బరువు తగ్గడం లేదా...

ఆరతి డైటింగ్‌ చేస్తూ.. అధికబరువు నుంచి బయటపడాలనుకుంటోంది. అయితే ఆహారనియంత్రణ, వ్యాయామాలు... ఇలా ఏం చేసినా రోజులు గడుస్తున్నాయి కానీ అనుకున్నట్లుగా బరువు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం చిన్నచిన్న పొరపాట్లే అంటున్నారు నిపుణులు.

Updated : 17 Jul 2022 09:00 IST

ఆరతి డైటింగ్‌ చేస్తూ.. అధికబరువు నుంచి బయటపడాలనుకుంటోంది. అయితే ఆహారనియంత్రణ, వ్యాయామాలు... ఇలా ఏం చేసినా రోజులు గడుస్తున్నాయి కానీ అనుకున్నట్లుగా బరువు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం చిన్నచిన్న పొరపాట్లే అంటున్నారు నిపుణులు.


నిద్రలేమి...

రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తిమంతంగా మారుస్తుంది. నిద్రకు దూరమైతే అదనపు సమస్యలు వస్తాయి. కంటినిండా నిద్ర ఉంటేనే శరీరం తనకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసుకొని, వ్యాయామాలకు తగినట్లుగా సహకరిస్తుంది. లేదంటే వర్కవుట్లు చేసే సమయంలో శక్తిహీనంగా మారి, తగినంత సేపు వ్యాయామాలను చేయనివ్వదు. నిద్రపోకుండా, ఫోన్‌లో గంటలతరబడి ఉండటం, నచ్చిన చిరుతిళ్లు లాగిస్తూ ఉండటం బరువు మరింత పెరగడానికి దోహదపడతాయి. ఫోన్‌కు నిర్ణీత సమయాన్ని కేటాయించుకుంటూ నిద్రలేమి లేకుండా చూసుకోవాలి.


ఆహారం...

సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దాటవేయకూడదు. తినకుండా ఉంటే త్వరగా బరువు తగ్గొచ్చు అనేది సరైనది కాదు. అలాచేస్తే  నిరంతరం ఆకలి వేయడం మొదలవుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలను కోల్పోతుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యం ప్రభావితమై, చిరుతిళ్లపై ఆసక్తిని పెంచే ప్రమాదం ఉంది. ఫలితంగా కొవ్వు కరిగించే ప్రయత్నాలు విఫలమై, అధిక బరువు సమస్య ఎన్నటికీ తీరదు. పోషక విలువలున్న ఆహారానికి పెద్దపీట వేయాలి. తాజా పండ్లలో ఉండే పీచు త్వరగా ఆకలి వేయనివ్వదు. జీర్ణశక్తిని మెరుగుపరిచి, బరువు సమస్యను దూరం చేస్తుంది.  


అధికంగా..

ప్రతి వ్యాయామానికి నిర్దేశిత సమయం ఉంటుంది. సన్నబడాలనే ఆసక్తితో ఎక్కువసేపు వర్కవుట్లు చేయకూడదు. ఇలా చేస్తే కెలోరీలు తగ్గడం అటుంచి, శరీరం అలసిపోయి దేనికీ సహకరించదు. అలాకాకుండా ఆహారంలో పోషకాలుండేలా జాగ్రత్తపడి, వేపుళ్లు, నూనె వంటకాలు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే వీటిలో ఉండే ఉప్పు, చక్కెర స్థాయులు బరువును పెంచుతాయి. జీవనశైలిని ఆరోగ్యంగా ఉంచుకోగలిగితేనే అనుకున్న ఫలితాలను పొందొచ్చు.


నీరు..

శరీరానికి అందాల్సిన నీరు తగ్గితే డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. ఇది మళ్లీ చిరుతిళ్ల వైపు నడిపిస్తుంది. అవయవాలన్నీ సక్రమంగా పని చేయాలంటే శరీరంలో నీటి శాతం తగినంత ఉండాలి. శరీరంలోని శక్తి స్థాయులు పెరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా కావాల్సినంత నీరు అందాలి. అప్పుడే జీవక్రియల రేటు పెరిగి, బరువు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్