కుంకుడు కాయలతో కురులు భద్రం..

ఏ ఇద్దరు అమ్మాయిలు కలిసినా కురుల ప్రస్తావన వస్తుంది. ‘ఎన్ని జాగ్రత్తలు పాటించినా జుట్టు రాలిపోతోంది..’ అంటూ నిట్టూర్పులు విడవటం చూస్తుంటాం. ఇదే విషయాన్ని అమ్మమ్మతోనో నాన్నమ్మతోనో మాట్లాడి చూడండి.. కుంకుడు కాయలను గుర్తు చేస్తారు.

Updated : 29 Aug 2023 05:11 IST

ఏ ఇద్దరు అమ్మాయిలు కలిసినా కురుల ప్రస్తావన వస్తుంది. ‘ఎన్ని జాగ్రత్తలు పాటించినా జుట్టు రాలిపోతోంది..’ అంటూ నిట్టూర్పులు విడవటం చూస్తుంటాం. ఇదే విషయాన్ని అమ్మమ్మతోనో నాన్నమ్మతోనో మాట్లాడి చూడండి.. కుంకుడు కాయలను గుర్తు చేస్తారు. నిట్టూర్చి చాదస్తంగా తోసేస్తాం కానీ.. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యమెక్కువే. వాటిల్లో బోలెడు లాభాలున్నాయి మరి.

  • ఎంత ఖరీదైన షాంపూ అయినా రసాయనాలతో కూడుకున్నవే. కాబట్టి, కురులకు ఎంతో కొంత హాని చేస్తాయి. కుంకుడులోని ఎ, డి, ఇ, కె విటమిన్లు జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మాడును ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. తలకు చల్లదనాన్నీ అందిస్తాయి.
  • కుంకుడు రసం తీయడమే కష్టమంటారా? కొన్ని కాయలు పగలకొట్టి, గింజలు తీసేసి, తడి లేని డబ్బాలో వేయండి. స్నానానికి అరగంట ముందు వేడి నీటిలో నానబెట్టి రసం మగ్గులోకి తీసుకుంటే సరి. అదీ ఇబ్బంది అనుకుంటే మార్కెట్‌లో పొడి దొరుకుతోంది. దాన్ని వేడినీటిలో నానబెట్టుకొనైనా వాడుకోవచ్చు.
  • కొన్ని కుంకుడు కాయలను 2 గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ రసాన్ని సీసాలోకి తీసుకొని అరచెంచా సిట్రిక్‌ యాసిడ్‌ వేస్తే.. కొన్ని వారాలు నిల్వ ఉంటుంది. సిట్రిక్‌ యాసిడ్‌ వద్దనుకుంటే కుంకుడు కాయల్లో నీళ్లు పోసి సగమయ్యేదాకా మరిగించి, చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేయొచ్చు. షాంపూలా కొన్ని నీళ్లకి కలుపుకొని వాడుకోవచ్చు.
  • కుంకుడు సహజమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు పొడిబారదు, చిట్లదు, చుండ్రు రాదు. కురులూ దృఢంగా ఉంటాయి. కుంకుళ్లలోని కొన్ని గుణాలు తలనొప్పిని దూరం చేస్తాయి. శ్వాస ఇబ్బందులు, ఉబ్బసం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయి. ఇన్ని లాభాలున్న కుంకుడు కారుచవక కూడా. ఒకసారి ప్రయత్నించి చూడండి!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్