పెళ్లి వేళ.. పాదాలూ అందంగా.. !

వివాహం.. జీవితంలో ఒకేసారి జరిగే వేడుక ఇది. అందుకే ఈ వేడుకలో నఖశిఖపర్యంతం అందంగా కనిపించాలని కాబోయే వధువులు ఆరాటపడుతుంటారు! ఈ క్రమంలో మోము విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో.. పాదాల్నీ అంతే సున్నితంగా, అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

Published : 27 Feb 2024 12:55 IST

వివాహం.. జీవితంలో ఒకేసారి జరిగే వేడుక ఇది. అందుకే ఈ వేడుకలో నఖశిఖపర్యంతం అందంగా కనిపించాలని కాబోయే వధువులు ఆరాటపడుతుంటారు! ఈ క్రమంలో మోము విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో.. పాదాల్నీ అంతే సున్నితంగా, అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా పెళ్లిలో పాదాలకు పెట్టుకొనే మెహెందీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి, మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ విషయంలో కొన్ని చిట్కాలు దృష్టిలో ఉంచుకుంటే పాదాల్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

తేమనందించండి..

కొంతమంది వధువులు ముఖం విషయంలో తీసుకున్న శ్రద్ధ పాదాల విషయంలో తీసుకోరు. ఫలితంగా అవి పొడిబారిపోయి పగులుతుంటాయి. ఇక పెళ్లి సమయం వచ్చేసరికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే మనం చర్మానికి ఎలాగైతే రోజూ మాయిశ్చరైజర్ రాసుకుంటామో.. అలాగే పాదాలకూ నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవాలి. తద్వారా వాటికి తేమ అంది మృదువుగా కనిపిస్తాయి. ఒకవేళ బయటదొరికే మాయిశ్చరైజర్ కాకుండా సహజసిద్ధమైనవి కావాలంటే.. కొబ్బరి నూనె, అవకాడో నూనె, తేనె, గోరువెచ్చటి నీళ్లు.. వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.

ఇంట్లోనే ఇలా..

కాబోయే వధువులు తమ పాదాలను మెరిపించుకోవడానికి పార్లర్లకు వెళ్లి పెడిక్యూర్, ఫుట్ మసాజ్.. వంటివి చేయించుకోవడం సహజం. అయితే ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే పదార్థాలతో పాదాలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయచ్చు. ఇందుకోసం ఒక టబ్బులో గోరువెచ్చని నీరు తీసుకొని అందులో కొన్ని గోళీలు (మార్బుల్స్), అరకప్పు ఎప్సం సాల్ట్, రెండు విటమిన్ ఇ క్యాప్స్యూల్స్, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ (రోజ్, లావెండర్.. ఏదైనా) వేయాలి. ఇప్పుడు ఇందులో పాదాలను ఉంచి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత పాదాలను ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు కదిలించాలి. ఫలితంగా నీటిలో ఉన్న మార్బుల్స్ వల్ల పాదాల్లోని కండరాలకు చక్కటి వ్యాయామం కలుగుతుంది. ఆపై పాదాలను నీటి నుంచి తొలగించి ఆరనివ్వాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అలసిన పాదాలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది.

కాసేపు నడవాలి..

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కొందరి పాదాలు నీరొచ్చినట్లుగా కనిపిస్తాయి. అంతేకాదు.. ఇలా లేవకుండా కూర్చొనే ఉండడం వల్ల పాదాలకు సరైన రక్తప్రసరణ సైతం జరగదు. కాబట్టి మధ్యమధ్యలో కాసేపు లేచి నడవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా పాదాలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అలాగని హీల్స్ వేసుకొని నడవడం, ఎక్కువ సమయం నిల్చోవడం కరక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల పాదాల్లో నొప్పులు రావడం, నడుం నొప్పి.. వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఫ్లాట్స్ వేసుకొని అదీకాదంటే పచ్చటి గడ్డిపై చెప్పుల్లేకుండా నడిచినా మంచి ఫలితం ఉంటుంది.

శుభ్రం చేయాల్సిందే..

చాలామంది ఆఫీసుకు టైమైపోతుందని ఆదరాబాదరాగా స్నానం ముగించేస్తుంటారు. దీంతో పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోలేకపోతారు. ఫలితంగా వాటిపై పడిన దుమ్ము, ధూళి, ఇతర కాలుష్య కారకాలు.. వాటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అలాగే పాదాలను పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి. కాబట్టి రోజూ స్నానం చేసేటప్పుడు, బయటికి వెళ్లొచ్చిన తర్వాత కాలి గోళ్లతో సహా పాదాలు, మడమలను బ్రష్ లేదంటే ప్యూమిస్ స్టోన్‌తో మృదువుగా రుద్దుకోవాలి. ఫలితంగా పాదాలు శుభ్రపడడంతో పాటు వాటిపై ఉన్న మృతకణాలు సైతం తొలగిపోతాయి. ఆ తర్వాత పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి..

ఇవి కూడా..

⚛ ఈమధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు డ్రస్సుకు తగ్గ నెయిల్ పాలిష్ వేసుకోవడంపై మక్కువ చూపుతున్నారు. దీనివల్ల రోజూ వేర్వేరు రంగు పాలిష్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా తరచూ నెయిల్ పెయింట్ వేసుకునేటప్పుడు అంతకుముందున్న పాలిష్ తొలగించిన వెంటనే కాకుండా కొన్ని గంటల సమయం గ్యాప్ ఇవ్వాలి. ఇది గోళ్ల ఆరోగ్యానికి మంచిది.

⚛ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మెత్తటి చెప్పులు వేసుకోవడం, రాత్రి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల వాటికి రిలాక్సేషన్ లభిస్తుంది.

⚛ మాయిశ్చరైజర్ రాసుకున్న వెంటనే సాక్సులు ధరించడం కాకుండా అది ఆరి, పూర్తిగా చర్మంలోకి ఇంకిన తర్వాత వేసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్