తినాలనిపించడం లేదా?

నిన్న మొన్నటిదాకా ఎండలు దంచేశాయి. చల్లచల్లగా, కూల్‌కూల్‌గా ఏం తిందామా అనిపించేది. కానీ ఎండల్ని తరిమేసి వర్షాలొచ్చాయి. జలుబూ జ్వరాల్ని వెంటబెట్టుకొచ్చాయి. కడుపులో ఆకలి రొదపెడుతున్నా నాలుక ససేమిరా అంటూ మొరాయిస్తోంది. ఏదీ రుచించదు.. దేన్నీ తినాలనిపించదు.. చాలామందిలా మీ పరిస్థితీ ఇలాగే ఉందా? కానీ ఇల్లాలికి అంత వెసులుబాటు కూడానా?! కనుక తక్షణం ఇది చదివేయండి.. హమ్మయ్య మార్గం దొరికిందనుకుంటారు...

Updated : 09 Jul 2022 05:20 IST

నిన్న మొన్నటిదాకా ఎండలు దంచేశాయి. చల్లచల్లగా, కూల్‌కూల్‌గా ఏం తిందామా అనిపించేది. కానీ ఎండల్ని తరిమేసి వర్షాలొచ్చాయి. జలుబూ జ్వరాల్ని వెంటబెట్టుకొచ్చాయి. కడుపులో ఆకలి రొదపెడుతున్నా నాలుక ససేమిరా అంటూ మొరాయిస్తోంది. ఏదీ రుచించదు.. దేన్నీ తినాలనిపించదు.. చాలామందిలా మీ పరిస్థితీ ఇలాగే ఉందా? కానీ ఇల్లాలికి అంత వెసులుబాటు కూడానా?! కనుక తక్షణం ఇది చదివేయండి.. హమ్మయ్య మార్గం దొరికిందనుకుంటారు...

తోటకూర, పాలకూర, బచ్చలికూర.. ఇలా బోల్డన్ని ఆకుకూరలున్నాయి కదా! వీటిని సాధారణంగా కందిపప్పుతో సహా ఉడికించి తాలింపు వేసుకుని తింటాం. కానీ ఈ కాలంలో ఆకుకూర పప్పు అంతగా రుచించదు. కనుక కడిగి, కోసిన ఆకుకూరకు తాలింపు వేసి మూత పెట్టి మగ్గనిచ్చి కారానికి బదులు మిరియాల పొడి వేసి తినండి. నోటికి హితవుగా ఉంటుంది.

క్యారెట్‌, బీన్స్‌ లాంటి కూరగాయలను ఉడికించి సూప్‌ చేసుకోండి. వేడి వేడిగా తాగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి కావలసినంత శక్తి కూడా.

ఏ కూరలూ సహించడం లేదా! అయితే ఈ చిన్న చిట్కా పాటించండి... వెల్లుల్లి పొట్టు తీసేసి నేతిలో వేయించి చిటికెడు ఉప్పు వేసుకుని రెండు ముద్దలు తినండి. మహా రుచిగానూ ఉంటుంది, అరుచి, జలుబూ ఇట్టే తగ్గిపోతాయి. నెయ్యి గనుక సమయానికి లేకపోతే వేడి అన్నం మధ్యలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఉంచి మగ్గనిచ్చి కూడా తినొచ్చు.

చిలగడ దుంపలను ఉడికించి పొట్టు తీసి తినేయండి. ఒకపూట అన్నం తినకపోయినా నీరసంగా అనిపించదు.

ఓ చిన్న అల్లం ముక్క లేదా జీలకర్ర నమిలి తినండి. సహించకపోవడం అన్నది ఇట్టే తగ్గుతుంది. యథాతథంగా తినలేకపోతే నీళ్లలో మరిగించి, చల్లార్చి తాగండి.

వానాకాలంలో కూరల్లో వీలైనంతవరకూ కారం ఉపయోగించొద్దు. ప్రత్యామ్నాయంగా అల్లం ముద్ద లేదా మిరియాల పొడి వేయండి. జలుబూ జ్వరాల నుంచి ఉపశమనం లభించడమే కాదు, ప్రత్యేకమైన రుచీ, పరిమళం వస్తాయి.

టీ తాగే అలవాటుంటే అల్లం టీ లేదా డికాక్షన్‌ ఫ్లాస్కులో పోసుకుని పక్కనే పెట్టుకోండి. కాసేపటికోసారి ఓ గుక్కెడు తాగుతుంటే జలుబు వల్ల కలిగే చిరాకు తగ్గుతుంది. చాయ్‌ అలవాటు లేకుంటే ఇలాచీ, మిరియాల పొడి కలిపిన వేడి పాలను ఫ్లాస్కులో పోసుకుంటే సరి.

ఉరుకు పరుగుల హడావుడి జీవితంలో వీలును బట్టి వంట చేసేసి తర్వాత ఇతర పనులు చేసుకుంటాం. కానీ ఈ కాలంలో మాత్రం అన్ని పనులూ అయ్యాకే వంట జోలికెళ్లండి. అప్పుడే వేడివేడిగా తినొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్