రంగులతో మెదడుకు ఆరోగ్యం

వర్ణభరితమైన ఆహారం మహిళలను ఎక్కువకాలం జీవించేలా చేస్తుందని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. పిగ్మెంటెడ్‌ కెరోటినాయిడ్స్‌ పుష్కలంగా ఉండే పుచ్చకాయ, బెల్‌పెపర్స్‌, టమాటా, నారింజ, క్యారెట్‌, ఆకు కూరలను రోజూ తీసుకుంటే

Published : 04 Aug 2022 18:19 IST

వర్ణభరితమైన ఆహారం మహిళలను ఎక్కువకాలం జీవించేలా చేస్తుందని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. పిగ్మెంటెడ్‌ కెరోటినాయిడ్స్‌ పుష్కలంగా ఉండే పుచ్చకాయ, బెల్‌పెపర్స్‌, టమాటా, నారింజ, క్యారెట్‌, ఆకు కూరలను రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జార్జియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం ఏం చెబుతోందంటే...

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి మానసిక అనారోగ్యాలు, నేత్ర సంబంధిత సమస్యలెక్కువగా ఉన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలే. ఏళ్ల తరబడి ఈ తరహా అనారోగ్యాలు మహిళల్లోనే అధికంగా కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులతో ఈ ప్రమాదాల్ని తప్పించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మహిళలు తీసుకునే ఆహారం ద్వారా వారి శరీరానికి చేరాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు పూర్తిగా అందడం లేదని ఈ అధ్యయనం గుర్తించింది. మగవారికన్నా మహిళలకు ఎక్కువగా కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ కొవ్వు విటమిన్లు, ఖనిజలవణాలను పీల్చుకుంటోంది. దీంతో శరీరానికి కావాల్సింది అందడం లేదు. ముఖ్యంగా రెటీనా, మెదడుకు పోషకాలు కావాల్సిన దానికన్నా తక్కువగా అందుతున్నాయి. దీంతో మెనోపాజ్‌ రాకముందే ఆలోచన శక్తి క్షీణించడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులోనే నేత్ర వ్యాధులకూ గురవుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత పిగ్మెంటెడ్‌ కెరోటినాయిడ్స్‌ అందించాలి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా మారి, మెదడును చురుకుగా ఉంచుతాయి. పిగ్మెంటెడ్‌ కెరోటినాయిడ్స్‌ సహా బయోఏక్టివ్‌ కాంపౌండ్స్‌ పుష్కలంగా ఉండే ఎరుపు వర్ణం కూరగాయలు, పండ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి దూరం కాదు. నారింజ, పసుపు రంగులో ఉండే బీటా కెరోటిన్‌.. శరీరంలో విటమిన్‌ ఏ గా మారి నేత్ర సమస్యలను రానివ్వదు. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మెదడును చురుకుగా ఉంచుతాయి. ఈ వర్ణాలన్నీ ఆహారంలో రోజూ ఉండేలా జాగ్రత్తపడాలి. కొవ్వు పెరగకుండా నిత్యం కనీసం అరగంట వ్యాయామం తప్పని సరిగా చేయాలి. ఇలా జీవనశైలిని మార్చుకుంటే చాలు అనారోగ్యాలు దరిచేరవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్