స్ట్రెచ్‌ మార్క్స్‌కి బేకింగ్‌ సోడా..

మహిళలు, యువతుల్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేసే సమస్య స్ట్రెచ్‌ మార్క్స్‌. గర్భధారణ, ఒత్తిడి, బరువు పెరగడం, తగ్గడం వల్ల చర్మం సాగిపోతూ ఉంటుంది.

Published : 18 Apr 2024 01:35 IST

మహిళలు, యువతుల్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేసే సమస్య స్ట్రెచ్‌ మార్క్స్‌. గర్భధారణ, ఒత్తిడి, బరువు పెరగడం, తగ్గడం వల్ల చర్మం సాగిపోతూ ఉంటుంది. చీరలు, లంగావోణీలు, క్రాప్‌టాప్‌లు ఇలా ఏది వేసుకోవాలన్నా స్ట్రెచ్‌ మార్క్స్‌ కనిపిస్తాయేమో అని ఆలోచనలో పడుతుంటాం. వీటిని తగ్గించడానికి కొన్నిసార్లు ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం ఉండదు. ఒకసారి వంటింట్లో దొరికే వీటిని ప్రయత్నించి చూడండి.

బేకింగ్‌సోడా.. అరటీస్పూన్‌ నిమ్మరసంలో  2 చెంచాల బేకింగ్‌ సోడాను కలపండి. మిశ్రమాన్ని స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట రాయండి. కాసేపు ఆరనిచ్చి గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే సరి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, సాగినట్లు కనిపించే గీతల ప్రభావాన్ని తగ్గిస్తుంది. వారంలో మూడుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

ఆలివ్‌ ఆయిల్‌.. గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌కి ఆలివ్‌ ఆయిల్‌ చక్కని ఔషధం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మసమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ నూనెను గోరువెచ్చగా చేసి చర్మం సాగిన ప్రాంతంలో సున్నితంగా మసాజ్‌ చేయాలి. రోజుకోసారి ఇలా చేస్తే చర్మం ముడతలు లేకుండా మృదువుగా ఉంటుంది.

తెల్లసొన.. గుడ్డు తెల్లసొనలో ఉండే అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు కణజాలాలకు శక్తినిస్తాయి. తెల్లసొనను చర్మంపై మందపాటి పొరగా రాసి, కాసేపాగి కడిగేస్తే సరి. మంచి ఫలితాన్నిస్తుంది.


మన కళ్లతో చూస్తే...

శుభకార్యానికి వెళ్లినా, షాపింగ్‌కు వెళ్లినా అక్కడ ఉండే రంగురంగుల చీరలూ, వస్తువుల మీదకు మన చూపు అలా వెళ్లిపోతుంది కదా! భర్తలేమో మీ షాపింగ్‌ తొందరగా తెమలదు అని దెప్పేస్తుంటారు కూడా. అయితే నిజానికి మగవారితో పోలిస్తే మహిళలు 20శాతం ఎక్కువ రంగులను గుర్తించగలరట. అందుకు కారణం జన్యుమార్పులే. మగవారిలో ప్రతి పన్నెండు మందిలో ఒకరికి కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉంటే ఆడవాళ్లలో 255 మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుందట. అంతేనా, పరిశోధనల ప్రకారం కొంతమంది మహిళలు మిగిలిన వాళ్ల కన్నా 99 మిలియన్‌ రంగులను అధికంగా గుర్తించగలరట. సాధారణంగా రంగులను గుర్తించడానికి రెటీనాలో మూడు రకాల కోన్‌ సెల్స్‌ ఉంటే కొంతమందిలో నాలుగు రకాలు ఉంటాయట. వీరిని టెట్రాక్రోమాట్స్‌ అంటారు. అందుకే ఇంద్రధనుస్సుని చూసేటప్పుడు మనకు ఏడు రంగులే కనిపిస్తే, అటువంటి వారు పది రంగులను గుర్తించగలరట. కాబట్టి షాపింగ్‌లో ఎప్పుడైనా ఆలస్యం అయిందేమని ఎవరైనా అడిగితే, అది మా తప్పు కాదు... మా కళ్లది అని చెప్పేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్