నేటితరానికి... నయా మీనాకారి!

తరాలు మారినా కొన్నిమాత్రం బోర్‌ అనిపించవు. వాటిల్లో మీనాకారి నగలు ఒకటి. అందుకే పెళ్లయినా వేడుకలైనా చాలామంది మగువల మనసు వీటివైపే మళ్లుతుంది. సంప్రదాయ లుక్‌ని ఇస్తూనే భారీతనాన్నీ అందించడం మీనాకారి ప్రత్యేకత.

Published : 28 May 2024 01:49 IST

తరాలు మారినా కొన్నిమాత్రం బోర్‌ అనిపించవు. వాటిల్లో మీనాకారి నగలు ఒకటి. అందుకే పెళ్లయినా వేడుకలైనా చాలామంది మగువల మనసు వీటివైపే మళ్లుతుంది. సంప్రదాయ లుక్‌ని ఇస్తూనే భారీతనాన్నీ అందించడం మీనాకారి ప్రత్యేకత. అసలు దీని అర్థమేంటో తెలుసా? పర్షియన్‌ భాషలో ‘మీనా’ అంటే స్వర్గం అని అర్థమట. మొత్తంగా స్వర్గపు అందాల్ని పొదగడమనే భావం స్ఫురిస్తుంది. అక్కడి ఆ అందం మొగలుల కాలంలో దేశానికి పరిచయమైంది. శతాబ్దాల నాటిదైనా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. బంగారం, వెండి, కాపర్‌ లోహాలపై భిన్నరంగుల ఎనామిల్‌ను తీర్చిదిద్దడం మీనాకారి ప్రత్యేకత. పూలు, నెమళ్లు, క్లాసిక్‌ మోటిఫ్‌ల్లో ఇమిడి నగకే ప్రత్యేకత తెస్తుంది. ఇప్పుడు వివాహాల్లేవు. బంగారం, వెండి ధరలా... ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటప్పుడు వీటి ప్రస్తావన ఎందుకు అనిపిస్తోందా? దుస్తులేవైనా, సందర్భమేదైనా ఎన్నో కొన్ని నగలు మేనిపై మెరవాల్సిందే కదా! పైగా ఇప్పుడంతా కాంటెంపరరీ ఫ్యాషన్‌ జ్యూయెలరీలదే హవా. తాజాగా మీనాకారి వాటిల్లోకీ అడుగుపెట్టింది. ఈ నగలన్నీ అవే. దిద్దులు, జుంకాలు, చెయిన్లు, ఉంగరాలు, బ్రేస్‌లెట్లు, నెక్లెస్‌లు... అంతెందుకు, రోజువారీ నల్లపూసల్లోనూ ఇలా ట్రెండీగా అమరిపోయింది. జిర్కాన్‌ వంటి సెమీ ప్రీషియస్‌ రాళ్లు నగలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి కదూ! నేటితరం అమ్మాయిల మనసునీ, బడ్జెట్‌నీ దృష్టిలో పెట్టుకొని మరీ కాపర్, తేలికపాటి వెండి, రోజ్‌ గోల్డ్‌ల్లో తీసుకొస్తున్నారు. ఈ నయా అందాలు మీ మనసూ దోచినట్టున్నాయే! ఇంకేం ట్రెండీ నగలతో మేనిని మెరిపించేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్