బంగారు నగలు.. అందరి బడ్జెట్‌లో..!

బంగారు నగలంటే ఇష్టపడని అమ్మాయిలుంటారా? కానీ, పసిడి ధరేమో సామాన్యులకు అందకుండా పరుగులు పెడుతోంది.  అయినవాళ్ల పెళ్లి... తెలిసినవాళ్ల ఓణీల వేడుక... మన ఇంటి గృహప్రవేశం... ఇలా సందర్భం ఏదైనా మెడలో నిండుగా బంగారు నగలు వేసుకోకపోతే వెలితిగా ఉండదూ! అందుకే తక్కువ ధరలోనే పుత్తడి మెరుపుల్ని మీ సొంతం చేసేందుకు కొత్త దారులెన్నో పుట్టుకొచ్చాయి.

Updated : 31 Mar 2024 07:32 IST

బంగారు నగలంటే ఇష్టపడని అమ్మాయిలుంటారా? కానీ, పసిడి ధరేమో సామాన్యులకు అందకుండా పరుగులు పెడుతోంది.  అయినవాళ్ల పెళ్లి... తెలిసినవాళ్ల ఓణీల వేడుక... మన ఇంటి గృహప్రవేశం... ఇలా సందర్భం ఏదైనా మెడలో నిండుగా బంగారు నగలు వేసుకోకపోతే వెలితిగా ఉండదూ! అందుకే తక్కువ ధరలోనే పుత్తడి మెరుపుల్ని మీ సొంతం చేసేందుకు కొత్త దారులెన్నో పుట్టుకొచ్చాయి. వీటిల్లో కొన్నింటికి రీసేల్‌ వాల్యూ కూడా ఉందండోయ్‌!

ఈ మధ్యే శృతి పెళ్లయ్యింది. ఆ వేడుకలో సందర్భానికో నగ వేసుకుని చుట్టాలందరితోనూ వావ్‌ అనిపించేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి... ఇన్నేసి నగలు కొనడం కష్టమే! కానీ, తన జీవితంలోని అపురూప ఘట్టాన్ని ఆడంబరంగా జరుపుకోవాలనుకుంది. ఇందుకోసమే సెలెబ్రిటీ స్టైల్‌లో గోల్డ్‌కోటెడ్‌ సిల్వర్‌ జ్యూయెలరీని ఎంచుకుంది. అరవై డెబ్బై తులాల బంగారంతో చేయించుకోవాల్సిన ఆభరణాలను... వాటికయ్యే ఖర్చులో పావు వంతు డబ్బుతో కొనేసింది.

రాధకి ఇద్దరు కూతుళ్లు. పండగైనా, వేడుకైనా... సరే, జడకుచ్చులు, అరవంకీ, వడ్డాణం... వంటి ఆభరణాలతో వారిద్దరినీ అలంకరించి మురిసిపోవాలనుకుంటుంది. అసలే మధ్యతరగతి కుటుంబం ఎంత బంగారం కొనగలదు. అలాగని గిల్ట్‌ నగలు కొనడానికీ మనసొప్పలేదు. అప్పుడే ఆమె స్నేహితురాలు గోల్డ్‌ఫిల్డ్‌ జ్యూయెలరీ గురించి చెప్పింది. ఇవి అచ్చంగా బంగారు నగల్లానే ఏళ్లతరబడి మన్నికగా ఉండటంతో ఆనందంగా కొనేస్తోంది.

వీరిద్దరే కాదు... 22 క్యారెట్ల బంగారాన్ని కొనే పరిస్థితి లేదంటూ ప్రత్యామ్నాయం కోరుకునే అన్ని వయసుల మహిళల మనసునీ మెప్పిస్తున్నాయివి. వీటిల్లోనూ ఎన్నో రకాలు. మన అవసరం, బడ్జెట్‌ని బట్టి నచ్చిన నగలెన్నో కొనుక్కోవచ్చు.

వెండే బంగారమాయె...

నిజానికి బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ బంగారంతో పోలిస్తే చాలా తక్కువే. దాంతో సిల్వర్‌ మీద బంగారు పూతతో కోరుకున్న డిజైన్లన్నీ చేసిస్తున్నారిప్పుడు. ప్రత్యేకంగా ఇలాంటివి తయారు చేసే బ్రాండెడ్‌ నగల దుకాణాలూ వచ్చేశాయి. పైగా బంగారానికి పెట్టే ధరలో నాలుగో వంతుని ఖర్చుపెట్టి కొనుగోలు చేసే వీలుండటం, తిరిగి రీసేల్‌ చేయడంతో ఈ తరహా జ్యూయెలరీకి ఆదరణ పెరుగుతోంది. ఇక, ఈ తరహా వెండి నగలకు వజ్రాలు, కెంపులు, పచ్చలు...వంటి మేలు జాతి రాళ్లను చేర్చి ఆధునికంగా తయారు చేయడంతో ఈతరం వారినీ మెప్పిస్తున్నాయి. వీటిలో వాడిన వెండీ, బంగారాల బరువుని బట్టి రీసేల్‌ చేసుకోవచ్చు. విలువైన రాళ్లకూ విడిగా లెక్కించొచ్చు.

గోల్డ్‌ ప్లేటెడ్‌..

అచ్చంగా బంగారంతో చేసినవే అనిపించేలా ఎలక్ట్రోప్లేటింగ్‌ విధానంలో తయారు చేస్తారు వీటిని. అయితే, బేస్‌ మెటల్‌గా ఇత్తడి, రాగి వంటివి వాడతారు. వీటిని నగలుగా చేసి...వాటిపై బంగారాన్ని పూతగా వేస్తారు. ఇవి ఎక్కువ రోజులు మన్నికగా ఉండటమే కాదు... ఒకవేళ రంగు పోయినా తిరిగి మళ్లీ తక్కువ ధరకే వేయించుకోవచ్చు. వన్‌గ్రామ్‌ గోల్డ్‌ పేరుతో మార్కెట్‌లో ఉన్నాయివి. కానీ, కొనేటప్పుడు గిల్ట్‌ నగలకీ, వీటికీ మధ్య తేడా తెలుసుకుని ఎంచుకోవడం మంచిది.

గోల్డ్‌ ఫిల్డ్‌...

ఈ తరహా నగల్ని బేస్‌ మెటల్‌ చుట్టూ తక్కువ బంగారంతో పొరలా డిజైన్‌ చేస్తారు. ఇందులో పసిడి పూత వేసిన జ్యూయెలరీలో ఉండే బంగారం కంటే కాస్త ఎక్కువ పడుతుంది. వీటినే 9, 10, 12, 14, 18క్యారెట్ల నగలుగా వ్యవహరిస్తారు. ఇవి ఎక్కువకాలం మన్నుతాయి. వీటినీ తిరిగి అందులో వాడిన బంగారాన్ని బట్టి, ఆరోజు ఉన్న ధర ఆధారంగా తిరిగి విక్రయించవచ్చు.

గోల్డ్‌ షీట్‌...

ధగధగలాడే బంగారు నగల్ని వేసుకోవాలని ఎవరికుండదు. కానీ, మన బడ్జెట్టే వాటిని కొనేంత ఉండదు మరి, అలాంటివారికోసం ఈ గోల్డ్‌ షీట్‌ జ్యూయెలరీ. వీటి వినియోగం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశంలో మాత్రమే ఎక్కువగా దీన్ని వాడేవారు. ఇప్పుడు మనదగ్గరా వచ్చేశాయి. దీన్నే కాపర్‌ బేస్‌డ్‌ లైట్‌ వెయిట్‌ జ్యూయెలరీ అనీ, బంధేల్‌ అనీ పిలుస్తారు. వీటికి బేస్‌ మెటల్‌గా రాగిని ఎంచుకుంటారు. వీటికీ రీసేల్‌ వాల్యూ ఉంటుంది. అయితే, ఎక్కడ కొన్నారో అక్కడే తీసుకుంటారు. ఈ వస్తువుకి ఉపయోగించిన గోల్డ్‌ పరిమాణం బట్టే ధర నిర్ణయిస్తారు.

తక్కువ బరువుతో...

పెరిగిన బంగారం ఖరీదు మధ్యతరగతివారి ఆశలపై నీళ్లు చల్లకుండా నగల దుకాణాల వారు... లైట్‌వెయిట్‌ జ్యూయెలరీని మార్కెట్‌లోకి తెచ్చారు. బడా బడా బ్రాండ్‌లు సైతం ఆభరణాల బరువుని  20 నుంచి 30 శాతం తగ్గించుకుంటూ లైట్‌వెయిట్‌ రకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో ఈ తరహా నగల్లో ఆధునిక డిజైన్లెన్నో వచ్చి యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్