అందంగా... జోడించేద్దాం

హుందాగా, అందంగా కనిపించాలన్నదేగా మన తాపత్రయం. అందుకే దుస్తులపైకి యాక్సెసరీలను ఎంచెంచి కొంటాం. ఎంత ప్రయత్నించినా చిన్న చిన్న లోపాలు ఉసూరుమనిపిస్తాయి కదూ! వాటికి వీటితో చెక్‌ పెట్టేయండి.

Updated : 01 Mar 2024 15:32 IST

హుందాగా, అందంగా కనిపించాలన్నదేగా మన తాపత్రయం. అందుకే దుస్తులపైకి యాక్సెసరీలను ఎంచెంచి కొంటాం. ఎంత ప్రయత్నించినా చిన్న చిన్న లోపాలు ఉసూరుమనిపిస్తాయి కదూ! వాటికి వీటితో చెక్‌ పెట్టేయండి.

దారం చుట్టొద్దు..

శ్రీవారో, తోబుట్టువో ఎంతో ప్రేమతో ఉంగరం తెచ్చారు. లేదూ మనమే ముచ్చటపడి కొనుక్కున్నాం. తీరా అది వదులైతే? ఏం చేస్తాం... దారం చుట్టేస్తాం అంటారా? భోజనం, ఇంటి శుభ్రత దగ్గర్నుంచి ఏ పనులైనా చేతులతో చేయాల్సిందే! ఈ క్రమంలో ఆహార పదార్థాలు, రసాయనాలు, దుమ్ము వంటివన్నీ ఆ దారప్పోగులకి అంటుకుని ఉంటాయి? అంటే... అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టేగా? అలాకాకుండా ఉండాలంటే ఈ ‘సిలికాన్‌ రింగ్‌ అడ్జస్టర్‌’ని తెచ్చేసుకోండి. ఉంగరానికి దీన్ని కావాల్సినంత అమర్చుకుని మిగిలింది కత్తిరిస్తే సరి. బంగారం, వెండి, రోజ్‌గోల్డ్‌... ఇలా భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి. తీసి, శుభ్రం చేసుకుని తిరిగి వాడుకోవచ్చు. చూడటానికీ ఎబ్బెట్టుగా ఉండదు... బాగుంది కదూ!


అమర్చుకోవడమే...

మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ దుస్తుల విషయంలో మనం అనుసరించే పద్ధతే ఇది. ఇప్పుడు నగల వంతు వచ్చింది. నిజానికి ఇప్పుడు ఒకే నగను భిన్నరకాలుగా మార్చుకునే వీలున్న వాటికే ఈతరం ఓటేస్తోంది. మీదీ అదే ధోరణా? అయితే ఈ ‘అడ్జస్టబుల్‌ స్లైడర్‌ చెయిన్‌’ అవసరం మీకున్నట్టే. చిన్న, పెద్ద లాకెట్‌... దేన్నైనా దీనికి అమరిస్తే చాలు. చక్కని బ్రేస్‌లెట్‌ సిద్ధమైపోతుంది. తెలుపు, బంగారు, గులాబీ వర్ణాల్లో దొరుకుతున్నాయి. కాబట్టి, లాకెట్టుకు తగ్గదాన్ని అమర్చుకోవచ్చు. మ్యాచ్‌ చేసుకోవడమే మీ వంతిక. కావాలనిపిస్తే ఆన్‌లైన్‌లో వెతికేయండిక.


జుంకీ... జారదిక...

ఏ రకం వస్త్రధారణ అయినా... కాస్త పెద్ద కమ్మలు పెడితే చాలు. మరే ఆభరణాలూ అవసరం ఉండదు కదూ! సమస్యల్లా... వాటి బరువుకు చెవులు సాగుతూ కనిపిస్తాయి. అంతేనా... తీశాక చెవులు బరువెక్కి నొప్పి అదనం. చిక్కులు తొలగాలా... అయితే ఇయర్‌లోబ్‌ స్టిక్కర్లు తెచ్చేసుకోండి. వీటిని చెవి వెనక అతికించుకుని చెవి కమ్మ పెడితే సరి. చెవీ సాగదు, బరువెక్కి నొప్పీ ఉండదు. కానీ ఆ స్టిక్కర్‌ కనిపిస్తే ఏం బాగుంటుంది అంటారా? గోధుమ, తెలుపు రంగుల్లో దొరుకుతున్నాయి. మరీ పట్టి చూస్తే తప్ప కనిపించవు కాబట్టి, ఆ బెంగా అవసరం లేదు. ప్రయత్నించేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్