మెరుపులీనే మెడ కోసం..

కంఠాభరణాలు అందంగా కనిపించాలంటే మెడ చుట్టూ చర్మమూ మెరుస్తూ ఉండాలి. బ్యాక్‌నెక్‌ బ్లవుజు ధరించేటప్పుడు మెడ మురికిగా కనిపిస్తే దుస్తుల అందం తగ్గినట్లే.

Updated : 19 Nov 2022 04:22 IST

కంఠాభరణాలు అందంగా కనిపించాలంటే మెడ చుట్టూ చర్మమూ మెరుస్తూ ఉండాలి. బ్యాక్‌నెక్‌ బ్లవుజు ధరించేటప్పుడు మెడ మురికిగా కనిపిస్తే దుస్తుల అందం తగ్గినట్లే. ఇలా కాకుండా నిపుణులు చెబుతున్న చిట్కాలివే..

స్క్రబ్బింగ్‌తో.. అధికబరువు, పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోం, మధుమేహం, హార్మోన్లలో మార్పుల వల్ల మెడచుట్టూ చర్మం నలుపు అవుతుంది. ముఖం వరకే శుభ్రత పాటించడంతోనూ.. మెడ వద్ద మురికి పేరుకొని చర్మం నల్లగా మారుతుంది. కారణమేదైనా మెడ కూడా మెరిస్తేనే అలంకరణ తోడై.. ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చెంచా శనగపిండి, అరచెంచా బియ్యప్పిండి, పావుచెంచా పసుపులో సరిపడేలా పాలు, అరచెక్క నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. దీన్ని మెడ చుట్టూ రాసి పావుగంట ఆరనివ్వాలి. తడిపిన చేత్తో మృదువుగా స్క్రబ్‌ చేసి గోరు వెచ్చని నీటితో కడిగితే, చర్మ రంధ్రాల్లో మురికి పోయి శుభ్ర పడుతుంది. చెంచా కలబంద గుజ్జుకు రెండు చెంచాల పెరుగు కలిపిన మిశ్రమాన్ని మెడ చుట్టూ రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి తడిచేత్తో మృదువుగా స్క్రబ్బింగ్‌ చేయాలి. చర్మంలో పేరుకున్న మురికి బయటకు వస్తుంది. పెరుగు చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. వారానికి 2,3సార్లు ఇలా చేస్తే క్రమేపీ చర్మం నలుపుదనం దూరమై, కాంతులీనుతుంది.

బ్లీచింగ్‌.. చర్మం నలుపును దూరం చేసేందుకు బంగాళాదుంప బ్లీచింగ్‌ ఏజెంటుగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఇనుము, సి విటమిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తురిమిన బంగాళాదుంప గుజ్జును పల్చని వస్త్రంలో వేసి వడకట్టాలి. ఈ రసాన్ని మెడ చుట్టూ రాసి పావుగంటాగి కడగాలి. బంగాళా దుంపను చక్రాల్లా కోసి వాటితో  చర్మంపై రుద్దుతూ పది నిమిషాల తర్వాత కడిగితే చాలు. ఇలా ఓ వారం చేస్తే ఫలితం కనిపిస్తుంది.

మృతకణాలు.. రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కు నాలుగు చెంచాల నీటిని కలిపిన మిశ్రమంలో ముంచిన దూదిని మెడ చుట్టూ రాయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయాలి. ఇది చర్మంలోని మృతకణాలను దూరం చేసి, పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేస్తుంది. మూడు చెంచాల వంటసోడాకు సమానంగా నీటిని కలిపి పేస్టులా చేసి మెడకు రాసి ఆరనివ్వాలి. తడిచేత్తో మృదువుగా రుద్దుతూ కడిగితే చాలు. ప్రతిరోజూ ఇలా చేస్తే మురికి, మృతకణాలు దూరమై, చర్మం కాంతులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్