వేసవైనా వేడుకైనా... చికన్‌కారీ ఉందిగా!

ఎటుచూసినా పెళ్లిళ్ల హడావుడి, మంగళ వాద్యాల సందళ్లే! సందడి కేవలం పెళ్లికూతుళ్లదే కాదు, హాజరయ్యే ఆడపిల్లలది కూడా! కానీ... వేడుకలతో పోటీపడుతూ వేడి కూడా దంచేస్తోంది మరి.అందంగా కనిపించడం మాటెలాగున్నా... చెమటతో వచ్చే చిరాకుతోనే ఇబ్బందంతా.

Updated : 18 Feb 2024 06:03 IST

ఎటుచూసినా పెళ్లిళ్ల హడావుడి, మంగళ వాద్యాల సందళ్లే! సందడి కేవలం పెళ్లికూతుళ్లదే కాదు, హాజరయ్యే ఆడపిల్లలది కూడా! కానీ... వేడుకలతో పోటీపడుతూ వేడి కూడా దంచేస్తోంది మరి.అందంగా కనిపించడం మాటెలాగున్నా... చెమటతో వచ్చే చిరాకుతోనే ఇబ్బందంతా. ఇక ఆ ఆనందాల్ని ఏం ఆస్వాదించగలం అనిపిస్తోందా? అయితే ఈ చికన్‌కారీ ఫ్యాషన్‌ వైపు ఓ లుక్కేయండి.

వేసవి వేడికి సరైన ఎంపిక. ఓవైపు తేలికగా, మేనికి చల్లదనాన్నిస్తూనే, హుందాతనాన్నీ తెచ్చిపెడుతుంది. సంప్రదాయ కళ... ఆధునికతను మెచ్చే ఈతరం అమ్మాయిలం. మాకేం నచ్చుతుంది అంటారా? చికన్‌కారీ ఏళ్ల క్రితం నాటిదే అయినా... కాలానికి తగ్గట్టుగా మారుతూ, ఆధునికతను అద్దుకుంటూ వస్తోంది. అందుకే డిజైనర్ల ప్రధాన ఎంపికల్లో ఇదీ ఒకటవుతోంది.

కాటన్‌, చందేరీ, మస్లిన్‌, జార్జెట్‌, విస్కోస్‌, సిల్క్‌, ఆర్గాంజా, నెట్‌... ఇలా ఎన్నో రకాల వస్త్రాలపై కళాత్మకంగా ఒదిగిపోతోంది. ఫండా, జాలీ, తేప్చి, హూల్‌ అంటూ బోలెడు రకాల్లోనూ లభిస్తోంది. లేతరంగులపై తెల్లని దారంతో చేసే ఎంబ్రాయిడరీనే కాదు కోరుకున్నవారికి మిర్రర్‌, సీక్వెన్స్‌, బీడ్స్‌, పెరల్స్‌ను జత చేసుకొని రాయల్‌ లుక్‌నీ తెచ్చిపెడుతోంది. అందుకే తారలూ దీనిపై మనసు పారేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకలేవైనా ‘చికన్‌కారీ’కే మా ఓటు అనేస్తున్నారు. నిశ్చితార్థం, హల్దీ, మెహందీ వేడుకల్లో వెలిగిపోవాలనుకునే వధువుకైనా, అయినవాళ్ల వేడుకల్లో మెరిసిపోవాలనుకునే మగువకైనా... సంప్రదాయం, ట్రెండీ లుక్‌ ఏది కావాలన్నా చికన్‌కారీ సిద్ధమే! ‘అరెరే.. పలుచగా ఉంటుంది, దాన్ని కవర్‌ చేసే ఇన్నర్‌ టాప్‌ వెతుక్కోవడమూ సమస్యే’ అనే ఫిర్యాదులకీ జవాబు దొరికింది. టాప్‌కి తగ్గట్టుగా భిన్న వస్త్రరకాల్లో వాటినీ సిద్ధం చేస్తున్నారు. ఒక్కోసారి టాప్‌కే జత చేస్తున్నారు కూడా. విడిగా దేనిమీదకైనా సిద్ధం చేసుకునేలా కుర్తీ, చున్నీ, ప్యాంట్లు, బ్లవుజులూ, జీన్స్‌ మీదకి ట్రెండీ టాప్‌లూ దొరుకుతున్నాయి. చీర, చుడీదార్‌, లెహెంగా, షరారా, టాప్‌... ఏది కావాలన్నది ఎంచుకోవడమే మీ వంతిక!

అయితే జాగ్రత్త!

  • కొనాలనుకున్న వస్త్రరకాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే ఈమధ్య మార్కెట్‌లో మెషీన్‌ ఎంబ్రాయిరీ చేసిన వాటినే చేతి కుట్టుగా చెప్పి అమ్మేస్తున్నారు. కాబట్టి, చెక్‌ చేసుకోవాల్సిందే. కుట్టులో కాస్త తేడా కనిపించిందా... అయితే చక్కగా కొనేసుకోండి. హస్త కళ కదా! ఎంత నైపుణ్యం ఉన్న కళాకారుడైనా, కొన్ని పొరపాట్లు సాధారణమే. అందుకే వెనక్కి తిప్పి చూస్తే ముందూ వెనకా తేడా ఏమీ లేకుండా, ఒకే రీతిలో ఉందంటే అసలైనది కాదనే అర్థం.
  • దారప్పోగులెలా ఉన్నాయి? ఒకే వరుసలో, నిర్ణీత దూరంలో ఉన్నాయేమో చెక్‌ చేయండి. లోపాలుంటే సరే! అలాకాకుండా కచ్చితమైన దూరం, కుట్టు కనిపిస్తే నకిలీగానే గుర్తించాలి.
  • ఈ సున్నితమైన కళకి పలుచని వస్త్ర రకాలనే ఎంచుకుంటారు. ఇంకా సహజ రంగులద్దిన లేత వర్ణాల వాటికే ప్రాధాన్యమిస్తారు. క్లాత్‌ మందంగా ఉన్నా, వాటి రంగులు కొట్టొచ్చేలా కనపడుతున్నా అనుమానించాల్సిందే.
  • చాలా తక్కువ ధరకే వస్తోంది, హాయిగా కొనేసుకోవచ్చు అనుకుంటున్నారేమో! ఈ ఎంబ్రాయిడరీని పూర్తిచేయడం అంత సులువు కాదు. చాలా కష్టపడాలి. అంత కష్టం తక్కువ ధరలో ఎక్కడైనా వస్తుందా? వస్తోందంటే నకిలీ అనేగా అర్థం. బాబోయ్‌... ఇవన్నీ చెక్‌ చేసుకోవడం మావల్ల కాదు అనిపిస్తోందా? అయితే నమ్మకమైన సంస్థల ద్వారా కొనుక్కుంటే సరి. లేదూ చికన్‌కారీ కోఆపరేటివ్‌ సంస్థల సాయం తీసుకుంటే... కోరుకున్నదాన్నీ కొనుక్కోవచ్చు, ఆ కళాకారులకు ఉపాధి కలిగించినట్లూ అవుతుంది. ఏమంటారు?

తెలుసా?

‘చికన్‌’ పర్షియన్‌ పదం... చికీన్‌ నుంచి వచ్చింది. అంటే ఎంబ్రాయిడరీ అని అర్థమట. దీని ఉనికి కొన్ని వందల దశాబ్దాల క్రితమే కనిపించినా, మన దేశానికి మాత్రం 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో పరిచయమైంది. చికన్‌కారీ అంటే లఖ్‌నవూ అనేంతగా వేళ్లూనుకుపోయి భారతీయ సంప్రదాయ కళగా గుర్తింపు పొందింది. దీనికి లఖ్‌నవీ చికన్‌కారీ అన్న పేరూ ఉంది. అన్నట్టూ దీనికి 2008లో భౌగోళిక గుర్తింపూ దక్కింది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్