పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?

వృత్తి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేసుకునే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు తక్షణమే తయారుచేసుకొని తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడుతుంటారు. వీటిలో పండ్ల రసాలు ఒకటి. చిటికెలో సిద్ధం చేసుకొనే వీటిని పరగడుపునే తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటారు.

Published : 04 May 2024 12:18 IST

వృత్తి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తయారుచేసుకునే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు తక్షణమే తయారుచేసుకొని తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడుతుంటారు. వీటిలో పండ్ల రసాలు ఒకటి. చిటికెలో సిద్ధం చేసుకొనే వీటిని పరగడుపునే తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. పరగడుపునే పండ్ల రసాలు తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ఇంతకీ అవేంటి? పండ్ల రసాలు తాగడానికి సరైన సమయమేది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

మధుమేహ ముప్పు!

పండ్లలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. అయితే వీటిని రసాలుగా మార్చినప్పుడు ఈ పీచు పదార్థం లోపిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీనికి తోడు పండ్లలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఇక రసాలు తయారుచేసే క్రమంలో తియ్యదనం కోసం అదనంగా చక్కెర కలుపుతుంటాం. తద్వారా జ్యూసుల్లో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. వీటిని పరగడుపునే తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులు మరింతగా పెరుగుతాయని, ఈ అలవాటు దీర్ఘకాలంలో మధుమేహ ముప్పును తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకోకపోవడం మంచిది.

ఎనామిల్‌ తొలగిపోతుంది!

పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకోవడం వల్ల దంతాల పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటిలోని ఆమ్లత్వం దంతాలపై ఉండే ఎనామిల్‌ పొరను తొలగిస్తుంది. తద్వారా దంత క్షయం, చిగుళ్లు-పళ్లలో సున్నితత్వం ఏర్పడుతుంది. దీంతో తీసుకునే ఆహారం కాస్త చల్లగా, కాస్త వేడిగా ఉన్నా దంతాలు తట్టుకోలేవు. అందుకే పరగడుపునే పండ్ల రసం వద్దంటున్నారు నిపుణులు.

జీర్ణ సమస్యలు!

ద్రాక్ష, దానిమ్మ, బ్లూబెర్రీ, పైనాపిల్‌.. వంటి పండ్లలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని జ్యూసులుగా తయారుచేసుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల వీటిలోని ఆమ్లత్వం జీర్ణాశయ గోడల్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక ఫైబర్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అయితే జ్యూసుల్లో ఇది లోపిస్తుంది. కాబట్టి అరుగుదల నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపునొప్పి, కడుపులో మంట.. తదితర సమస్యలు తలెత్తచ్చు. అందుకే పరగడుపున పండ్ల రసాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఆహారపు కోరికలు!

పరగడుపునే పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒకేసారి పెరిగిపోవడం, ఆపై కాసేపటికి అమాంతం పడిపోవడం జరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ తక్షణ హెచ్చుతగ్గుల కారణంగా శరీరంలో శక్తి క్షీణించి అలసట దరిచేరుతుంది. ఈ శక్తిని తిరిగి భర్తీ చేసుకోవడానికి శరీరం క్యాలరీలున్న ఆహారాన్ని కోరుకుంటుంది. అలాగని వీటిని తీసుకుంటే బరువు పెరుగుతాం.. పైగా ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. కాబట్టి ఈ ఆహారపు కోరికలకు కళ్లెం వేయాలంటే పరగడుపునే పండ్ల రసాలు తాగకూడదంటున్నారు నిపుణులు.

భోజనంతో పాటు..!

పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకొని వివిధ రకాల అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవడం కంటే.. మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా పలు ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు.

⚛ భోజనంతో పాటే పండ్ల రసాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే ఆకలినీ నియంత్రించుకోవచ్చు.

⚛ భోజనానికి పది నిమిషాల ముందు గ్లాసు పండ్ల రసం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అన్నం తక్కువగా తినచ్చు.. తద్వారా బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు.

⚛ పండ్ల రసాలు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని శరీరం త్వరగా గ్రహించేందుకు దోహదం చేస్తాయట! అలాగే వీటి నుంచి పలు పోషకాలూ శరీరానికి అందుతాయి. తద్వారా పోషకాహార లోపం తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

⚛ అటు ఆహారం తీసుకుంటూ, ఇటు మధ్యమధ్యలో జ్యూస్‌ సిప్‌ చేస్తుంటే.. మనసుకు ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం కలుగుతాయి. ఇలా ఆహారపు రుచిని ఆస్వాదించడం ఆరోగ్యానికీ మంచిదంటున్నారు నిపుణులు.


ప్రత్యామ్నాయంగా ఇవి!

పరగడుపునే పండ్ల రసాలకు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

⚛ పండ్ల రసాలకు బదులుగా నేరుగా పండ్లనే తీసుకోవడం వల్ల అందులోని పీచు శరీరానికి అందుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా, శరీరం శక్తిని కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ పండ్లను పాలు, పెరుగుతో కలిపి స్మూతీస్‌లా తయారుచేసుకొని తాగడమూ ఆరోగ్యకరమేనట! వీటి ద్వారా ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయట!

⚛ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని, కాస్త తేనె కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

వీటితో పాటు అల్పాహారం మానకుండా ఉన్నప్పుడే శరీరం శక్తిని కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.. ఇదే రోజంతటికీ కావాల్సిన శక్తినిస్తుందన్న విషయం మర్చిపోకండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్