అందుకే వీళ్లను ‘టైమ్‌’ మెచ్చింది!

మనం ఎంచుకున్న మార్గం నలుగురికీ మార్గనిర్దేశనం చేసేలా ఉండాలంటారు. అలా తమ తమ రంగాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు నారీమణులు. ఏటా ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్రభావశీలురను గుర్తించి తమ జాబితాలో చోటిచ్చి గౌరవిస్తుంటుంది టైమ్‌ పత్రిక.

Updated : 19 Apr 2024 19:42 IST

(Photos: Instagram)

మనం ఎంచుకున్న మార్గం నలుగురికీ మార్గనిర్దేశనం చేసేలా ఉండాలంటారు. అలా తమ తమ రంగాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు నారీమణులు. ఏటా ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్రభావశీలురను గుర్తించి తమ జాబితాలో చోటిచ్చి గౌరవిస్తుంటుంది టైమ్‌ పత్రిక. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన ‘టైమ్స్‌ వంద మంది అత్యంత ప్రభావశీలుర’ జాబితాలో ఎనిమిది మంది భారతీయులకు చోటు దక్కింది. వారిలో నలుగురు మహిళలున్నారు. మరి, వాళ్లెవరు? వాళ్లు సాధించిన విజయాలేంటో తెలుసుకుందాం రండి..

నాకు నేనే పోటీ!

ఎంచుకున్న రంగంలో రాణించాలంటే అంకితభావం, పనితనం.. ఈ రెండూ ముఖ్యమే! అందాల తార ఆలియా భట్‌లో ఉన్న ఈ రెండు గుణాలే ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చాయంటున్నారు బ్రిటిష్‌ చిత్ర దర్శకుడు టామ్‌ హార్పర్‌. తాజాగా టైమ్స్‌ జాబితాలో చోటుదక్కించుకున్న నేపథ్యంలో ‘ఆలియా.. అసలు సిసలైన అంతర్జాతీయ స్టార్‌’ అంటూ ఆమెను కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రంతోనే ఆలియా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె గర్భవతి కూడా! బాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాలకు, మహిళా ప్రాధాన్య పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఆలియా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు దాటింది. 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇక వెనుదిరిగి చూడలేదు. ‘2 స్టేట్స్‌’, ‘బద్రీనాథ్‌ కీ దుల్హనియా’, ‘గల్లీ బాయ్‌’, ‘గంగూబాయి కథియావాడీ’, ‘బ్రహ్మాస్త్ర’.. వంటి హిట్‌ చిత్రాలతో మెప్పించిన ఆలియా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు ప్రేక్షకుల్నీ పలకరించింది. ప్రస్తుతం ‘జిగ్రా’ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ చక్కనమ్మ.. ‘గంగూబాయి కథియావాడీ’ చిత్రానికి ‘ఉత్తమ నటి’గా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

‘పోటీ అంటే నాకూ ఇష్టమే! కానీ ఇతరులతో కాదు.. నాతో నేనే పోటీ పడతా. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతా. ఇండస్ట్రీలో మనం ఎన్నాళ్లున్నామన్నది ముఖ్యం కాదు.. మన సినిమాలు, పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలనే నేనెప్పుడూ కోరుకుంటా. అలాగే నేనెప్పుడూ లక్ష్యాల్ని నిర్దేశించుకోను. నన్ను నేను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తా..’ అంటూ ఓ సందర్భంలో తన సక్సెస్‌ మంత్రాను పంచుకుంది ఆలియా. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న ఈ అందాల తార.. మరోవైపు వ్యాపారవేత్తగానూ తనను తాను నిరూపించుకుంటోంది. గత కొన్నేళ్లుగా ‘Ed-a-mamma’ అనే కిడ్స్‌ వేర్‌ బ్రాండ్‌ని నడుపుతోన్న ఆలియా.. ‘నైకా’, ‘ఫూల్‌.కో’ వంటి ప్రముఖ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టింది. 2022లో నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను ప్రేమ వివాహం చేసుకుందీ బాలీవుడ్‌ అందం. ప్రస్తుతం ఈ జంటకు ‘రాహా’ అనే కూతురుంది.


సాక్షి.. పోరాట స్ఫూర్తి!

2016 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక భారతీయ మహిళా రెజ్లర్‌గా కీర్తి గడించింది సాక్షి మలిక్‌. హరియాణా రోహ్‌తక్‌లోని మోఖ్రా అనే గ్రామంలో జన్మించిన సాక్షి.. మల్లయోధుడైన తన తాతయ్య సుబీర్‌ మలిక్‌ను చూసి చిన్న వయసులోనే స్ఫూర్తి పొందింది. తానూ తన తాతగారిలా రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంది. ఈ మక్కువతోనే 12 ఏళ్ల వయసులో శిక్షణ ప్రారంభించిన ఆమె.. ఈ క్రీడలో అమ్మాయిలెవరూ లేకపోయే సరికి తన ఊరి అబ్బాయిలతోనే కుస్తీ పట్టేది. తనలో ఉన్న పట్టుదలను గుర్తించిన కోచ్‌ తనకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదామె. 2009లో ‘ఆసియా జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌’లో రజత పతకంతో మొదలైన ఆమె మెడల్స్‌ వేట.. 2022లో జరిగిన ‘కామన్వెల్త్‌ పోటీల్లో’ స్వర్ణం నెగ్గే దాకా కొనసాగింది. ఈ క్రమంలో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ రజత, కాంస్య పతకాలతో సత్తా చాటిందామె. ‘రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఆయనకు వ్యతిరేకంగా గతేడాది జనవరిలో సాక్షి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సహచర రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, బజ్‌రంగ్‌ పునియాలతో కలిసి సాక్షి ఈ ఆందోళనను కొనసాగించింది. ఫలితంగా ప్రభుత్వం అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌ భూషణ్‌ను తప్పించింది. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆపై గతేడాది డిసెంబర్‌లో జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా గెలుపొందడంతో సాక్షి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటకు వీడ్కోలు పలికింది. ‘ఈ పోరాటం కేవలం భారత మహిళా రెజ్లర్ల కోసమే కాదు. ఎప్పటికప్పుడు అణచివేతకు గురవుతున్న భారత అమ్మాయిల కోసం..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిందామె. ఈ పోరాటస్ఫూర్తికి గుర్తింపుగానే తాజాగా టైమ్‌ పత్రిక విడుదల చేసిన జాబితాలో చోటుదక్కించుకుందీ మహిళా రెజ్లర్‌.


కృష్ణబిలాలపై పరిశోధనలు!

అంతరిక్షంలోని రహస్యాల్ని తెలుసుకోవాలన్న కల ఎంతోమందికి ఉంటుంది. కానీ ఈ దిశగా ప్రయత్నించే వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. ప్రియంవద నటరాజన్‌ ఇదే కోవకు చెందుతారు. కృష్ణబిలాల పుట్టుక, అవి వృద్ధి చెందే క్రమం, కాలక్రమేణా వాటి పరిసరాలపై అవి చూపే ప్రభావం.. వంటి అంశాలపై పరిశోధనలు చేశారామె. అలాగే పాలపుంత, విశ్వంతో అవి ఎలా ఇంటరాక్ట్‌ అవుతాయో అర్థం చేసుకోవడానికి వివిధ రకాల నమూనాల్ని అభివృద్ధి చేశారామె. కృష్ణబిలాల పరిణామ క్రమాన్ని ప్రాథమిక ప్రక్రియల ద్వారా తెలుసుకోవడం, వివిధ రకాల టూల్స్‌ ఉపయోగించి వాటి నుంచి మనం గ్రహించాల్సిన అంశాల్ని అంచనా వేయడంపై ప్రస్తుతం తన దృష్టి సారించారామె.

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ప్రియంవద.. దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి భౌతిక శాస్త్రం, గణితంలో యూజీ పూర్తిచేసిన ఆమె.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఈ సమయంలోనే ప్రతిష్టాత్మక ఐజాక్‌ న్యూటన్‌ ఫెలోషిప్‌ గెలుచుకున్నారు. ప్రస్తుతం యూఎస్‌ కనెక్టికట్‌లోని యేల్‌ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ, ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారీ మహిళా శాస్త్రవేత్త. ఇదే విశ్వవిద్యాలయంలో ‘ఆస్ట్రానమీ’ విభాగానికి హెడ్‌గా కొనసాగుతోన్న ఆమె.. ‘విమెన్‌ ఫ్యాకల్టీ ఫోరమ్‌’కి ఛైర్‌పర్సన్‌గానూ ఉన్నారు. అంతరిక్ష రంగంలో ఆమె సాగిస్తోన్న పరిశోధనలు, చేస్తోన్న సేవలకు గుర్తింపుగా 2022లో ‘జీనియస్‌ అవార్డు’ గెలుచుకున్న ప్రియంవద.. పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఫెలోషిప్‌లూ అందుకున్నారు. తాజాగా టైమ్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రభావశీలుర జాబితా’లో చోటు దక్కించుకున్న ఈ మహిళా సైంటిస్ట్‌ రచయిత్రి కూడా! ఈ క్రమంలోనే ‘2016లో ‘Mapping the Heavens: The Radical Scientific Ideas that Reveal the Cosmos’ అనే పుస్తకం రాశారామె.


బ్రిటన్‌లో భారతీయ రుచులు!

ఒక్కోసారి సరదాగా మనం ప్రారంభించిన వ్యాపకమే మన కెరీర్‌గా మారుతుంది. ప్రముఖ చెఫ్‌ ఆస్మా ఖాన్‌ విషయంలోనూ ఇదే జరిగింది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఆమె.. పెళ్లయ్యాక ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో భారతీయ వంటకాల్ని, ఇంటి రుచుల్ని బాగా మిస్సయ్యేవారామె. ఈ క్రమంలోనే కేంబ్రిడ్జిలో ఉన్న తన ఆంటీ వద్ద నుంచి పాకశాస్త్ర మెలకువలు నేర్చుకున్న ఆమె.. ఆపై వంటల్నే తన అభిరుచిగా మార్చుకున్నారు. ఇదే సమయంలో న్యాయ విద్యలో డాక్టరేట్‌ పట్టా అందుకున్న ఆస్మా.. యూకేలో నివసించే తన స్నేహితులకు భారతదేశపు రుచుల్ని పరిచయం చేయడానికి ప్రత్యేక సప్పర్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేసేవారు. ఇవే క్రమంగా ఆమె పాపులారిటీని పెంచాయి. ప్రముఖ చెఫ్‌ వివేక్‌ సింగ్‌ దృష్టిని ఆకర్షించాయి. ఆయన పిలుపు మేరకు ఓసారి వివేక్‌ సింగ్‌ రెస్టరంట్‌ ‘సిన్నమన్‌ క్లబ్‌’ను సందర్శించిన ఆస్మా.. తానూ ఓ రెస్టరంట్‌ని ప్రారంభించాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే సోహో నగరంలో ‘డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ఓ రెస్టరంట్‌ తెరిచారు. యూకేలో స్థిరపడిన భారతీయులకు దేశీ రుచుల్ని అందించడం ఈ రెస్టరంట్‌ ప్రత్యేకత.

‘ఒకానొక సమయంలో నాకు వంటే రాదు.. అలాంటిది ఓ రెస్టరంట్‌ వ్యాపారం ప్రారంభిస్తానని, ఆతిథ్య రంగంలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు..’ అంటున్నారు ఆస్మా.. ప్రస్తుతం ఈ రెస్టరంట్‌లో పనిచేసే వారంతా మహిళలే! అది కూడా ఇంటి బాధ్యతలు, కెరీర్‌ బాధ్యతలు పూర్తిచేసుకొని ఖాళీగా ఉన్న 50 ఏళ్ల పైబడిన మహిళలకు తన కిచెన్‌లో పనిచేసే అవకాశమిచ్చారామె. 2018లో ‘ఆస్మాస్‌ ఇండియన్‌ కిచెన్‌’ పేరుతో ఓ వంటల పుస్తకాన్ని రాసిన ఈ పాపులర్‌ చెఫ్‌.. ‘సెకెండ్‌ డాటర్స్‌ ఫండ్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ వేదికగా భారత్‌లోని పేద అమ్మాయిలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన ఆడపిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారామె. ఓవైపు తన వ్యాపారంతో మహిళలకు ఉపాధి కల్పిస్తూనే.. మరోవైపు సమాజ సేవకూ పాటుపడుతోన్న ఆస్మా ఈ ఏడాది టైమ్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలోనూ చోటుదక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్