వేధించే దగ్గు, జలుబు.. ఉపశమనం ఇలా..!

చలికాలం ప్రారంభంలో సాధారణంగా కనిపించే సమస్యలు... మెల్లమెల్లగా తీవ్రమయ్యే ప్రమాదముంది. దీంతో వివిధ అలర్జీలతో సహా జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరచుగా వేధిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పదార్ధాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ అనారోగ్యాలను....

Published : 15 Nov 2022 20:36 IST

చలికాలం ప్రారంభంలో సాధారణంగా కనిపించే సమస్యలు... మెల్లమెల్లగా తీవ్రమయ్యే ప్రమాదముంది. దీంతో వివిధ అలర్జీలతో సహా జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరచుగా వేధిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పదార్ధాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ అనారోగ్యాలను సాధ్యమైనంతవరకు అరికట్టవచ్చని, త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పదార్ధాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

వెల్లుల్లి

వెల్లుల్లి అంటేనే చాలామంది మొహం చిట్లించుకుంటారు. అందుకు దీని వాసనే ప్రధాన కారణం. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి సమస్యలతో పోరాడడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. రోజుకో వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకొని నమిలితే దాన్నుంచి అలిసిన్‌ అనే రసాయన పదార్థం విడుదలవుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

అల్లం

జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంచెం అల్లం టీ తాగమని మన పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. వారు చెప్పినట్టే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం కొన్ని అల్లం ముక్కలు తీసుకుని నీటిలో లేదా పాలలో కలపండి. తర్వాత దాన్ని బాగా మరిగించి తాగండి.

సూప్స్

సూప్స్‌లోని ఎలక్ట్రొలైట్స్ ఆకలిని పెంచడమే కాదు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఎంతో సహకరిస్తాయి. ప్రత్యేకించి వెజిటబుల్, చికెన్‌ సూప్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వేడిగా తీసుకోవడం వల్ల ముక్కు, గొంతు, ఛాతీలో ఆవిరి ప్రవేశించి జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. హాట్‌ సూప్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

నిమ్మరసం

లెమన్‌లో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తుంది. జలుబు ఎక్కువగా ఉండి ముక్కు కారుతున్నప్పుడు వేడివేడిగా లెమన్‌ టీ కానీ, తాజా నిమ్మరసం కానీ తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. శరీరంలోని ఎలక్ట్రొలైట్స్‌ను సమతులం చేసి, బాడీ డీహైడ్రేట్ కాకుండా నివారిస్తుంది.

తేనె

మన శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయడానికి తేనె ఓ నేచురల్‌ యాంటీ బయాటిక్‌లా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దగ్గు, సాధారణ జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు... రోజూ ఉదయాన్నే కొంచెం నీళ్లలో ఒక టీస్పూన్‌ తేనెను కలుపుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. త్వరగా శక్తిని అందించడమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుంది. శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఇక తేనెను అల్లం రసంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

పసుపు

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలిపి తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. ఈ చిట్కా పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పసుపులో అధికంగా ఉంటాయి. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

తులసి ఆకులు

తులసి ఆకులు యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహకరిస్తాయి. అందుకే దగ్గు, జలుబు నుంచి త్వరగా కోలుకోవాలంటే తులసి ఆకులే మేలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇది సులువుగా దొరుకుతుంది.

మిరియాలు

దగ్గు, జలుబు వచ్చినప్పుడు చాలామందికి ఒళ్లు నొప్పులు, తుమ్ములు, ముక్కు కారడం లాంటి సమస్యలు అధికంగా వేధిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మిరియాల కషాయం ఎంతో మంచిది. అలాగే మిర్చిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ క్రమంలో- ఎండు మిరపకాయల పొడిని (డ్రై చిల్లీ పెప్పర్ ఫ్లేక్స్) వివిధ ఆహార పదార్ధాలతో పాటు కలిపి తీసుకోవచ్చు. ఇందులో కాప్సైసిన్ అనే పదార్థంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు కారణంగా ఎదురయ్యే ఒళ్లు నొప్పులు, తుమ్ములు, ముక్కు కారడం లాంటి సమస్యలను వెంటనే తగ్గించేస్తాయి.

వాము

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగించడానికి వాము ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతారు. నీటిలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. దీనిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితముంటుంది. వీటితో పాటు తృణధాన్యాలు, నట్స్‌, కోడిగుడ్లు, లవంగాలను తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్