దుర్గామండపాల చీరలకు కొత్త లుక్‌!

వార్డ్‌రోబ్‌లోని అలనాటి చీరలు, దుర్గా మండపాల నుంచి సేకరించే చీరలు ఈమె చేతిలో అందమైన దుస్తులుగా రూపు దిద్దుకుంటున్నాయి. పాతదుస్తుల పునర్వినియోగానికి పదేళ్ల క్రితమే కొత్త అర్థం చెప్పిన మేఘన దుస్తుల రీసైక్లింగ్‌తో మ్యాజిక్‌ చేస్తోంది.

Published : 27 Sep 2022 00:46 IST

వార్డ్‌రోబ్‌లోని అలనాటి చీరలు, దుర్గా మండపాల నుంచి సేకరించే చీరలు ఈమె చేతిలో అందమైన దుస్తులుగా రూపు దిద్దుకుంటున్నాయి. పాతదుస్తుల పునర్వినియోగానికి పదేళ్ల క్రితమే కొత్త అర్థం చెప్పిన మేఘన దుస్తుల రీసైక్లింగ్‌తో మ్యాజిక్‌ చేస్తోంది. నేటి తరం అభిరుచికి తగినట్లుగా వాటితోనే కొత్త దుస్తులను రూపొందించి శభాష్‌ అనిపించు కుంటోంది...

మ్మమ్మ, నానమ్మ, ఆ తర్వాత.. అమ్మ వార్డ్‌రోబ్‌లోని పాతకాలంనాటి చీరలను చూసినప్పుడల్లా మేఘన ఆశ్చర్యపోయేది. ఎంబ్రాయిడరీ, డిజైన్స్‌తో కళాత్మంగా ఉండే ఆ చీరలు ఆమెను వాటిపై ప్రేమను పెంచుకునేలా చేశాయి. కోల్‌కతాకు చెందిన మేఘన ఓసారి వాళ అమ్మ వార్డ్‌రోబ్‌లో తరతరాల నుంచి వస్తున్న చీరలను చూసి విస్తుపోయింది. నాలుగైదు తరాల కిందటి ఆ చీరలపై ఉన్న ప్రత్యేకమైన పనితనం ప్రస్తుత కాలంలో ఏ వస్త్రంలోనూ కనిపించని విధానం ఈమెను ఆకర్షించింది.. 

పర్యావరణంపై అవగాహన..

పాత దుస్తులను రీసైకిల్‌ చేసి కొత్త దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది మేఘన. అదే ఆమెను 2012లో ‘లతాసీత’ డిజైన్‌ స్టూడియోను ప్రారంభించేలా చేసింది. ఆనాటి వస్త్ర సంపద అందాన్ని తగ్గించకుండా, వస్త్ర వారసత్వాన్ని సంరక్షించేలా.. క్లాసిక్‌ అవుట్‌ఫిట్స్‌ తయారీ మొదలుపెట్టింది. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తూ పొదుపు చేసిన రూ.5 లక్షలను పెట్టుబడి పెట్టి, పాత వస్త్రాలతో జాకెట్లు, ష్రగ్స్‌, కుర్తాల తయారీ మొదలుపెట్టింది. ఎవరి దుస్తులనో..రీసైకిల్‌ చేసిన తర్వాత తాము ధరించడమెలా అనే సందేహం చాలామందిలో ఇప్పటికీ ఉంటోంది అంటోంది మేఘన. ‘తమ పాత దుస్తులను రీసైకిల్‌ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. రీసైకిల్‌ విధానంపై అందరిలో అవగాహన తేవడానికి చాలా కష్టపడ్డా. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇదీ ఒక మార్గమని అందరికీ అర్థమయ్యేలా చేసేదాన్ని. ఫ్రీలాన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తూనే ‘లతాసీత’ స్టూడియో నిర్వహించేదాన్ని. అవుట్‌ఫిట్స్‌ రూపొందించడానికి రీయూజ్‌ చేయాల్సిన చీరల కోసం గతేడాది కోల్‌కతాలోని దుర్గాపూజ పందిళ్లవైపు దృష్టిసారించా. వీటిని అలంకరించడం కోసం ఎక్కువగా చీరలనే వినియోగిస్తారు. రీసైకిల్‌ చేసే విధానాన్ని వివరించి మొత్తం కోల్‌కతాలో పందిళ్లలో చీరలను సేకరించడం మొదలుపెట్టా. లేదంటే ఇవన్నీ వృథాగా డంప్‌ యార్డ్‌కు చేరుకుంటాయి. రెండు రకాలుగా వస్త్ర సేకరణ మొదలుపెట్టా. నేతకార్మికుల వద్ద వృథాగా మిగిలిన రద్దు, దుర్గాపూజ పందిళ్ల అలంకరణలో వినియోగించిన చీరలు సేకరిస్తున్నా. అలాగే ‘సెండ్‌ అజ్‌ యువర్‌ శారీ (మాకు మీ చీర పంపండి)’ పేరుతో ప్రచారం చేస్తూ కలెక్షన్‌ ప్రారంభించా. చీరలతో మాత్రమే కాకుండా ఈమధ్య పట్టు కర్టెన్లతో షేర్వాణీలు, పాత జీన్స్‌తో డెనిమ్‌ జాకెట్స్‌ తయారుచేశాం’ అంటున్న మేఘన తాను రూపొందించిన డిజైన్లను తైవాన్‌, ఇంగ్లండ్‌, కెన్యా, శ్రీలంక, జర్మనీ, స్వీడన్‌, బెల్జియం, నెదర్‌లాండ్స్‌ దేశాల్లో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించింది. ‘పాత చీరను రీసైకిల్‌ చేయడం ఒక ఛాలెంజ్‌. పాతడిజైన్‌ దెబ్బ తినకుండా కొత్త డిజైన్‌గా మార్చేముందు, చీరను మరమ్మతు చేయడం, శుభ్రపరిచి భద్రపరచడం, డార్నింగ్‌ వంటి పనులెన్నో ఉంటాయి’ అని చెబుతున్న మేఘన ఈ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి కృషి చేస్తానంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్