ఫ్యాషన్‌తోపాటు.. మేలూ చేయాలి!

వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిల్లో ఫ్యాషన్‌ రంగానిదీ ప్రధాన పాత్రే! దాని గురించి తలచుకోగానే గుర్తొచ్చేది మహిళలే. అంటే పర్యావరణ కాలుష్యానికి మనమూ ఏదో ఒక కోణంలో కారణమవుతున్నామనేగా అర్థం.

Published : 14 Sep 2023 02:03 IST

వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిల్లో ఫ్యాషన్‌ రంగానిదీ ప్రధాన పాత్రే! దాని గురించి తలచుకోగానే గుర్తొచ్చేది మహిళలే. అంటే పర్యావరణ కాలుష్యానికి మనమూ ఏదో ఒక కోణంలో కారణమవుతున్నామనేగా అర్థం. అలా కాకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

బీరువా నిండా దుస్తులున్నా.. వేసుకోవడానికేమీ లేవనిపిస్తుంది. తక్కువ ధర, డిస్కౌంట్‌లో ఎక్కువ వస్తున్నాయని సంబరంగా కొనేస్తుంటారు. తీరా ఏదైనా వేడుక వచ్చేటప్పటికి అంతా సాదాసీదాగా కనిపిస్తాయి. తిరిగి షాపింగ్‌ అంటూ బయల్దేరతారు. ఈసారి నుంచి ఏది కొనాలనుకున్నా.. ‘ఎందుకు? నిజంగానే అవసరం ఉందా.. కనీసం 30 సార్లయినా ఆ దుస్తులను ధరిస్తామా..’ అన్న మూడు ప్రశ్నలు వేసుకొంటే చాలు. పర్యావరణ పరిరక్షణలో భాగమైనట్లే.

‘ఇప్పుడిది ట్రెండు’.. నలుగురిలో వెనకబడకూడదని తెచ్చేసుకొంటున్నారా.. అయితే ఆ మోడల్‌ నెల రోజులకన్నా ఎక్కువ ఉండదు. ఆ తర్వాతేంటని ఆలోచించారా? ట్రెండీగా కనిపించాలని, వేరొకరితో పోల్చుకొని ఫాస్ట్‌ ఫ్యాషన్‌ వెంట పడొద్దు. దుస్తులు కొనేటప్పుడే చిన్న మార్పులతో వేర్వేరు వేడుకలకు వేసుకోవచ్చా అని గమనించాలి. ఎప్పటికప్పుడు కొత్తవి కొనే పనిలేకుండా ఉన్నవాటితోనే ప్రత్యేకంగా కనిపించొచ్చు.

ఆర్గానిక్‌ కాటన్‌, హెంప్‌, లినెన్‌, బాంబూ వంటివాటితో తయారయ్యే వస్త్రాలను ఎంచుకోవాలి. ఇవి రసాయన రహితంగా, తక్కువ నీటితో తయారవుతాయి. పర్యావరణానికి హాని ఉండదు, ధరించడానికి సౌకర్యంగానూ ఉంటాయి. ఇంకా ఎక్కువ కాలం మన్నుతాయి.. వృథా తగ్గినా మంచిదేగా!

ఏదైనా వేడుక వచ్చినప్పుడు వేలు, లక్షల రూపాయలు పెట్టి కొంటుంటారు. వాటిని ఏడాదికోసారి కూడా వేయడం కుదరదు. ఇప్పుడు చాలా సంస్థలు దుస్తుల్ని అద్దెకిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకున్నా సరే! ఒక్కో డ్రెస్‌నూ ఎక్కువ సార్లు ఉపయోగించడం, అలాగే వాడిన తర్వాత త్వరగా భూమిలో కలిసిపోయేలా ఉంటే చాలు. కాలుష్యాన్ని తగ్గించడంలో, పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకున్నట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్