ఈ బాధ్యతలందుకున్న ఆమె.. ఈ సంస్థకు తొలి మహిళా సీఐఓగా చరిత్ర సృష్టించారు. గతంలో ఐఎంఎఫ్‌తో పాటు పలు ఆర్థిక రంగ సంస్థల్లో పనిచేసి అనుభవం గడించిన సోనల్‌.. ప్రస్తుతం ఫ్రాంక్లిన్‌ సంస్థకు చెందిన మున్సిపల్‌, కార్పొరేట్‌ క్రెడిట్, మల్టీ సెక్టార్‌.. తదితర బృందాలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. సంస్థ పెట్టుబడులకు సంబంధించి పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గానూ వ్యవహరిస్తున్నారామె. ఈ క్రమంలో సోనల్‌ ప్రస్తుతం సంస్థకు చెందిన 137 బిలియన్‌ డాలర్ల ఆస్తుల్ని పర్యవేక్షిస్తున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తిచేసిన సోనల్‌.. నార్త్‌వెస్ట్‌ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.


మీనా లక్డావాలా ఫ్లిన్‌, గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్

‘గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్‌’కు చెందిన గ్లోబల్‌ ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి కో-హెడ్‌గా, భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు మీనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ సలహాదారులు, కంటెంట్‌ నిపుణులు ఆమె పర్యవేక్షణలోనే పనిచేస్తున్నారు. 1999లో జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ మరుసటి ఏడాదే గోల్డ్‌మన్ శాక్స్కు మారారు.

‘కాలేజీలో చేరిన తొలినాళ్లలో నా లక్ష్యమేంటో నాకే స్పష్టత లేదు. అందుకే మా అన్నయ్య అడుగుజాడల్లోనే నడిచాను. ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక జేపీ మోర్గాన్‌లో చేరాను. ఆపై గోల్డ్‌మన్ శాక్స్కు చెందిన ‘ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’లో అనలిస్ట్‌గా అవకాశమొచ్చింది. సుదీర్ఘ కాలం పాటు ఈ హోదాలో కొనసాగిన నేను.. ఆపై ప్రొడ్యూసింగ్ మేనేజర్‌గా బాధ్యతలందుకున్నా. నా కెరీర్‌లో ఇదో కీలక మలుపు..’ అంటారు మీనా. ప్రస్తుతం తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూయార్క్‌లో నివసిస్తున్నారామె.


సవితా సుబ్రమణియన్, యూఎస్‌ ఈక్విటీ-క్వాంటిటేటివ్‌ స్ట్రాటజీ హెడ్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా

న్యూయార్క్‌లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన సవిత.. ప్రస్తుతం ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’కు చెందిన ‘యూఎస్‌ ఈక్విటీ - క్వాంటిటేటివ్‌ స్ట్రాటజీ’కి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీల కోసం యూఎస్‌ సెక్టార్‌ కేటాయింపులను సిఫార్సు చేయడం, స్టాక్‌మార్కెట్ల కోసం అంచనాలను నిర్ణయించడం.. వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారామె. ఈ సంస్థలో చేరకముందు పలు ఆర్థిక రంగ సంస్థల్లో విశ్లేషకురాలిగా పనిచేసిన సవిత.. ఆర్థిక అంశాలపై ఆయా వేదికలు, టీవీ కార్యక్రమాల్లో ప్రసంగిస్తుంటారు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ‘మ్యాథమెటిక్స్‌ - ఫిలాసఫీ (ఆనర్స్‌)’లో డబుల్‌ మేజర్‌ డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ప్రధాన సబ్జెక్టుగా ఎంబీఏ చేశారు. ‘కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థుల సంఘం’లో క్రియాశీల సభ్యురాలిగానూ ఉన్నారు సవిత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్