బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!

ఉత్సాహంగా పరుగెడుతోన్న బుజ్జాయి అకస్మాత్తుగా నీరసపడిపోతాడు. అప్పటివరకు కళ్లెదుటే ఆడుకుంటున్న చిన్నారి వీధిలోకి పారిపోతుంది. ఉయ్యాల్లో నిద్రపోతోందనుకుంటున్న పాపాయికి ఎప్పుడు మెలకువ వస్తుందా అని కాపలా కాసుకోవాలి.

Published : 05 May 2024 02:03 IST

ఉత్సాహంగా పరుగెడుతోన్న బుజ్జాయి అకస్మాత్తుగా నీరసపడిపోతాడు. అప్పటివరకు కళ్లెదుటే ఆడుకుంటున్న చిన్నారి వీధిలోకి పారిపోతుంది. ఉయ్యాల్లో నిద్రపోతోందనుకుంటున్న పాపాయికి ఎప్పుడు మెలకువ వస్తుందా అని కాపలా కాసుకోవాలి. వీటన్నింటికీ పరిష్కారంగా గ్యాడ్జెట్లు వచ్చాయి.


జ్వరం గుర్తించొచ్చు...

చిన్నారులు హుషారుగా ఉన్నంతసేపూ చూడముచ్చటగా ఉంటుంది. అనుకోకుండా ఒళ్లు వెచ్చబడి, వాళ్ల ముఖంలో నీరసం కనిపిస్తే చాలు. పెద్దవాళ్లలో భయం మొదలవుతుంది. ఇలాంటప్పుడు ఆసుపత్రికంటూ వెంటనే పరుగెత్తకుండా ఈ గ్యాడ్జెట్‌లు తక్షణ ఉపాయంలా పని చేస్తాయి. మధ్యవేలికి నడుమ ఈ చిన్న పరికరాన్ని ఉంచుకుని పిల్లల నుదురుపై ఆ చేతిని నిమిషం పాటు ఆన్చినా, పాల పీకలాంటి గ్యాడ్జెట్‌ను వారి నోటిలో ఉంచినా కూడా జ్వరం తీవ్రతను గుర్తించొచ్చు.

ఏడాదిలోపు పసిపిల్లలకైతే, సాక్స్‌లాంటి బెల్ట్‌కు అటాచ్డ్‌ గ్యాడ్జెట్‌ వస్తోంది. వాళ్లు నిద్రపోతున్నప్పుడు డిస్ట్రబ్‌ చేయకుండా గుండె వేగం, ఆక్సిజన్‌ స్థాయులను దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలానే తిరగేసిన జెడ్‌ ఆకారంలో చిన్నగా ఉండే దీన్ని పిల్లల ఛాతీ పక్కన స్టిక్కర్‌లా అంటించాలి. ఆపై యాప్‌ ద్వారా ఫోన్‌కు అనుసంధానం చేస్తే సరి. టెంపరేచర్‌ వివరాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యుల సలహా తీసుకోవచ్చు.


కదలికలను గుర్తించొచ్చు...

చిన్నారి నిద్ర మధ్యలో లేచినా, ఏదైనా అసౌకర్యానికి గురైనా వెంటనే గుర్తించడానికి ఈ మానిటర్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీన్ని ఫోన్‌కు అటాచ్‌ చేస్తే, వాళ్ల కదలికను ఎప్పటికప్పుడు చూడొచ్చు.


ఎక్కడున్నారో కనిపెట్టేద్దాం...

పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు ఒక్క క్షణం వారి నుంచి దృష్టి మళ్లించినా చాలు. దూరంగా పరుగెడుతుంటారు. ఇలాంటివారెప్పుడైనా మీ కనుసన్నల నుంచి తప్పించుకుంటే ఇట్టే వాళ్ల ఉనికిని తెలియచేస్తాయి ఈ యాక్సెసరీలు. బూట్లలో అమర్చిన జీపీఎస్‌తో వారెక్కడున్నారో సులువుగా గుర్తుపట్టేయొచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ సాయంతో నిరంతరం వారిపై ఓ కన్నేసి ఉంచొచ్చు.


గోరువెచ్చని నీటికోసం...

నెలల వయసున్న పాపాయికి స్నానం చేయించాలంటే గోరువెచ్చని నీళ్లుండాల్సిందే. నీటి వేడిలో ఎక్కువ లేదా తక్కువ ఉన్నా.. బుజ్జాయికి అసౌకర్యమే. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ వాటర్‌ టెంపరేచర్‌ గ్యాడ్జెట్‌. టబ్‌ లేదా బకెట్‌ నీటిలో దీన్నుంచితే నీటి వేడి తెలుస్తుంది. ఆ ప్రకారం కావాల్సినంత వేడి ఉండేలా నీటిని సిద్ధం చేస్తే పాపాయికి స్నానం హాయిగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్