మోముకి మెరుపు తెచ్చే పుచ్చకాయ!

కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ అవసరం. ముఖ్యంగా వేసవిలో ఎండ, తేమతో కూడిన వాతావరణం నుంచి మేనుని మెరిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం పుచ్చకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్నెలా వినియోగించాలంటే... పుచ్చకాయలో అధికశాతం నీరు ఉంటుంది.

Published : 23 May 2023 00:45 IST

కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ అవసరం. ముఖ్యంగా వేసవిలో ఎండ, తేమతో కూడిన వాతావరణం నుంచి మేనుని మెరిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం పుచ్చకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్నెలా వినియోగించాలంటే...

ఫేషియల్‌ మిస్ట్‌: పుచ్చకాయలో అధికశాతం నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని సహజంగా తేమగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కల్ని చేత్తో నలిపి రసాన్ని వడకట్టాలి. దీనికి కాస్త నిమ్మరసం చేర్చి ముఖానికి స్ప్రే చేస్తే సరి. చల్లదనంతో పాటూ మోము తాజాగానూ మెరిసిపోతుంది.

షుగర్‌ స్క్రబ్‌: ఈ పండులో విటమిన్‌ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. పుచ్చకాయ రసానికి కొద్దిగా పంచదార, కొబ్బరినూనె కలిపి ఒంటికి రాసుకుని వలయాకారంలో రుద్దాలి. ఇలా ఓ ఇరవై నిమిషాలు చేశాక కడిగేసుకుంటే సరి. చర్మం కాంతులీనుతుంది.

ఫేస్‌ మాస్క్‌: జర్నల్‌ ఆఫ్‌ మెడిసినల్‌ ఫుడ్‌ అధ్యయనం ప్రకారం... పుచ్చకాయకు యూవీ కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడే శక్తి ఉంది. ఇది వాపునీ తగ్గించగలదట. ఇందులో ఉండే లైకోపీన్‌ ముఖాన్ని వన్నెలీనేలా చేస్తుంది. దీనికోసం పుచ్చకాయ ముక్కని నలిపి దానిలో కొద్దిగా పెరుగు, కొంచెం తేనె కలిపి ముఖానికి పూత వేసి కడిగితే పై ఫలితం మీ సొంతమవుతుంది.

తలకు పూత: ఈ వేసవి వేడికి ముఖమే కాదు... జుట్టూ నిర్జీవంగా మారి, చిట్లుతుంది. ఈ ఇబ్బందులు తగ్గాలంటే పుచ్చకాయ రసానికి కాస్త కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే సరి. ఇలా ఓ అరగంట ఉంచి తర్వాత తలస్నానం చేస్తే కేశాలకు కావలసిన పోషణ అంది నిగనిగలాడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్