యాపిల్‌తోయాంటీ ఏజింగ్‌..

ఈ కాలంలో పొడారే చర్మానికి మాయిశ్చరైజింగ్‌ గుణాలుండే యాపిల్‌ మంచి ఔషధంలా పని చేస్తుంది.

Published : 17 Nov 2022 00:47 IST

ఈ కాలంలో పొడారే చర్మానికి మాయిశ్చరైజింగ్‌ గుణాలుండే యాపిల్‌ మంచి ఔషధంలా పని చేస్తుంది. దీంతో వేసే లేపనాలు ముఖానికి మృదుత్వాన్ని, తేమను అందించడంతోపాటు వృద్ధాప్య ఛాయల నుంచే కాపాడతాయి. 

సి విటమిన్‌ పుష్కలంగా ఉండే యాపిల్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. చర్మ కణాలను పరిరక్షిస్తుంది. మొటిమల మచ్చలు, చర్మం పొడారడం, త్వరిత వృద్ధాప్య ఛాయలు, ముడతలు, గీతలు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. చర్మానికి అత్యంత ముఖ్యమైన కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులోని కాపర్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేస్తుంది. చర్మరంధ్రాలను శుభ్రపరిచి, బిగుతుగా చేసి రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. దీంతో ముఖం మెరుపులీనుతుంది.


పెరుగుతో.. చెంచా యాపిల్‌ గుజ్జుకు చెంచాన్నర పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, వృత్తాకారంలో మృదువుగా మర్దన చేయాలి. పావుగంట ఆగి కడిగితే చాలు. ఇందులోని లాక్టిక్‌ యాసిడ్‌ మృతకణాలను పోగొట్టి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్‌ బి 2 చర్మకణాలను ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. పొడిబారకుండా తేమగా మారుస్తుంది. పెరుగులోని జింక్‌ ఎండకి చర్మం ప్రభావితం కాకుండా రక్షిస్తుంది. డి విటమిన్‌ లోపాన్ని తగ్గిస్తుంది.


తేనె కలిపితే.. చెంచా చొప్పున తేనె, యాపిల్‌ గుజ్జు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడగాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు వేసే ఈ లేపనంతో చర్మం కాంతులీనుతుంది. బీ1, బీ2, బీ3, బీ5 విటమిన్లు, కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజలవణాలు, అమినోయాసిడ్స్‌ వంటివన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణ ప్రభావాల నుంచి కాపాడతాయి.


అరటిపండును కలిపి.. సగం అరటిపండును గుజ్జుగా చేయాలి. దీనికి చెంచా యాపిల్‌ గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ లేపనం వేస్తే యాంటీ ఏజింగ్‌ మాస్క్‌లా ఉపయోగపడుతుంది. అరటిలోని పొటాషియం చర్మానికి మాయిశ్చరైజర్‌గా మారి మృదుత్వాన్ని, తేమను అందిస్తుంది. ఏ, సీ, ఈ విటమిన్లు చర్మానికి పోషకాలనిస్తాయి. ముడతలు, గీతలను దూరం చేసి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్