కమలాల.. సోకు!

శీతకాలంలో విరివిగా దొరికే కమలాపండు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తే, తొక్కలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు..

Published : 26 Jan 2023 00:35 IST

శీతకాలంలో విరివిగా దొరికే కమలాపండు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తే, తొక్కలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు..

కమలా తొక్కలను చిన్న ముక్కలుగా తరిగి ఎండలో ఆరబెట్టాలి. వాటిని ఒక గాజు గిన్నెలో వేసి, మూడు విటమిన్‌ ఇ క్యాప్సుల్స్‌ని కత్తిరించి ఆ నూనె వేసుకోవాలి. ఆపై రెండు చెంచాల గులాబీ నీరు, అరచెంచా గ్లిసరిన్‌ వేసి మూతపెట్టి ఎనిమిది గంటలు నాననివ్వాలి. ఈ ముక్కలను మిక్సీలో మెత్తగా చేసి వడకట్టగా వచ్చిన మిశ్రమాన్ని.. ఆరు చెంచాలు తీసుకోవాలి. దీనికి చెంచా కలబంద గుజ్జు కలిపి బాగా కలపాలి. ఇలా తయారైన సీరంను పొడిగా ఉన్న గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకొంటే చాన్నాళ్లు నిల్వ ఉంటుంది. మేకప్‌ వేసే ముందు అరచేతిలో రెండుమూడు చుక్కల సీరంను ముఖమంతా మృదువుగా రాసి ఆరనిచ్చి, ఆ తర్వాత క్రీం రాసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలు, మురికి ప్రభావం చర్మంపై పడకుండా పరిరక్షిస్తుంది. మచ్చలను దూరం చేస్తుంది. ఈ సీరంలోని సి విటమిన్‌ చర్మానికి కొలాజెన్‌ను అందించి మృదువుగా చేస్తుంది.

పొడితో.. కమలాపండు తొక్కలను ఎండలో ఆరనిచ్చి పొడి చేసి మెత్తని వస్త్రంలో జల్లించాలి. ఈ పొడిని భద్రపరుచుకుంటే నాలుగైదు నెలలు నిల్వ ఉంటుంది. చెంచా పొడికి రెండు చెంచాల పెరుగు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. తక్కువ సమయంలో మెరిసిపోడానికి ఈ ప్యాక్‌ ఉపయోగపడుతుంది.

* చెంచా పొడికి చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకూ రాసి పది నిమిషాలు ఆరనిచ్చి కడిగినా చాలు. మొండి మచ్చలు దూరమవుతాయి.

* చెంచా చొప్పున నారింజ పొడి, గంధం పొడి తీసుకొని దానికి రెండు చుక్కల నిమ్మరసం, రెండు చెంచాల గులాబీ నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకు రాసి అయిదు నిమిషాల తర్వాత కడిగితే ముఖం మెరిసిపోతుంది. చర్మంలోని మురికిని బయటకు పంపి మొటిమలు రాకుండా కాపాడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు చెంచా పొడికి.. కొద్దిగా ముల్తానీమట్టి, సరిపడా గులాబీ నీరు కలిపి ముఖానికి రాసి ఆరాక కడిగితే చాలు. బ్లాక్‌హెడ్స్‌ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్