గుండెకు కొండంత అండ!

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొంటూ సంరక్షించుకోవాలి. నేడు 'వరల్డ్ హార్ట్ డే'. ఈ నేపథ్యంలో- గుండెను సంరక్షించుకోవడం....

Published : 29 Sep 2022 16:28 IST

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొంటూ సంరక్షించుకోవాలి. నేడు 'వరల్డ్ హార్ట్ డే'. ఈ నేపథ్యంలో- గుండెను సంరక్షించుకోవడం కోసం మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిన కొన్ని పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఈ పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.

కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి నుంచి కేవలం పీచుపదార్థాలే కాకుండా గుండె సంరక్షణకు ఎంతగానో అవసరమైన విటమిన్ 'ఇ' కూడా లభిస్తుంది.

శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోయిందా? దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండే టమాటాలు తినండి. ఇది గుండె చుట్టు పక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యపరంగా లాభాలు చాలానే ఉన్నాయి. వాటిలో గుండె ఆరోగ్యం కూడా ఒకటని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి కనీసం రోజుకి ఒక్క బైట్‌ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకోండి. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడండి.

మీకు గ్రీన్ టీ తాగే అలవాటుందా? లేదంటే వెంటనే అలవాటు చేసుకోండి. ఎందుకంటే రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.

గుండె సంరక్షణకు యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరమని మనకు తెలుసు. మరి ఇవన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించాలంటే ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఓట్స్ మనం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దీనివల్ల గుండె సురక్షితంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. మరింకేంటి.. రోజూ పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవడం మరచిపోకండి.

బంగాళాదుంపల కూర ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు కదా! ఈ దుంపలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఒక్క విషయం.. దీనిని డీప్ ఫ్రై చేసుకొని తినకూడదు. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

బఠాణీ, పప్పులు, కాయధాన్యాలు.. వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని వారానికి కనీసం నాలుగుసార్లు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20 శాతానికి పైగా తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

రోజూ మీకు కాఫీ తాగే అలవాటుందా? అయితే మంచిదే. ఎందుకంటే రోజూ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం దాదాపు 15 శాతం తగ్గుతుందంటున్నారు నిపుణులు. అయితే అది కూడా మితంగానే.. రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు..!

సోయా పాలకు గుండెను సురక్షితంగా ఉంచేలా చేసే గుణం ఉంది. దీనికి కారణం ఈ పాలల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం, ప్రొటీన్లు.. మొదలైనవి. ఇవి శరీరంలో ఉండే అనవసర కొవ్వును తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్