వాళ్లెక్కడున్నా మమ్మల్ని చూసి గర్వపడతారు!

ఓవైపు అమ్మతనం, మరోవైపు భర్త ఆశయం.. ఈ రెండింట్లో దేన్నీ వదులుకోవడానికి ఇష్టపడలేదు ఈ ఇద్దరు ధీరలు. దేశ సేవలో వీరమరణం పొందిన తమ భర్త బాధ్యతల్ని నెరవేర్చేందుకు ముందుకొచ్చిన వీరు.. ఇండియన్‌ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో.....

Published : 01 Nov 2022 18:23 IST

ఓవైపు అమ్మతనం, మరోవైపు భర్త ఆశయం.. ఈ రెండింట్లో దేన్నీ వదులుకోవడానికి ఇష్టపడలేదు ఈ ఇద్దరు ధీరలు. దేశ సేవలో వీరమరణం పొందిన తమ భర్త బాధ్యతల్ని నెరవేర్చేందుకు ముందుకొచ్చిన వీరు.. ఇండియన్‌ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో 11 నెలల కఠిన శిక్షణను పూర్తి చేసుకున్నారు. పరేడ్‌ ముగిశాక తమ పిల్లల్ని గుండెలకు హత్తుకొని ఎమోషనల్‌ అయిన ఈ ఇద్దరు తల్లులు.. ‘నా నిర్ణయం, పట్టుదల చూసి ఆయనెక్కడున్నా గర్వపడతారు..’ అంటూ ఉప్పొంగిపోతున్నారు. వాళ్లే లద్దాఖ్‌కు చెందిన లెఫ్టినెంట్‌ రిగ్జిన్‌ కొరోల్‌, పంజాబ్‌కు చెందిన హర్వీన్‌ కౌర్.

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు వీర సైనికులు. వీరిని కట్టుకున్న భార్యలు కూడా అంతే ధైర్యసాహసాల్ని ప్రదర్శిస్తుంటారు. తమ భర్తలు యుద్ధంలో వీరమరణం పొందినా.. వాళ్లు వదిలి వెళ్లిన బాధ్యతల్ని నెరవేర్చడానికి, దేశ సేవలో పునీతం కావడానికే సిద్ధపడతారు. ఇటీవలే శిక్షణ ముగించుకున్న లిగ్జిన్‌, హర్వీన్‌లు కూడా ఇదే కోవకు చెందుతారు.


టీచింగ్‌ వృత్తిని వదిలి..!

హర్వీన్‌ది పంజాబ్‌లోని జలంధర్‌. అక్కడి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేసే క్రమంలోనే కెప్టెన్‌ కన్వల్‌పాల్‌ సింగ్‌ కహ్లోన్‌తో ఆమె వివాహమైంది. మేజర్‌ కహ్లోన్‌ 129 SATA రెజిమెంట్కు చెందిన ఆర్టిలరీ అధికారి. భర్త విధుల్లో ఉన్నప్పుడు కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించారామె. అయితే 2019లో మేజర్‌ తన విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అప్పటికి హర్వీన్‌ ఐదు నెలల గర్భిణి. హఠాత్తుగా భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె.. ముందు బాధపడినా ఆ తర్వాత గుండె రాయి చేసుకుంది. భర్త తన కోసం వదిలి వెళ్లిన ఆశయాన్ని నెరవేర్చడం కోసం భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టీచింగ్‌ వృత్తినీ వదులుకుందామె.

ఆయనెక్కడున్నా గర్వపడతారు!

‘నా భర్త నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహించేవారు. దేశ సేవలో తాను పొందే ఆనందం, అనుభూతుల గురించి పదే పదే చెప్పేవారు. ఇవే నాలో దేశభక్తిని మరింతగా పెంచాయి. నేనూ ఆర్మీలో చేరాలని నా భర్త ఆకాంక్షించేవారు. కానీ ఆయన పోయాక తన స్థానాన్ని ఇలా భర్తీ చేయాల్సి రావడం బాధాకరం. ఏదేమైనా మావారి కలను ఇలా నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడున్నా నా నిర్ణయాన్ని స్వాగతిస్తారు..’ అంటూ భావోద్వేగానికి లోనైంది హర్వీన్‌. గతేడాది డిసెంబర్‌లో చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ’లో చేరిన ఆమె.. ఇటీవలే 11 నెలల శిక్షణ పూర్తిచేసుకొని పరేడ్‌లో పాల్గొంది. అదే వేదికగా తన కొడుకును ముద్దాడుతూ తల్లిప్రేమను చాటుకుందామె.


నా కొడుకు గర్వపడేలా..!

వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరంగానూ భర్త బాధ్యతల్లో భాగం పంచుకోవడానికి సిద్ధపడింది లద్దాఖ్‌కు చెందిన లెఫ్టినెంట్‌ రిగ్జిన్‌ కొరోల్‌. ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారామె. లద్దాఖ్‌ స్కౌట్స్‌కు చెందిన జెదాంగ్‌ సుంపా బెటాలియన్‌లో రైఫిల్‌మ్యాన్‌గా విధులు నిర్వర్తించిన రిగ్జిన్‌ కందప్‌ విధి నిర్వహణలో అసువులు బాశారు. దీంతో ఆయన అర్ధాంగిగా తన భర్త బాధ్యతల్ని భుజాలకెత్తుకున్నారు కొరోల్.

‘నా భర్త ఆర్మీ ఆఫీసర్‌ కావాలని కలలు కన్నారు. కానీ అది నెరవేరకముందే వీర మరణం పొందారు. నేనూ ఆర్మీలో చేరాలని ఆకాంక్షించారు. ఆయన ప్రోత్సాహంతోనే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నా. తన కల ఇలా నెరవేర్చినందుకు గర్వంగా ఉంది. ఈ 11 నెలలు నా కొడుకును, వాడి బాల్య స్మృతుల్ని ఎంతగానో మిస్సయ్యా. అయినా వాడికి ఉన్నత భవిష్యత్తును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నన్నిలా చూసి మా ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు..’ అంటూ పరేడ్‌ తర్వాత తన కొడుకును గుండెలకు హత్తుకొని మురిసిపోయిందీ ఆర్మీ మామ్‌. లద్దాఖ్‌ నుంచి భారత సైన్యంలో చేరబోతోన్న తొలి మహిళగానూ కీర్తి గడించింది కొరోల్.

భర్త ఆశయాన్ని తమ భుజాలపై మోస్తూ ఇండియన్‌ ఆర్మీలో చేరబోతోన్న ఈ ధీర వనితలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు పరేడ్‌ అనంతరం తమ కన్నబిడ్డల్ని గుండెలకు హత్తుకుంటూ భావోద్వేగానికి లోనైన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సెల్యూట్‌ ఆర్మీ మామ్స్!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్