ఆనాటి లంగాఓణీమళ్లీ రానీ!

పరవళ్లుతొక్కే పడుచుదనం చిందులువేసే చిలిపిదనం వాలుజడ వయ్యారం ఓరచూపు సింగారం మురిపించే మోహనరూపం పదహారణాల తెలుగుదనం ఉగాదివేళ... నట్టింట్లో తిరుగుతుంటే ఎంతందం... లంగాఓణీ సోయగం... అందుకే మళ్లీ వచ్చింది ఆనాటి అందాల సంప్రదాయం..!

Published : 09 Apr 2024 01:35 IST

పరవళ్లుతొక్కే పడుచుదనం చిందులువేసే చిలిపిదనం వాలుజడ వయ్యారం ఓరచూపు సింగారం మురిపించే మోహనరూపం పదహారణాల తెలుగుదనం ఉగాదివేళ... నట్టింట్లో తిరుగుతుంటే ఎంతందం... లంగాఓణీ సోయగం... అందుకే మళ్లీ వచ్చింది ఆనాటి అందాల సంప్రదాయం..!

ఉగాది... పదహారణాల తెలుగమ్మాయిల్ని పట్టి తెచ్చే వేడుక. ఆధునిక ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా... పరికిణీ ఓణీలో మెరిసే బాపూబొమ్మ ముందు అన్నీ తీసికట్టే. అందునా... భారీ ఎంబ్రాయిడరీలూ మెరుపుల లెహంగాల్లా కుట్టించేవి కాకుండా ఆనాటి సంప్రదాయ పరికిణీ ఓణీలో అమ్మాయి అందం రెట్టింపు అవుతుందనడంలో అతిశయోక్తీ లేదు. అందుకే అవే మళ్లీ ట్రెండవుతున్నాయి..!

లాంగ్‌ఫ్రాక్‌లూ, జీన్స్‌ ప్యాంట్లూ టీషర్టులూ... వంటి ఫ్యాషన్లు ఫాలో అయినా... లంగా ఓణీ సంప్రదాయాన్ని మాత్రం నేటితరం మర్చిపోవడం లేదు. మధ్యలో కొంతకాలం పక్కకు వెళ్లినా సినిమాలూ ఫ్యాషన్‌ డిజైనర్ల పుణ్యమా అని లంగాఓణీ కొత్తదనాన్ని నింపుకొని మరీ అమ్మాయిల్ని మురిపిస్తోంది. టీనేజీ అమ్మాయిల్నే కాదు, మూడు పదుల వయసున్న పడుచుల్నీ ఆకర్షిస్తోంది. సంప్రదాయ పరికిణీఓణీలకు కట్‌వర్క్‌, జర్దోసీ వంటి ఎంబ్రాయిడరీ హంగులెన్నో వచ్చి చేరాయి. క్రాప్‌టాప్‌, లెహెంగా... వంటి నయా లుక్‌ని తెచ్చిపెట్టే మార్పులెన్నో కనిపించాయి. అయితే అవన్నీ బోరు కొట్టేశాయో, బరువయ్యాయో తెలియదు కానీ మళ్లీ ఒకప్పటి సంప్రదాయ పరికిణీఓణీలకే మా ఓటు అంటోందీ తరం.

ప్లెయిన్‌ కలర్‌కి బోర్డరు ఉన్న పట్టులంగా, జాకెట్టుమీద సాదా రంగు ఓణీ వేసుకుని... ఇదే లేటెస్ట్‌ స్టైల్‌ అంటోంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. జాన్వీ కపూర్‌ కూడా తిరుమల వచ్చినపుడే కాదు పండగేదైనా పట్టు పరికిణీ ఓణీతో తళుక్కుమంటుంది.

మీరూ మెరవాలంటే...

ఆవ పసుపు, ఎరుపు, ఆకాశ నీలం, చిలకాకుపచ్చ, ముక్కుపొడుం రంగు... ఇలా పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చే రంగుల్లో కంచి లేదా గద్వాల్‌ పట్టు పరికిణీలను ఎంచుకుని, దానిపైకి అదే రంగు లేదా కాంట్రాస్ట్‌ కలర్‌లో సాదా ఓణీ బుట్ట చేతుల జాకెట్టూ వేస్తే అచ్చతెలుగు సౌందర్యం మీదే మరి. కంచిపట్టు కూడా వద్దు కాటనే ముద్దు అనుకునేవాళ్లకి మంగళగిరి, నారాయణ్‌పేట్... వంటి రకాలెన్నో చక్కటి ఎంపిక. సుతిమెత్తని ఆ చేనేత సోయగం మీ అందాన్ని రెట్టింపు చేయడమే కాదు, పండుగ కళ అంతా మీదే మరి!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్