ఫోనుకో క్యూట్‌ లుక్‌!

పర్సయినా మర్చిపోతారేమో కానీ ఫోన్‌ లేకుండా కాలు బయట పెట్టదీ తరం. ఓ సెల్ఫీ... స్నేహితులకో హాయ్‌... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అంటూ అరచేతిని వదలనివ్వరు.

Published : 20 Apr 2024 02:03 IST

పర్సయినా మర్చిపోతారేమో కానీ ఫోన్‌ లేకుండా కాలు బయట పెట్టదీ తరం. ఓ సెల్ఫీ... స్నేహితులకో హాయ్‌... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అంటూ అరచేతిని వదలనివ్వరు. ప్రతిదానిలోనూ తమ స్టైల్‌ ప్రతిబింబించాలనే అమ్మాయిలు ఫోన్‌ని మాత్రం అలా ఎలా వదిలేస్తారు? అందుకే వాళ్లని మెప్పించడానికి వచ్చాయీ క్యూట్‌ అలంకరణలు...


అతికించడమే...

అలా బస్‌లో వెళుతూ ఓ పాట... చేయి నొప్పి పెట్టకుండా స్నేహితులతో బాతాఖానీ లాంటివాటికి హెడ్‌సెట్‌, ఇయర్‌బడ్స్‌ ఉండాల్సిందే! ఇప్పుడసలే వైర్‌లెస్‌ వాటిదే హవా. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తోంటే బోరే కదా? కేస్‌ కవర్‌లు కొన్నా కొన్నాళ్లకి పాతబడతాయి. పదే పదే మార్చాలంటే అనవసర ఖర్చు. ఏం చేయాలబ్బా అనిపిస్తోందా? ఈ ఆడియో బడ్‌ ‘స్కిన్‌ రాప్స్‌’ లేదా ‘స్టిక్కర్స్‌’ తెచ్చుకుంటే సరి.

ఇయర్‌బడ్‌ కేస్‌ నమూనాలో కత్తిరించి ఉంటాయి. అతికించుకుంటే సరి. అమ్మాయిలు మెచ్చేలా భిన్న రంగులు, ఆకారాల్లో దొరుకుతున్నాయి. హెడ్‌సెట్‌ కోసమూ ప్రత్యేకంగా ఉన్నాయి. తరవాత నచ్చకపోతే మార్చుకోవచ్చు. మీకు తగినదేదో ఎంచుకోవడమే ఆలస్యం.


అందమైన రక్షణ

ఫోన్‌ని తరచూ శుభ్రం చేస్తుంటాం. కానీ లోపల సంగతేంటి? దాన్ని తెరిచి తుడవలేంగా అంటారా! ఛార్జింగ్‌, హెడ్‌సెట్‌ పోర్ట్‌లను ఓసారి గమనించండి. సన్నటి దుమ్ము కనిపిస్తుంది. అంతేకాదు పొరపాటున నీళ్లు పడి, వాటిల్లోకి చేరాయో అదీ ప్రమాదమే. రక్షణగా ఈ యాంటీ డస్ట్‌ ప్లగ్‌ కవర్‌ని తెచ్చుకోండి.

ఫోన్‌ లోపలికి దుమ్ము, నీళ్లు చేరకుండా అడ్డుకుంటాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా బొమ్మలు, పూలు, స్టోన్‌, డిజైన్లు ఉన్నవి ఎంచుకుంటే సరి. ఫోన్‌కీ రక్షణ, చూడటానికీ లుక్‌ బాగుంటుంది. ఏమంటారు? నచ్చితే... ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి మరి!


ఛార్జర్‌కో ముస్తాబు

ప్రయాణాల్లో... ఫోన్‌, ఇయర్‌బడ్స్‌... ఏది ఛార్జింగ్‌ మర్చిపోయినా వెంట ఛార్జర్‌ తీసుకెళ్లక తప్పదు. సమస్యల్లా ఆ వైరు కొద్దిరోజులకే నల్లబడుతుంది. రాపిడికీ పైపొర తొలగిపోతుంది. కొన్నిసార్లు షాక్‌ కొట్టే ప్రమాదమూ లేకపోలేదు. ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ వచ్చినవే ఈ ఛార్జర్‌ ప్రొటెక్టర్స్‌. అమ్మాయిల మనసు తెలుసుకొని బొమ్మలు, లేత రంగులు, కార్టూన్‌ రూపాల్లోనూ తీసుకొస్తున్నారు. రక్షణకు అందం తోడై భలేగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్