శిరోజాలకు పాల మృదుత్వం..

జుట్టు బలంగా, ఆరోగ్యంగానే కాదు, మృదువుగా పట్టులా జారాలంటే వారానికొకసారి మాస్క్‌ వేయాలంటున్నారు నిపుణులు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చెబుతున్నారు.

Published : 23 Sep 2022 00:27 IST

జుట్టు బలంగా, ఆరోగ్యంగానే కాదు, మృదువుగా పట్టులా జారాలంటే వారానికొకసారి మాస్క్‌ వేయాలంటున్నారు నిపుణులు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చెబుతున్నారు.

నాలుగైదు చెంచాల పాలల్లో చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు మృదువుగా రాసి పావుగంట ఆరనివ్వాలి. గాఢత తక్కువగా, రసాయనరహితమైన షాంపుతో రుద్ది, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. పొడారిన జుట్టును ఈ మాస్క్‌ మృదువుగా మారుస్తుంది. పాలల్లోని ప్రొటీన్లు శిరోజాలను బలంగా చేస్తాయి. వీటిలోని కాల్షియం జుట్టు పెరగడానికి దోహదపడితే, విటమిన్‌ ఏ, పొటాషియం వంటివి మెరుపునిస్తాయి.

బాదం నూనెతో..
ఒక అరటిపండును గుజ్జుగా చేసి, ఆరేడుచుక్కల బాదంనూనె కలిపి మిక్సీలో మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి షవర్‌ కవర్‌ వేసుకొని అరగంట ఆరనివ్వాలి. జుట్టులోకి ఈ ప్యాక్‌ బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. ఈ మాస్క్‌ మాడుపైన కణాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చుండ్రు, దురదవంటి సమస్యలను దూరం చేస్తుంది. శిరోజాల చివర్ల ఏర్పడే పగుళ్లు తగ్గి, మృదువుగా మారతాయి. కండిషనర్‌లా పనిచేసి, మెరిసేలా చేస్తుంది.

గ్రీన్‌ టీతో..
ఒక గిన్నెలో కోడిగుడ్డు పచ్చసొనను విడిగా తీయాలి. ఇందులో రెండు చెంచాల గ్రీన్‌టీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపుతో స్నానం చేస్తే చాలు. ఇది కుదుళ్లు, శిరోజాలకు పోషకాలను అందించి, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. శిరోజాలు రాలడాన్ని తగ్గించి మృదువుగా మెరిసేలా చేస్తుంది.

మయోనైజ్‌తో..
పావుకప్పు మయోనైజ్‌కు నాలుగైదు చుక్కలు ఏదైనా ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ లేదా గుడ్డు కొట్టి బాగా కలపాలి. ముందుగా కుదుళ్ల నుంచి ఈ మిశ్రమాన్ని పట్టించి, ఆ తర్వాత దువ్వెనతో మృదువుగా దువ్వాలి. అరగంట ఆరనిచ్చి స్నానం చేయాలి. జుట్టుకు ఈ మాస్క్‌ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, మృదుత్వంతోపాటు మెరిసేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్